Rammohan Naidu: రెండేళ్లలో భోగాపురం విమానాశ్రయం పూర్తి

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరో రెండేళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చెప్పారు.

Published : 10 Jul 2024 05:05 IST

2026 నాటికి అందుబాటులోకి తెస్తాం
కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

నిర్మాణాలకు సంబంధించిన మ్యాప్‌ గురించి కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడికి వివరిస్తున్న అధికారులు

ఈనాడు- విజయనగరం, న్యూస్‌టుడే- భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరో రెండేళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చెప్పారు. దేశంలోనే నంబర్‌ వన్‌గా తీర్చిదిద్ది 2026 నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ మేరకు మంగళవారం సంబంధిత పనులు, నిర్మాణాల తీరు, మ్యాప్‌లను ఆయన పరిశీలించారు. అధికారులతో సమీక్ష అనంతరం విలేకర్లతో మాట్లాడారు. విమానాశ్రయం పూర్తయితే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారతాయన్నారు. 2015లో తెదేపా ప్రభుత్వ హయాంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ..అప్పటి కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజుల ఆలోచనల నుంచే ఈ ప్రాజెక్టు పుట్టిందన్నారు. 2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులూ వచ్చాయన్నారు. 2019లో టెండరు ప్రక్రియ పూర్తి చేసి శంకుస్థాపన చేశారని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం మళ్లీ శంకుస్థాపన చేపట్టిందని, పనుల్లో తీవ్ర జాప్యం చేసిందని మండిపడ్డారు.

25 శాతం పూర్తి..

‘జీఎంఆర్‌ సంస్థ ఆధ్వర్యంలో 25 శాతం పనులు పూర్తయ్యాయి. యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని ఆదేశించాం. ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 డిసెంబరు నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయిస్తాం. టెర్మినల్‌ భవనాలు, 3.8 కి.మీ మేర రన్‌వే నిర్మిస్తున్నాం’ అని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రగతికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పెద్దపీట వేస్తున్నారని  చెప్పారు. ‘భోగాపురానికి సులువుగా చేరుకునేందుకు జాతీయ రహదారికి అవసరమైన మార్పులు చేస్తాం. విశాఖ నుంచి సముద్ర తీరానికి సమాంతరంగా మరో రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు.

ప్రభుత్వ అధీనంలోనే..

‘ప్రభుత్వం సేకరించిన 2,702 ఎకరాల్లో 2202 ఎకరాలు విమానాశ్రయానికి కేటాయించారు. మిగిలిన 500 ఎకరాలను గత ప్రభుత్వం పక్కన పెట్టింది. ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తాం. స్థానికంగానే 140 రకాల అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గత పదేళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపైంది. ఈమేరకు విమానాల సంఖ్య పెరగాలి. ఆ దిశగా కృషి చేస్తున్నాం. నిలిచిపోయిన 110 విమానాలను నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని మంత్రి చెప్పారు. ఆయన వెంట విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు లోకం నాగమాధవి, అదితి గజపతిరాజు, జిల్లా కలెక్టర్‌ అంబేడ్కర్, జేసీ కార్తీక్‌ తదితరులున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని