Andhra News: ఏపీలో అరాచక ఐపీఎస్‌ అధికారుల్లో భయం

వైకాపా హయాంలో కన్నూ మిన్నూ కానరాకుండా పేట్రేగిపోయిన కొందరు అరాచక ఐపీఎస్‌ అధికారులను ఇప్పుడు కేసుల భయం వెంటాడుతోంది.

Updated : 24 Jun 2024 07:26 IST

నాటి ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం జగన్‌ భక్తి ప్రదర్శన
ఐదేళ్ల పాపాలన్నీ చుట్టుముడతాయనే ఆందోళన

ఈనాడు, అమరావతి: వైకాపా హయాంలో కన్నూ మిన్నూ కానరాకుండా పేట్రేగిపోయిన కొందరు అరాచక ఐపీఎస్‌ అధికారులను ఇప్పుడు కేసుల భయం వెంటాడుతోంది. నాటి ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం మితిమీరిన ‘జగన్‌ భక్తి’ ప్రదర్శించి చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించిన ఆ అధికారులు.. గత ఐదేళ్లలో తాము చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటిగా చుట్టుముడతాయనే ఆందోళనతో గడుపుతున్నారు. రాష్ట్రంలో వైకాపాయే మళ్లీ అధికారంలోకి వస్తుందనే ధీమాతో నాటి అధికార పార్టీ అరాచకాలకు వెన్నుదన్నుగా నిలిచి.. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను తీవ్రంగా వేధించారు. అక్రమ కేసులు, అరెస్టులతో చిత్రహింసలకు గురిచేశారు. ఓ ఎంపీపై రాజద్రోహం కేసు పెట్టి... థర్డ్‌డిగ్రీ ప్రయోగించారన్న ఫిర్యాదులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడంతో.. నాటి దాష్టీకాలకు కారణమైన ఐపీఎస్‌ అధికారుల్లో గుబులు మొదలైంది. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు నుంచే వారంతా తమ గురించి కొత్త ప్రభుత్వంలోని ముఖ్యులు ఏమనుకుంటున్నారు? తమ పట్ల వారిలో ఎలాంటి అభిప్రాయం ఉందనే వివరాలను ఆరా తీయడం మొదలుపెట్టారు. ప్రస్తుత ప్రభుత్వంలోని ముఖ్యులు, పెద్దలతో పరిచయమున్న వ్యక్తులు, సన్నిహితంగా ఉండేవారితో మాట్లాడుతూ.. తాము తెదేపా శ్రేయోభిలాషులమేనంటూ ఏవేవో పాత సందర్భాలనూ వారికి గుర్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదో రకంగా మళ్లీ పోస్టింగులు పొందేందుకు, గతంలో తాము చేసిన అరాచకాలు, అక్రమాలపై కేసులు లేకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ప్రభుత్వాన్ని బెదిరించే యత్నం

గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టడమే మహా నేరమన్నట్లుగా.. అనేకమందిని వెంటాడి, వేటాడి మరీ అరెస్టులు చేయించిన కొందరు అధికారులు.. కొత్త ప్రభుత్వం మహా అయితే తమను అప్రాధాన్య పోస్టులోకి బదిలీ చేస్తుందని, లేకపోతే కొన్నాళ్ల పాటు పోస్టింగు లేకుండా ఉంచుతుందని భావించారు. కానీ నూతన ప్రభుత్వం వారి అరాచకాల లెక్కలు బయటకు తీయడం, గత ఐదేళ్లలో వారి వల్ల వేధింపులు, చిత్రహింసలకు గురైన బాధితులు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తుండటంతో... తమపై కేసులు తప్పవని నిర్ణయానికి వచ్చిన కొందరు అధికారులు ఇక చివరి అస్త్రంగా కులం కార్డును ప్రయోగిస్తున్నారు. తమ కుల సంఘాల ద్వారా నిరసన ప్రదర్శనలు చేయించి, ప్రకటనలు ఇప్పిస్తున్నారు. తమ వెనక కులమంతా ఉందని, అందుకే తమ జోలికి రావద్దన్నట్లుగా ప్రభుత్వాన్ని బెదిరించే ఎత్తుగడ అవలంబిస్తున్నారు.

ఆ పాపాలు పండడంతో...

కొంతమంది ఐపీఎస్‌ అధికారులు.. వైకాపా నాయకుల ప్రాపకం, కీలక పోస్టింగులు పొందాలనే యావలో చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడ్డారు. ప్రతిపక్షాలపై వేధింపులకు తెగబడ్డారు. సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు, తనిఖీలు, సోదాలు, అరెస్టుల పేరిట ఠారెత్తించారు. కొంతమందిని రాత్రివేళలో అదుపులోకి తీసుకుని.. వారిని నిర్బంధించి ఎలా పడితే అలా కొట్టారు. ఆయా అధికారుల తీరును న్యాయస్థానాలు పదే పదే ఆక్షేపించినా వాటిని లెక్కచేయలేదు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని దుస్తులు విప్పదీసి మరీ కొట్టారు. ఓ పోస్టును వాట్సప్‌లో ఫార్వర్డ్‌ చేసినందుకు 74 ఏళ్ల సీనియర్‌ పాత్రికేయుడినీ అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టును షేర్‌ చేసినందుకు ఓ వృద్ధురాలిని వేధించారు. అనేకమంది తెదేపా నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించారు. వీటన్నింటిపైనా కొత్త ప్రభుత్వం విచారణకు ఆదేశించి, కేసులు పెడితే తమకు ఇబ్బంది తప్పదనే భావనతో.. ఎలాగైనా తప్పించుకునేందుకు ఇప్పుడు కులం కార్డు ప్రయోగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని