CAG: అప్పులపై ఉక్కపోత

లెక్కకు మిక్కిలి అప్పులు చేసిన రాష్ట్రం..ఆ లెక్కలు చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మొత్తం అప్పుల వివరాలను తెలియజేయాలనికాగ్‌ఎప్పట్నుంచో కోరుతున్నా వెనకడుగు వేస్తోంది. తాము కోరిన అప్పుల వివరాలు ఇంకా రాలేదని కాగ్‌ అధికారులు పదే పదే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు.

Updated : 15 May 2022 04:57 IST

లెక్కలు చెప్పలేక రాష్ట్రం సతమతం
కార్పొరేషన్లకు గ్యారంటీలపై వివరాలడిగిన కాగ్‌
ఇప్పటికీ పంపని ప్రభుత్వం
తాజాగా పీఏజీ తాఖీదు
31లోగా పంపాలని గడువు
అత్యవసరమని స్పష్టీకరణ
ఈనాడు - అమరావతి

లెక్కకు మిక్కిలి అప్పులు చేసిన రాష్ట్రం..ఆ లెక్కలు చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మొత్తం అప్పుల వివరాలను తెలియజేయాలనికాగ్‌ఎప్పట్నుంచో కోరుతున్నా వెనకడుగు వేస్తోంది. తాము కోరిన అప్పుల వివరాలు ఇంకా రాలేదని కాగ్‌ అధికారులు పదే పదే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ (పీఏజీ) కార్యాలయం తాజాగా రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులకు తాఖీదు పంపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రభుత్వరంగ సంస్థలకు, కార్పొరేషన్లకు, ఆర్థిక సంస్థలకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకున్న రుణాల వివరాలన్నీ సమర్పించాలని కోరింది. ఇందుకు మే 31 వరకు గడువిచ్చింది. దీన్ని అత్యవసరంగా భావించాలని పీఏజీ కార్యాలయ అధికారులు రాష్ట్ర అధికారులకు స్పష్టం చేశారు. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఏప్రిల్‌ నాటికి, కనీసం మే ప్రారంభం నాటికి రాష్ట్రం లెక్కలను కాగ్‌ ఖరారు చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం అసలు సమాచారమే ఇవ్వలేదు. కాగ్‌కు మొత్తం వివరాలు చేరి, వారు ఇతరత్రా ప్రశ్నలు లేవనెత్తితే ఎదురయ్యే ఇబ్బందులపై ఆర్థికశాఖలో తర్జనభర్జన పడుతున్నారని సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వ లెక్కలను ఖరారు చేసే క్రమంలో ఇంతవరకూ కాగ్‌ కేవలం బహిరంగ మార్కెట్‌ రుణాల వరకే వివరాలను తీసుకుని వాటితోనే లెక్కలు తేలుస్తోంది. రాష్ట్రం చేస్తున్న అప్పుల తీరుతెన్నులపై కేంద్ర ఆర్థికశాఖకు, ప్రధానికి, ఆర్థిక మంత్రికీ ఫిర్యాదులు చేరుతుండటంతో కాగ్‌ తన శైలిని మార్చుకుంది. రాష్ట్రం ఏ రూపంలో అప్పు చేసినా ఆ వివరాలన్నీ తెలియజేయాలని గతేడాది డిసెంబరు నుంచి కోరుతూ వస్తోంది. ప్రతి నెలా రాష్ట్రం లెక్కలను కాగ్‌ పరిశీలించి తుది అంకెలు తేలుస్తుంది. ఈ క్రమంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లోనూ గ్యారంటీ ఇచ్చి తెచ్చిన రుణాల వివరాలు కోరినా ప్రభుత్వం స్పందించలేదని కాగ్‌ పేర్కొంది.

గ్యారంటీల విలువ రూ.1,69,905 కోట్లు
ప్రభుత్వం బడ్జెట్‌ పుస్తకాల్లో వెల్లడించిన లెక్కల ప్రకారం ఇంతవరకూ రూ.1,69,905 కోట్లకు వివిధ సంస్థలకు గ్యారంటీలు ఇచ్చింది. ఇందులో ఇప్పటివరకు తిరిగి చెల్లించినవి పోను రూ.1,38,603 కోట్లకు గ్యారంటీలు అమల్లో ఉన్నట్లు లెక్క. స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ కార్పొరేషన్‌ నుంచి మరో రూ.10వేల కోట్లు సమీకరించారు. నాన్‌ గ్యారంటీ రుణాలు రూ.65వేల కోట్ల వరకు ఉన్నాయి. ఇందులో దాదాపు రూ.50వేల కోట్ల విలువైన అప్పులను ఆయా సంస్థలే తిరిగి చెల్లించే పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు రూ.1.63 లక్షల కోట్ల అప్పునకు ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాగ్‌కు ఈ లెక్కలన్నీ సమర్పిస్తే మొత్తం అప్పుల విలువ అధికారికంగా పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం కాగ్‌కు ఈ వివరాలన్నీ పంపిన తర్వాతే తుది లెక్కలు ఖరారు కానున్నాయి.

 


కాగ్‌ కోరుతున్నది ఇదే..

* ఏయే కార్పొరేషన్‌ నుంచి ప్రభుత్వం ఎంత రుణం తీసుకుంది?
* ఏ కార్పొరేషన్‌కు ప్రభుత్వం ఎంత గ్యారంటీ ఇచ్చింది?
* ప్రతి కార్పొరేషన్‌, ప్రభుత్వరంగ సంస్థ, ఆర్థిక సంస్థల వారీగా వివరాలు.
* ఆయా కార్పొరేషన్లకు ప్రభుత్వం ఏ రోజు ఎంత మొత్తానికి గ్యారంటీ ఇచ్చింది? జీవోలు ఇచ్చిన తేదీ ఎప్పుడు?
* 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం వివరాలు.


 

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని