Amaravati: అమరావతి ఓఆర్‌ఆర్‌కు పచ్చజెండా

రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది.

Updated : 06 Jul 2024 09:49 IST

రూ.20-25 వేల కోట్లు భరించేందుకు కేంద్రం సిద్ధం
పలు కీలక ప్రాజెక్టులకూ ఆమోదం
అమరావతి - హైదరాబాద్‌ మధ్య ఆరు వరసల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే
60-70 కి.మీ. మేర తగ్గనున్న దూరం
ముప్పవరం-అమరావతి మధ్య 90 కి.మీ. రహదారికి ప్రతిపాదన
రాయలసీమ నుంచి రాజధానికి పెరగనున్న అనుసంధానం
ఈనాడు - అమరావతి 

రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. వాటిలో 189 కి.మీ. పొడవైన అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) సహా కీలక ప్రాజెక్టులున్నాయి. అవన్నీ 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం చేపట్టి, కొంత ముందుకు తీసుకెళ్లాక అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం అటకెక్కించిన, ఖూనీ చేసిన ప్రాజెక్టులు, విభజన చట్టంలో ఉన్న ప్రాజెక్టులే. ముఖ్యమంత్రి చంద్రబాబు వాటన్నిటినీ మళ్లీ కేంద్రం ముందుంచి.. ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండింగ్‌ ఫైనాన్షియల్‌ కమిటీతో పాటు, ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం పొందాక అవన్నీ ఆచరణలోకి వస్తాయి. ఇప్పుడు ప్రాథమిక ఆమోదం పొందినవన్నీ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలే..! ఆ ప్రాజెక్టులు సాకారమైతే అమరావతికి మిగతా ప్రాంతాలతో చాలా సులువైన, మెరుగైన కనెక్టివిటీ ఏర్పాటవుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి దిల్లీ పర్యటనలోనే... కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో గురువారం జరిపిన భేటీలో వాటికి ప్రాథమిక ఆమోదం లభించింది.

అమరావతి ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టుకు భూసేకరణ సహా మొత్తం రూ.20-25 వేల కోట్లకుపైగా నిర్మాణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. విజయవాడ తూర్పు బైపాస్‌ రోడ్డు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అమరావతి, హైదరాబాద్‌ మధ్య మెరుగైన అనుసంధానం కోసం ఇప్పుడున్న జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా.. 60-70 కి.మీ. దూరం తగ్గేలా ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి కేంద్రం ప్రాథమికంగా సమ్మతించింది. శ్రీసత్యసాయి జిల్లాలోని కొడికొండ నుంచి మేదరమెట్ల వరకు తలపెట్టిన ఎక్స్‌ప్రెస్‌వేని అమరావతితో అనుసంధానిస్తూ... మేదరమెట్ల-అమరావతి మధ్య 90 కి.మీ. పొడవైన గ్రీన్‌ఫీల్డ్‌ హైవేని నిర్మించాలన్న ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించింది. ఓఆర్‌ఆర్‌ సహా ఈ రహదారుల నిర్మాణం మొదలైతే... రెండు మూడు సంవత్సరాల్లోనే సమూల మార్పులు వస్తాయి. రాజధాని అమరావతితో పాటు, మొత్తం ఆంధ్రప్రదేశ్‌ ముఖచిత్రమే మారిపోతుంది. మౌలిక వసతుల కల్పన వేగం పుంజుకుంటుంది. అభివృద్ధి పరుగులు తీస్తుంది. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. అమరావతికి మెరుగైన అనుసంధానత ఏర్పడితే.. పెట్టుబడిదారులు క్యూకడతారు. లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. మరోవైపు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది.

జగన్‌ ఉరి వేసిన ఓఆర్‌ఆర్‌కి మళ్లీ ఊపిరి..!

అమరావతితో పాటు, రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే, ఆర్థిక కార్యకలాపాలకు చోదకశక్తిగా నిలిచే ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టుకు కేంద్రం డీపీఆర్‌ను ఆమోదించి, భూసేకరణ ప్రారంభించేందుకు సిద్ధమైన దశలో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌.. అమరావతిపై కక్షతో ఓఆర్‌ఆర్‌నీ అటకెక్కించారు. అమరావతికి ఓఆర్‌ఆర్‌ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంచేశారు. తొలి దిల్లీ పర్యటనలోనే చంద్రబాబు ఓఆర్‌ఆర్‌పై కేంద్రాన్ని ఒప్పించారు. గతంలో ఇందుకు అవసరమైన భూసేకరణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని షరతు పెట్టిన ప్రభుత్వం... ఇప్పుడు మొత్తం వ్యయాన్ని భరించేందుకు ముందుకు రావడం విశేషం. 

 • ఓఆర్‌ఆర్‌ని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీఆర్‌డీఏ పరిధిలో 189 కి.మీ. పొడవున, ఆరు వరుసల యాక్సెస్‌ కంట్రోల్‌ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మిస్తారు. రెండు పక్కలా సర్వీసు రోడ్లు ఉంటాయి. రహదారి వెడల్పు 150 మీటర్లు.  
 • 2018 జనవరి నాటి అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికయ్యే ఖర్చు రూ.17,761.49 కోట్లు, అసరమైన భూమి 3,404 హెక్టార్లు. భూసేకరణ వ్యయం రూ.4,198 కోట్లు. 
 • ఆరున్నరేళ్ల క్రితానికీ ఇప్పటికీ... ద్రవ్యోల్బణం పెరిగినందున ఓఆర్‌ఆర్‌ నిర్మాణ వ్యయం కూడా రూ.20 వేల కోట్లు దాటే అవకాశం ఉంది. భూసేకరణకయ్యే ఖర్చు కూడా కలిపితే అది రూ.25 వేల కోట్లకు చేరవచ్చని అంచనా.

సులభంగా రాయలసీమ నుంచి అమరావతికి

 • అప్పట్లో తెదేపా ప్రభుత్వం అనంతపురం-అమరావతి మధ్య 393 కి.మీ.తో తలపెట్టిన యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేని జగన్‌ ప్రభుత్వం అనేక మార్పులు చేసి.. చివరకు వైఎస్సార్‌ జిల్లాలోని పులివెందుల మీదుగా తిప్పింది.
 • శ్రీసత్యసాయి జిల్లాలోని కొడికొండ సమీపంలో మొదలయ్యే ఆ రహదారిని బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని ముప్పవరం వద్ద చెన్నై-కోల్‌కతా ఎన్‌హెచ్‌లో కలిసేలా పరిమితం చేసింది.
 • ఆ రహదారికి ఇప్పటికే టెండర్లు పిలిచి, పనులు కూడా అప్పగించడంతో... చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నుంచి ముప్పవరం వరకు 90 కి.మీ. మేర కొత్తగా గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మించాలన్న ప్రతిపాదనను కేంద్రం ముందుంచింది. దాని వల్ల బెంగళూరు, రాయలసీమతో పాటు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చేవారు ముప్పవరం నుంచి నేరుగా అమరావతి చేరుకోవచ్చు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 
 • అప్పట్లో తెదేపా ప్రభుత్వం అనంతపురం-అమరావతి మధ్య ప్రతిపాదించిన ఎక్స్‌ప్రెస్‌వేకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి, ఎన్‌హెచ్‌-544 ఎఫ్‌ అనే సంఖ్యనూ కేటాయించింది. భూసేకరణకు ప్రక్రియ మొదలు పెట్టి... పెగ్‌మార్కింగ్‌ చేశారు. జగన్‌ ప్రభుత్వం ఆ రహదారిని అమరావతి వరకు తీసుకురాకుండా... చిలకలూరిపేట వద్ద నిర్మిస్తున్న చెన్నై-కోల్‌కతా హైవే బైపాస్‌లో కలిపేలా మార్పులు చేసింది. దాని ప్రకారం డీపీఆర్‌లు సిద్ధమయ్యాక దాన్నీ పక్కనపెట్టింది. 
 • ఆ తర్వాత వైఎస్సార్‌ జిల్లా మీదుగా కోడూరు-ముప్పవరం మధ్య గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఏపీ-కర్ణాటక సరిహద్దులో బెంగళూరు-హైదరాబాద్‌ హైవేపై కొడికొండ సమీపంలోని కోడూరు వద్ద మొదలై.. ముప్పవరం వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిలో కలిసేలా ప్రతిపాదనలు రూపొందించారు. 344 కి.మీ. ఆ రహదారికి బెంగళూరు-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే అని పేరు పెట్టారు.
 • ఆ రహదారిలో రాయలసీమ నుంచి వచ్చేవారు అమరావతి చేరుకోవాలంటే..ముప్పవరం నుంచి చెన్నై-కోల్‌కతా హైవేలో చిలకలూరిపేట మీదుగా గుంటూరు, మంగళగిరి దాటుకొని వెళ్లాలి. రాయలసీమ నుంచి వచ్చేవారికి మెరుగైన అనుసంధానం కోసం... ముప్పవరం నుంచి అమరావతి వరకు 90కి.మీ. రహదారిని చంద్రబాబు ప్రతిపాదించారు.

తూర్పు బైపాస్‌తో తీరనున్న ట్రాఫిక్‌ కష్టాలు..

 • విజయవాడ తూర్పు బైపాస్‌ రహదారిని సుమారు 49 కి.మీ. మేర నాలుగు వరుసలుగా నిర్మించాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆమోదం తెలిపారు.
 • అప్పట్లో తెదేపా ప్రభుత్వం రాజధాని అమరావతి, విజయవాడ చుట్టూ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) నిర్మించాలనుకుంది. అప్పటికి విజయవాడ పశ్చిమ బైపాస్‌ రహదారి నిర్మాణం మొదలవలేదు.
 • విజయవాడకు పశ్చిమం వైపున చిన్నఅవుటపల్లి నుంచి కాజ వరకు వరకు 47.8 కి.మీ. ఆరు వరుసల రహదారి నిర్మాణం దాదాపు కొలిక్కి వచ్చింది. దీంతో ప్రస్తుతానికి రాజధాని ఐఆర్‌ఆర్‌ ప్రతిపాదనను ఉపసంహరించుకొని... విజయవాడ తూర్పు బైపాస్‌ రహదారి ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 
 • విజయవాడ పశ్చిమ రహదారి నిర్మాణం రాజధాని అమరావతి మీదుగానే జరుగుతోంది. తూర్పు బైపాస్‌ కూడా పూర్తయితే అమరావతి మీదుగా విజయవాడ చుట్టూ రింగ్‌ రోడ్డు ఏర్పాటవుతుంది.
 • అమరావతి ఓఆర్‌ఆర్, ఐఆర్‌ఆర్‌ ప్రాజెక్టుల్ని పూర్తిగా అటకెక్కించిన జగన్‌ ప్రభుత్వం అప్పట్లో విజయవాడ తూర్పు బైపాస్‌ రహదారి నిర్మించాలని కేంద్రాన్ని కోరింది. విజయవాడ చుట్టుపక్కల లాజిస్టిక్‌ పార్కు ఏర్పాటుకు 100 ఎకరాలు కేటాయిస్తే... విజయవాడ తూర్పుబైపాస్‌ రహదారి భూసేకరణకయ్యే వ్యయాన్ని కూడా భరించేందుకు కేంద్రం అంగీకరించింది. కానీ భూమిని కేటాయించడంలో జగన్‌ ప్రభుత్వం విఫలమవడంతో అది ఆగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు చొరవ చూపడంతో ఆ ప్రాజెక్టు పరుగులు పెట్టే అవకాశం ఉంది.

అమరావతి-హైదరాబాద్‌ మధ్య 60-70 కి.మీ. దూరం తగ్గేలా ఎక్స్‌ప్రెస్‌వే

విజయవాడ-హైదరాబాద్‌ మధ్య ప్రస్తుతం 270.7 కి.మీ. పొడవైన జాతీయ రహదారి ఉంది. దాన్ని ఆరు వరుసలకు విస్తరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. అమరావతి-హైదరాబాద్‌ మధ్య దూరం తగ్గించేందుకు, నేరుగా కనెక్టివిటీ ఏర్పడేందుకు.. గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దేశంలో ప్రస్తుతం రూ.వేల కోట్ల వ్యయంతో 20కి పైగా ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం జరుగుతోంది. హైదరాబాద్, అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్‌వే హామీ విభజన చట్టంలోనూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి గడ్కరీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. అమరావతి-హైదరాబాద్‌ మధ్య 201-220 కి.మీ. పొడవున ఆ రహదారి నిర్మాణం ప్రతిపాదన సాకారమైతే... ఇప్పుడున్న హైవేపై ఒత్తిడి తగ్గుతుంది. అమరావతి-హైదరాబాద్‌ మధ్య దూరం 60-70 కి.మీ. వరకూ తగ్గుతుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని