Andhra Pradesh: సర్వే రాళ్ల వెనుక పెద్ద కుట్ర!

జగన్‌ ప్రభుత్వంలో ఏ పథకం చేపట్టినా దాని వెనుక స్వప్రయోజనాలు ఉన్నట్లు ఇప్పటికే అనేక అంశాల్లో బయటపడింది. తాజాగా సర్వేరాళ్ల వెనుక నడిచిన కథ బయటికొచ్చింది.

Published : 14 Jun 2024 05:17 IST

 రాళ్ల కటింగ్‌ మిషన్ల కొనుగోలులో భారీ స్కెచ్‌
అర్హతలేని కంపెనీల పేరిట తీసుకునే యత్నాలు 
వ్యూహాత్మకంగా వ్యవహరించిన మైనింగ్‌ ‘ఘనుడు’ 
లోగుట్టు బయటకు రావడంతో చివర్లో ఆగిన దోపీడీ 
ప్రభుత్వం మారడంతో తాజాగా దస్త్రాలు మాయం 

ఈనాడు-అమరావతి: జగన్‌ ప్రభుత్వంలో ఏ పథకం చేపట్టినా దాని వెనుక స్వప్రయోజనాలు ఉన్నట్లు ఇప్పటికే అనేక అంశాల్లో బయటపడింది. తాజాగా సర్వేరాళ్ల వెనుక నడిచిన కథ బయటికొచ్చింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థను (ఏపీఎండీసీ) తన జేబు సంస్థగా మార్చుకొని దాదాపు నాలుగేళ్లపాటు ఊడ్చేసిన ఇన్‌ఛార్జి ఎండీ వీజీ వెంకటరెడ్డి.. ఇంతకాలం చేసిన దోపిడీపర్వాలు, అడ్డగోలు వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సర్వే రాళ్ల తయారీ యూనిట్ల ఏర్పాటు, యంత్రాల కొనుగోళ్లలో భారీ స్కెచ్‌ వేసినట్లు తాజాగా వెల్లడైంది. అర్హత లేని సంస్థలకు టెండర్లు అప్పగించి, రూ. కోట్లు కొట్టేయాలని చూసినట్లు బయటపడింది. జగన్‌ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే.. సర్వే రాళ్ల వెనుక దాగిన కుట్ర ఇది. ఏపీఎండీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నాలుగుచోట్ల సర్వే రాళ్ల కటింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో వెంకటరెడ్డితోపాటు, విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ నుంచి డిప్యుటేషన్‌పై ఏపీఎండీసీకి వచ్చి.. టెండర్లు, ప్రొక్యూర్‌మెంట్‌ విభాగం జీఎం బోస్‌ కలిసి భారీగా లబ్ధి పొందడానికి చూశారు. ఒక్కో యూనిట్‌కు రూ. 12-13 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే ఓ అధికారి రాజస్థాన్‌ వెళ్లి విచారణ చేయగా రూ. 3-4 కోట్లకే లభిస్తుందని గుర్తించారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి టెండర్లు పిలిచారు. ఇదే సమయంలో ప్రొక్యూర్‌మెంట్‌ జనరల్‌ మేనేజర్‌ బోస్‌.. తనకు పరిచయం ఉన్న ఒడిశాకు చెందిన ఉత్కళ్‌ అనే కంపెనీని రంగంలోకి దించారు. దానితోపాటు, మరో రెండు కంపెనీలతో బిడ్లు వేయించారు. ఒకే వ్యక్తి ఈ మూడు కంపెనీల్లోనూ డైరెక్టర్లుగా ఉన్నా నిబంధనలకు నీళ్లొదిలి టెండరు అప్పగించారు. బాపట్ల జిల్లా బల్లికురవలో మొదటి యూనిట్‌ ఏర్పాటు చేయించి, సొమ్ము చెల్లించారు. అయితే ఏపీఎండీసీ బోర్డు సమావేశంలో దీనిపై రచ్చ జరిగింది. ఉత్కళ్‌ సంస్థకు మిషనరీ సరఫరా చేసే అర్హత లేదని, అది వైద్య సంబంధిత వస్తువులు తయారు చేసే సంస్థ అని ప్రస్తావించారు. దానికి టెండరు ఎలా కట్టబెట్టారంటూ ఏపీఎండీసీ ఛైర్మన్‌ ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ సంస్థ ఉన్నతాధికారులైన కేదార్‌నాథ్‌రెడ్డి, నథానియేల్, లక్ష్మణరావులతో కమిటీ వేశారు. వారు కూడా టెండర్లలో ఉల్లంఘనలు జరిగాయని నివేదిక ఇచ్చారు. దీనిపై గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది విచారణకు ఆదేశించగా.. అంతా సవ్యంగానే జరిగిందంటూ వెంకటరెడ్డి నివేదిక పంపి చేతులు కడిగేసుకున్నారు. సీఎంవోలోని కీలక అధికారి ద్వారా ఎటువంటి చర్యలు లేకుండా చూసుకోగలిగారు. 

రూ. 160 కోట్లతో చైనా యంత్రాలు తెచ్చే వ్యూహం 

రాష్ట్రంలో 20 చోట్ల మూతబడిన గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్లను తీసుకొని, వాటిలో కొత్తగా మిషన్లు ఏర్పాటు చేసి సర్వే రాళ్లు కటింగ్‌ చేయాలని భావించారు. చైనాలో ఒక్కో యంత్రం ఖరీదు రూ.3-4 కోట్లు ఉండగా, ఒక్కోటి రూ. 8 కోట్లతో 20 యంత్రాలు కొనేందుకు వెంకటరెడ్డి వ్యూహం రచించారు. ఇందుకు కృష్ణప్రసాద్‌ (కేపీ) అనే వ్యక్తిని రంగంలోకి దించారు. అతనికి చెందిన ధన్వంతరీ అసోసియేట్స్‌ సంస్థకు టెండరు అప్పగించాలని భావించారు. హడావిడిగా రూ. 160 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. రూ. 100 కోట్లు దాటితే టెండర్లను న్యాయసమీక్షకు పంపాల్సి ఉందని కొందరు అధికారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. దాని నుంచి తప్పించుకోవడం కోసం తొలుత సగం యంత్రాలకే టెండర్లు పిలిచారు. అంచనా విలువ రూ. 80 కోట్లకు తగ్గడంతో.. ఆ టెండరును న్యాయసమీక్షకు పంపకుండా తప్పించారు. అయితే ధన్వంతరీ అసోసియేట్స్‌కు ఈ యంత్రాల సరఫరాకు అర్హత లేదని అధికారులు గుర్తించారు. అయినాసరే వెంకటరెడ్డి ఒత్తిడి తెచ్చి ధన్వంతరీకే టెండరు దక్కేలా చేశారు. దానికి కొంత మొత్తం అడ్వాన్స్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ వ్యవహారం గనులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ద్వివేది దృష్టికి వెళ్లగా, ఆయన ఆగ్రహించడంతో.. ఆగిపోయింది. ఇందులో బోస్‌ను మాత్రమే బాధ్యుడిని చేసి, ఆయన డిప్యుటేషన్‌ రద్దు చేసి పంపేశారు. వెంకటరెడ్డి మాత్రం సీఎంవోలో కీలక అధికారి అండతో చర్యలు లేకుండా తప్పించుకోగలిగారు. ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభంజనం సృష్టించడంతో.. వెంటనే కార్యాలయం నుంచి ఈ రాళ్లు, యంత్రాల కొనుగోళ్లకు సంబంధించిన దస్త్రాలను మాయం చేసేసినట్లు తెలిసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని