Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయానికి కొత్త రెక్కలు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విజయనగరం జిల్లా భోగాపురంలో చేపడుతున్న అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కొత్త రెక్కలు వస్తున్నాయి.

Updated : 11 Jul 2024 09:19 IST

కూటమి ప్రభుత్వం రాకతో ఊపందుకున్న నిర్మాణం

భోగాపురంలో జరుగుతున్న విమానాశ్రయ పనులు

ఈనాడు-విజయనగరం, భోగాపురం-న్యూస్‌టుడే: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విజయనగరం జిల్లా భోగాపురంలో చేపడుతున్న అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కొత్త రెక్కలు వస్తున్నాయి. గత తెదేపా హయాంలో మంజూరైన విమానాశ్రయానికి అప్పటి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ఆధ్వర్యంలో అనుమతులు మంజూరయ్యాయి. అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌.. రెండున్నరేళ్లలో పూర్తయ్యేలా జీఎంఆర్‌ సంస్థకు ప్రభుత్వం సహకరిస్తుందని ప్రకటించారు. ఐదేళ్లూ స్పందించలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం చంద్రబాబు తొలిసారి గురువారం విమానాశ్రయం పనుల పరిశీలనకు వస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో భోగాపురం విమానాశ్రయంలో 25% పనులు కూడా చేయలేదు. నాలుగేళ్లూ దీని ఊసెత్తకుండా ఎన్నికల ముందు హడావుడి చేశారు. తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి విమానాశ్రయం వరకు నీటి సరఫరాకు రూ.198 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు.

2026 జనవరికి రన్‌వేపై తొలి విమానం

నిర్ణీత గడువుకు ముందే పూర్తయ్యేలా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ నెల 9న విమానాశ్రయం పనులు పరిశీలించిన పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు. 2026 జనవరి నాటికి తొలి విమానం రన్‌వేపై దిగేలా ప్రత్యేక శ్రద్ధ చూపుతామన్నారు. 

జీఎంఆర్‌ ప్రత్యేక శ్రద్ధ

జీఎంఆర్‌ సంస్థ దీనిపై ప్రత్యేకశ్రద్ధ చూపుతోంది. సముద్రతీరంలో నిర్మిస్తున్నందున మీనాకారంలో 3.8 కి.మీ. పొడవున రెండు రన్‌వేలు, టెర్మినల్‌ టవర్, ఎయిర్‌ఫీల్డ్‌ అభివృద్ధి చురుగ్గా చేపడుతోంది. టాక్సీవే, ఎయిర్‌ఫీల్డ్‌ గ్రౌండ్‌ లైటింగ్‌ పనులు త్వరలో ప్రారంభించాలని నిర్ణయించింది. జాతీయరహదారిపై ప్రయాణించే వాహనాలకు ఇబ్బంది లేకుండా అనుసంధాన రహదారిని కలిపేందుకు ‘8’ ఆకారంలో ట్రంపెట్‌ నిర్మిస్తారు. ఇందుకు 25 ఎకరాలు సేకరించారు. 

కోస్టల్‌ కారిడార్‌కు 88 ఎకరాలు

ఎయిర్‌పోర్టు చుట్టూ అధునాతన ప్రాజెక్టులకు అడుగులు పడుతున్నాయి. జిల్లాలో కోస్టల్‌ కారిడార్‌కు ఇప్పటికే సర్వే పూర్తిచేసినట్లు సమాచారం. తీర గ్రామాల మీదుగా రెడ్డికంచేరు వరకు బీచ్‌రోడ్డు నిర్మించి, విమానాశ్రయ రహదారికి అనుసంధానిస్తామని అధికారులు ప్రకటించారు. భీమిలి నుంచి భోగాపురం వరకు బీచ్‌రోడ్డు నిర్మాణానికి రూ.1,021 కోట్లు ఖర్చవుతుందని అంచనా. విమానాశ్రయ భూసేకరణలో ఇతర అవసరాలకు ఉంచిన 500 ఎకరాల్లోనే 88 ఎకరాల వరకు బీచ్‌ కారిడార్‌కు ఇవ్వనున్నారు. దీనికి ఇరువైపులా సైక్లింగ్‌ ట్రాక్‌లు, నడకదారులు, ఉద్యానాలు రానున్నాయి. ఇది పూర్తయితే పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు వచ్చే అవకాశాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని