BPCL: పెట్రోలియం రిఫైనరీపై ముందడుగు

ఆంధ్రప్రదేశ్‌లో భారత్‌ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు దిశగా మరో అడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురిని కలిసి ఈ ప్రాజెక్టుపై చర్చించి వారం కూడా గడవక ముందే బీపీసీఎల్‌ అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది.

Updated : 11 Jul 2024 07:54 IST

కార్యరూపం దాల్చితే.. రాష్ట్రానికి రూ.60 వేల కోట్లకు పైగా పెట్టుబడులు
అమరావతికి బీపీసీఎల్‌ బృందం
సీఎం చంద్రబాబుతో చర్చించిన సంస్థ సీఎండీ కృష్ణకుమార్‌
అక్టోబరు నాటికి సమగ్ర ప్రణాళికతో వస్తామని హామీ
ఈనాడు - అమరావతి

సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమైన బీపీసీఎల్‌ సీఎండీ కృష్ణకుమార్‌..
చిత్రంలో మంత్రి టీజీ భరత్, సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, ఎంపీ బాలశౌరి తదితరులు

ఆంధ్రప్రదేశ్‌లో భారత్‌ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు దిశగా మరో అడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురిని కలిసి ఈ ప్రాజెక్టుపై చర్చించి వారం కూడా గడవక ముందే బీపీసీఎల్‌ అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది. రూ.60 వేల కోట్ల నుంచి రూ.70 వేల కోట్లతో ఏర్పాటు చేసే ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించింది. అక్టోబరు నాటికి నివేదికతో వస్తామని వివరించింది. బీపీసీఎల్‌ ఛైర్మన్, ఎండీ కృష్ణకుమార్‌ ఆధ్వర్యంలోని బృందం బుధవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రిఫైనరీ ఏర్పాటుపై విస్తృతంగా చర్చించింది. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చర్చల్లో పాల్గొన్నారు. ఆయిల్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు తీర ప్రాంతంలో 5 వేల ఎకరాలు అవసరమని సంస్థ ప్రతినిధులు వివరించారు. సంస్థ కోరిన విధంగా అవసరమైన ప్రాంతంలో ఎలాంటి భూములైనా కేటాయించేందుకు సిద్ధమని చంద్రబాబు వారికి స్పష్టం చేశారు. 90 రోజుల్లో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని కంపెనీ ప్రతినిధుల్ని కోరారు. తీరంలో రిఫైనరీ ఏర్పాటుకు అవకాశమున్న ప్రాంతాలపై చర్చ జరిగింది. కంపెనీ ప్రతినిధులు మచిలీపట్నం పేరు ప్రతిపాదించారు. దీనికి ముఖ్యమంత్రి కూడా సుముఖత వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో ఏర్పాటుకు ఉన్న అవకాశాల్నీ పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలో మరో ప్రాంతాన్ని కూడా ఎంపిక చేసి.. మూడు ప్రాంతాలకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. ఆయా ప్రతిపాదనలతో మళ్లీ కలుస్తామని సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు. అనంతరం బీపీసీఎల్‌ ప్రతినిధులకు చంద్రబాబు విందు ఇచ్చారు. 

రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్టు

ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే.. రాష్ట్రానికి రూ.60 వేల కోట్ల నుంచి రూ.70వేల కోట్ల పెట్టుబడుల వర్షం కురవనుంది. భారీ ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ‘దేశానికి తూర్పుతీరంలో పెట్రో కెమికల్‌ రంగానికి వ్యూహాత్మక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. బుధవారం బీపీసీఎల్‌ సంస్థ ఛైర్మన్‌ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులతో సమావేశమై.. ఆయిల్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కారిడార్‌పై చర్చించాం. ప్రాజెక్టు ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బందులు లేని 5 వేల ఎకరాల భూమిని ఇచ్చేందుకు సిద్ధం’ అని చంద్రబాబు ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. బీపీసీఎల్‌ ప్రతినిధులతో చర్చిస్తున్న ఫొటోలను దానికి జత చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని