Chandra babu: శాసనసభ హుందాగా సాగాలి

ప్రజలు మనల్ని నమ్మి మంచి ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ప్రతిపక్ష పార్టీని ఎగతాళి చేయాల్సిన పని లేదు. ప్రజలు వారికి ఇప్పటికే సరైన శిక్ష వేశారు.

Published : 23 Jun 2024 06:44 IST

దూషణలు, వెకిలి చేష్టలకు చోటివ్వద్దు
గత శాసనసభలో నీచ రాజకీయాలు చేశారు
సభ్యతలేని మాటలు, వెక్కిరింతలతో సంప్రదాయాలను మంటగలిపారు
నన్ను, నా కుటుంబసభ్యులను ఉద్దేశించి దారుణంగా మాట్లాడారు
ముఖ్యమంత్రిగానే మళ్లీ సభలో అడుగుపెడతానని శపథం చేశా
నా గౌరవాన్ని కాపాడిన ప్రజలకు ధన్యవాదాలు
అయ్యన్నపాత్రుడు పోరాట యోధుడు.. ఆయన సభను హుందాగా నడిపిస్తారు
సభాపతిగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడి అభినందన ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రజలు మనల్ని నమ్మి మంచి ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ప్రతిపక్ష పార్టీని ఎగతాళి చేయాల్సిన పని లేదు. ప్రజలు వారికి ఇప్పటికే సరైన శిక్ష వేశారు.

చంద్రబాబు

ఈనాడు, అమరావతి: దూషణలు, వెకిలిచేష్టలు లేకుండా హుందాతనంతో శాసనసభ కొనసాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. పవిత్రమైన శాసనసభను గత ప్రభుత్వం నీచ రాజకీయాలు, వికృత పోకడలు, వ్యక్తిత్వ హనానికి వేదికగా మార్చేసిందని గుర్తుచేశారు. అసభ్య దూషణలు, వెక్కిరింతలు, కక్ష సాధింపులతో పాటు ప్రతిపక్ష సభ్యులకు మైక్‌ అయినా ఇవ్వకుండా సభా సంప్రదాయాలను కాలరాశారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలిసారి ఎమ్మెల్యేలు అయినవారు కూడా.. ఆరేడుసార్లు ఎమ్మెల్యేలుగా ఉన్న సీనియర్లను నోటికొచ్చినట్లు తిడుతూ, అసభ్యంగా ప్రవర్తించారని అన్నారు.  ప్రతిపక్ష సభ్యులుగా గత ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తే సభలోనే దాడి చేశారని, నీచంగా మాట్లాడి మనోభావాల్ని దెబ్బతీశారని పేర్కొన్నారు. సభాపతిగా ఏకగీవ్రంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడిని అభినందిస్తూ చంద్రబాబు శనివారం శాసనసభలో ప్రసంగించారు. ‘సభాపతిగా ఎన్నికైన అయ్యన్నపాత్రుడు చట్టసభల విలువ తెలిసిన వ్యక్తి. ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని నిలుపుతారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతారు. సభను హుందాగా నడిపిస్తారనే నమ్మకం ఉంది’ అని చంద్రబాబు అన్నారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..

నా జీవితంలో తొలిసారి కంటతడి పెట్టుకున్నా 

తిరుపతిలో నాపైన 24 క్లెమోర్‌మైన్స్‌తో దాడి చేసినా నా కళ్లల్లో నీరు రాలేదు. కానీ ఎలాంటి సంబంధమూ లేని నా సతీమణిపై నిండు సభలో తప్పుడు ఆరోపణలు చేశారు. ఆమెనే కాదు గౌరవంగా బతికే ఆడపడుచులందర్నీ అవమానపరిచేలా, వ్యక్తిత్వ హననం చేసేలా మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. అవన్నీ చూసి తొలిసారి నా జీవితంలో కంటతడి పెట్టుకున్నా. అలాంటి వ్యక్తులు, అలాంటి పార్టీ రాష్ట్రానికి అరిష్టమని అనుకున్నా. కౌరవసభను.. గౌరవసభగా మార్చిన తర్వాతే ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని చెప్పి 2021 నవంబరు 19న సభలో నుంచి వెళ్లిపోయాను. మళ్లీ ప్రజలందరి ఆశీస్సులు, ఆమోదంతో సభలోకి ప్రవేశించాను. నా గౌరవాన్ని కాపాడిన ప్రజలకు ధన్యవాదాలు. వారికి జీవితాంతం రుణపడి ఉంటా. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగా పుట్టాలని, తెలుగుగడ్డ రుణం తీర్చుకోవాలనేది నా ఆకాంక్ష. గత శాసనసభలో నాకు, రాష్ట్రంలోని ఆడబిడ్డలకు జరిగిన అవమానం భవిష్యత్తులో ఎవరికీ జరగకుండా కాపాడే బాధ్యత ఈ సభే తీసుకోవాలి.

గత ఐదేళ్లలో జరిగిన సభను నా జీవితంలో ఎన్నడూ చూడలేదు

ఇప్పటి వరకూ 16 శాసనసభలు కొలువుదీరగా.. వాటిలో తొమ్మిది సభల్లో నేను సభ్యుడిగా ఉన్నాను. అన్ని సభలు చూశాను కానీ.. గత ఐదేళ్లలో జరిగిన 15వ శాసనసభ లాంటి సభను నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. అదొక కౌరవ సభ. అందుకు భిన్నంగా ప్రస్తుత 16వ శాసనసభను అత్యున్నత సభగా, గౌరవప్రదంగా నిర్వహించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఇక్కడ ప్రతిపక్షాన్ని దృష్టిలో పెట్టుకుని కాదు.. ప్రజాప్రభుత్వంగా ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలి. తొమ్మిదోసారి నేను ఎమ్మెల్యేను. నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికీ రాలేదు.

అధికారం కాదు.. బాధ్యత

ప్రజలు మనకు ఇచ్చింది అధికారం కాదు. బాధ్యత. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలనే బాధ్యత ఇచ్చారు. ఈ రోజు మనం చేసే పనులు భావితరాల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత భారత్‌ కలలాగానే. వికసిత ఆంధ్రప్రదేశ్‌ మనందరి కల కావాలి. తెలుగువారిని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టేలా, ఆర్థిక అసమానతలు తగ్గించేలా, పేదరికం లేకుండా చేసేలా చర్చలు సాగేలా, చట్టాలు జరిగేలా ఈ సభ ఉండాలి. 

రాజధాని నిర్మించుకోవాలి.. పోలవరం పూర్తి చేయాలి

విధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలి. ప్రజలు మనల్ని నమ్మి మంచి ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ప్రతిపక్ష పార్టీని ఎగతాళి చేయాల్సిన పని లేదు. ప్రజలు వారికి ఇప్పటికే సరైన శిక్ష వేశారు. మనం రాజధాని నిర్మించుకోవాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి. నదుల అనుసంధానం చేపట్టాలి. మౌలిక వసతులు కల్పించాలి. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి. యువతకు ఉద్యోగాలు రావాలి. బడుగులకు న్యాయం చేయాలి. ఈ లక్ష్యాల సాధన కోసం సభను సజావుగా నడిపించుకోవాలి.

అయ్యన్నపాత్రుడు ఫైర్‌బ్రాండ్‌..

అత్యంత సీనియర్‌ శాసనసభ్యుడు, బీసీ నేత అయ్యన్నపాత్రుడ్ని సభాపతి స్థానంలో చూడటం ఆనందంగా ఉంది. ఆయనకు శుభాకాంక్షలు. ఎన్టీఆర్‌ పిలుపు మేరకు 25 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన అయ్యన్నపాత్రుడు ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేశారు. మంత్రిగానూ సేవలందించారు. ఏ పదవి చేపట్టినా వన్నె తీసుకొచ్చారు. ఆయన పోరాట యోధుడు. రాజీపడని నాయకుడు. ఆయన ఫైర్‌బ్రాండ్‌. రాజీపడే ప్రసక్తే లేదు. 

  • అయ్యన్నపాత్రుడు కరుడుగట్టిన పసుపుయోధుడు. నీతి, నిజాయతీ, నిబద్ధత పుణికిపుచ్చుకుని రాజకీయం చేశారు. 42 ఏళ్ల పాటు ఒక నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని.. ఏడుసార్లు గెలవటమనేది చాలా అరుదు. పార్టీని కన్నతల్లిగా భావించే పోరాట యోధుడు. ఉత్తరాంధ్ర, విశాఖపట్నం అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారు.
  • ఆయన రాజకీయ జీవితంలో ఎన్నడూ పడని ఇబ్బందులు గత ఐదేళ్లలో పడ్డారు. ఆయన ఇంటిపైకి అర్ధరాత్రి వేళ వందల మంది పోలీసులను పంపించారు. గోడలు పగలగొట్టించారు. భయానక వాతావరణం    సృష్టించారు. అనేక పోలీసుస్టేషన్లలో ఆయనపై 23 కేసులు పెట్టారు. చివరికి 66 ఏళ్ల వయసున్న ఆయనపై అత్యాచారం కేసు కూడా పెట్టారు. రాత్రిపూట తీసుకెళ్లిపోయి పోలీసుస్టేషన్ల చుట్టూ తిప్పారు. అయినా ఆయన ఎక్కడా తగ్గకుండా రాజీలేని పోరాటం చేశారు.

వైకాపాకు 11 సీట్లు భగవంతుడి స్క్రిప్టేనా?

2019 సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాకు 23 సీట్లే వచ్చాయి. అప్పట్లో ఎన్నికల ఫలితాలు 23వ తేదీన విడుదలవ్వటంతో అది దేవుడు రాసిన స్క్రిప్టు అంటూ వైకాపా నాయకులు ఎగతాళిగా మాట్లాడారు. 2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 164 సీట్లు వచ్చాయి. ఆ మూడు అంకెలను కూడితే 11 వస్తుంది. అమరావతి రైతులు 1,631 రోజులు ఉద్యమం చేశారు. ఆ నాలుగంకెలను కలిపితే 11 వస్తుంది. వైకాపాకు ఈ ఎన్నికల్లో 11 సీట్లే లభించాయి. అంటే ఇదీ భగవంతుడి స్క్రిప్టేనా? వైకాపా సభ్యులు సభలో ఉంటే వారికి ఇవన్నీ అర్థమయి ఉండేవి. కానీ పిరికితనంతోవారు సభకే రాలేదు. మనం వారిపైన కాకుండా ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి.


పవన్‌ కల్యాణ్ను అసెంబ్లీ గేటు తాకనివ్వమన్నారు

పవన్‌ కల్యాణ్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయబోమంటూ ప్రగల్భాలు పలికారు. 21 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను పోటీ చేయించి.. 21 చోట్లా గెలిపించుకున్న నాయకుడు పవన్‌ కల్యాణ్‌. ‘వై నాట్‌ 175’ అంటూ ఊదరగొట్టిన నాయకుడు మాత్రం 11 సీట్లేకే పరిమితమయ్యారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో బాగా తెలుసుకున్న వ్యక్తి పవన్‌ కల్యాణ్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని