Andhra News: 8 హైవేల విస్తరణకు కేంద్రం సుముఖం

రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా నిలిచిపోయిన కీలకమైన 8 జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులు మళ్లీ మొదలయ్యేందుకు మార్గం సుగమమైంది.

Updated : 07 Jul 2024 13:26 IST

9 నెలలుగా తాత్కాలికంగా నిలుపుదల
సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటనతో వీటిలో కదలిక
త్వరలో పట్టాలెక్కే అవకాశం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా నిలిచిపోయిన కీలకమైన 8 జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులు మళ్లీ మొదలయ్యేందుకు మార్గం సుగమమైంది. సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటనలో.. వీటి విస్తరణ ఆవశ్యకతను కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో త్వరలో ఈ పనులు పట్టాలెక్కేందుకు అవకాశం ఏర్పడింది. భారత్‌మాల పరియోజన కింద దేశవ్యాప్తంగా రూ.2 లక్షల కోట్లతో జాతీయ రహదారుల విస్తరణ పనులు చేపట్టారు. ఎన్‌హెచ్‌ల బడ్జెట్‌కు మించి పనులు మంజూరవడంతో నిరుడు నవంబరు నుంచి వీటిని తాత్కాలికంగా నిలిపేయాలని కేంద్రం ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఇలా ఆగిపోయిన పనుల్లో మన రాష్ట్రంలోని రూ.8,243 కోట్ల విలువైన 8 ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి గడ్కరీతో చంద్రబాబు సమావేశమైనప్పుడు ఈ 8 జాతీయ రహదారులను వెంటనే విస్తరించాలని కోరారు. ఇందుకు గడ్కరీ సానుకూలంగా స్పందించారు. తగిన చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో చంద్రబాబు మరోసారి దిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోదీ దృష్టికి కూడా వీటి విషయం తీసుకెళ్లనున్నారు. దీంతో ఏపీ అవసరాల దృష్ట్యా.. వీటి విస్తరణ పనులు కొనసాగించేలా కేంద్రం నుంచి ఆదేశాలు వెలువడనున్నట్లు తెలిసింది.

వెంటనే విస్తరణ అవసరం

  • ఆగిపోయిన ఎన్‌హెచ్‌లలో కొండమోడు-పేరేచర్ల కీలకమైనది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని కొండమోడు నుంచి గుంటూరు సమీపంలోని పేరేచర్ల వరకు 50 కి.మీ. నాలుగు వరుసలుగా విస్తరణకు రూ.1,032 కోట్లతో టెండర్లు పిలిచి, గుత్తేదారు ఎంపికయ్యాక ఎల్‌ఓఏ ఇచ్చే దశలో ఆగిపోయింది. గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్‌కు రాకపోకలకు ఈ రహదారి అత్యంత కీలకం. ఈ 50 కి.మీ. నాలుగు వరుసలు అందుబాటులోకి వస్తే, అక్కడినుంచి అద్దంకి- నార్కట్‌పల్లి నాలుగు వరుసల రహదారికి అనుసంధానించవచ్చు. ప్రస్తుతం కొండమోడు-పేరేచర్ల రహదారి కేవలం 7 మీటర్ల వెడల్పుతో అత్యంత ఘోరంగా ఉంది. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో గుంటూరు, తెనాలి, చీరాల తదితర ప్రాంతాల ప్రజలు ఎక్కువ మంది.. దూరమైనా సరే విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారు.
  • విశాఖపట్నం- కొత్తవలస- అరకు మార్గం రద్దీగా ఉంటుంది. ఇందులో పెందుర్తి నుంచి బౌధార వరకు 42 కి.మీ. నాలుగు వరుసలుగా విస్తరించేందుకు టెండర్లు పిలిచిన దశలో పనులు ఆగిపోయాయి. ఈ రహదారి విస్తరణ పనులు తక్షణం మొదలుపెట్టాల్సి ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని