AP news: ప్రజలిచ్చింది పదవులు కాదు.. బాధ్యత

‘ప్రజలు మనకు పదవులు ఇవ్వలేదు. మన భుజస్కంధాలపై బాధ్యత పెట్టారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, భాజపాతో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని నిర్ణయించారు.

Published : 23 Jun 2024 06:44 IST

శాసనసభకు మంచి గౌరవం, గుర్తింపు తీసుకురావాలి
88 మంది తొలిసారిగా సభలోకి అడుగుపెట్టారు
అందరూ మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తాను
సభ్యుల అభినందనలకు కృతజ్ఞతలు తెలిపిన సభాపతి అయ్యన్నపాత్రుడు
జీవితాన్నిచ్చిన తెదేపా జెండా కప్పుకొనే చనిపోవాలనుకుంటానని వ్యాఖ్య

అయ్యన్నపాత్రుడిని సంప్రదాయబద్ధంగా స్పీకర్‌ స్థానంలో కూర్చోబెట్టేందుకు వచ్చిన ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్‌

ఈనాడు, అమరావతి: ‘ప్రజలు మనకు పదవులు ఇవ్వలేదు. మన భుజస్కంధాలపై బాధ్యత పెట్టారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, భాజపాతో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని నిర్ణయించారు. చంద్రబాబుకు సమర్థ పాలన చేసే శక్తి ఉందని భావించారు’ అని సభాపతి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తనను అభినందిస్తూ సభ్యులు చేసిన ప్రసంగాలకు కృతజ్ఞతలు చెబుతూ ఆయన మాట్లాడారు. ‘1983లో ఎన్టీఆర్‌ హయాంలో ఎక్కువ సీట్లు వచ్చాయి గానీ, ఇప్పుడొచ్చినంత మెజారిటీలు రాలేదు. ఈసారి ఎమ్మెల్యేలకు ఎంపీలకు వచ్చినంత మెజారిటీలు వచ్చాయి. మొదటిసారి ఎమ్మెల్యేలుగా సభలోకి అడుగుపెట్టినవారు 88 మంది ఉన్నారు. మీ అందర్నీ కోరేది ఒక్కటే. మీకు సమయం ఇస్తాను. సభలో రాష్ట్రం, ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడాలి. సమయం చాలదనుకుంటే సమావేశాలను రెండు, మూడు రోజులు పొడిగిద్దాం. సమస్యల గురించి మా ఎమ్మెల్యే మాట్లాడారని ప్రజలకు ఆలోచన వచ్చేలా ప్రవర్తించాలి. దీన్ని ఉపయోగించుకొని సభను సజావుగా.. ఎప్పుడూ జరగనంత ఫలప్రదంగా నిర్వహించుకోవాలి’ అని అయ్యన్నపాత్రుడు సూచించారు.

సభలో ప్రశ్నలు వేయడం నేర్చుకోవాలి

‘సభ్యులు శాసనసభకు వచ్చాం.. వెళ్లిపోయాం అన్నట్లు ఉండకూడదు. సభలో ప్రశ్నలు ఎలా వేయాలో నేర్చుకోవాలి. ప్రజంటేషన్‌ తెలుసుకోవాలి. అవసరమైతే శిక్షణ పెడదాం. రాష్ట్ర భవిష్యత్తుతోపాటు నియోజకవర్గాల భవిష్యత్తును ముందుకు తీసుకువెళ్లాలి. సభలో జరిగే అంశాన్ని బయట లక్షల మంది చూస్తారు. ఈ ఐదేళ్లూ కష్టపడి ముందుకెళ్లాలి. స్పీకర్‌ తక్కువగా మాట్లాడాలి. సభ్యులు ఎక్కువగా మాట్లాడాలి. ఆ అవకాశాన్ని నేను కల్పిస్తాను. 16వ శాసనసభకు మంచి గుర్తింపు, గౌరవం వచ్చేలా అందరూ సహకరించాలని కోరుతున్నాను. మనకు ఈ ఉన్నతమైన బాధ్యతను అప్పగించిన ప్రజలందరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు.   

జీవితాన్ని ఇచ్చింది తెదేపానే..

‘ఎన్టీఆర్‌ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చాను. 42 ఏళ్ల నా రాజకీయ జీవితంలో గెలిచినా, ఓడినా ప్రజాజీవితంలోనే గడిపాను. నాకు జీవితాన్ని ఇచ్చింది తెదేపా. బతికున్నంత కాలం తెదేపాలోనే. తెదేపా జెండా కప్పుకొని చచ్చిపోవాలని అనుకుంటానే తప్ప వేరే ఆలోచనలేదు. ఏ పదవిలో ఉన్నా జీవితాన్ని ఇచ్చినవారిని మర్చిపోతామా? శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, తెదేపా, జనసేన, భాజపా శాసనసభ్యులకు నమస్కారాలు. గతంలో ఎంతోమంది సభాపతులుగా పని చేశారు. స్పీకర్‌గా తంగి సత్యనారాయణ, ప్రతిభాభారతి, యనమల రామకృష్ణుడు, నారాయణరావు, కోడెల శివప్రసాదరావు విలువలతో సభను సక్రమంగా నిర్వహించారు. కొన్ని చిన్నచిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. ఇది గౌరవ సభ. సభాపతి స్థానం పవిత్రమైంది’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని