Chandrababu Naidu: నవ్యాంధ్రపై... అభివృద్ధి సంతకం

ఎటు చూసినా ఆనందోత్సాహాలు... హర్షాతిరేకాలు... రాష్ట్రంలో ముసిరిన చీకట్లను పారదోలుతూ అభివృద్ధి ఆకాంక్షలకు చంద్రోదయం అయిన వేళ... రాష్ట్రం నలుమూలల నుంచి వేలసంఖ్యలో పోటెత్తిన తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కేరింతలు, జయజయ ధ్వానాల నడుమ తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

Updated : 13 Jun 2024 07:37 IST

నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు
కోట్ల మంది ఆకాంక్షలు ప్రతిఫలించిన వేళ.. అంగరంగ వైభవంగా.. ప్రమాణ స్వీకారోత్సవం
పవన్‌కల్యాణ్, లోకేశ్‌ సహా 24 మంది మంత్రులతో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
ప్రధాని మోదీ, అమిత్‌షాతో పాటు ఎన్డీయే కీలక నేతల హాజరు
ప్రముఖుల రాకతో కళకళలాడిన వేడుక
తెదేపా, జనసేన, భాజపా శ్రేణుల్లో తొణికిసలాడిన ఉత్సాహం
రాష్ట్రమంతటా పండగ వాతావరణం
ఈనాడు - అమరావతి

ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న నారా చంద్రబాబునాయుడు

ఎటు చూసినా ఆనందోత్సాహాలు... హర్షాతిరేకాలు...
రాష్ట్రంలో ముసిరిన చీకట్లను పారదోలుతూ అభివృద్ధి ఆకాంక్షలకు చంద్రోదయం అయిన వేళ...

రాష్ట్రం నలుమూలల నుంచి వేలసంఖ్యలో పోటెత్తిన తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కేరింతలు, జయజయ ధ్వానాల నడుమ తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సహా 24 మందితో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ మంత్రులుగా ప్రమాణం చేయించారు. గన్నవరం విమానాశ్రయం సమీప కేసరపల్లిలోని ఐటీ పార్క్‌ వద్ద బుధవారం ఈ వేడుకను అత్యద్భుతంగా నిర్వహించారు. తెదేపా నుంచి 20 మందికి, జనసేన నుంచి ముగ్గురికి, భాజపా నుంచి ఒకరికి మంత్రులుగా అవకాశం దక్కింది. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 11.27 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉండగా, చంద్రబాబు ఆరు నిమిషాలు ఆలస్యంగా 11.33కు ప్రమాణం చేశారు. అంతకుముందు ఆయన విమానాశ్రయానికి వెళ్లి ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. మోదీతో పాటు ఒకే వాహనంలో వచ్చి, వేదికపైకి చేరుకునే క్రమంలో కొంత ఆలస్యమైంది. మంత్రులుగా తొలుత పవన్‌ కల్యాణ్, ఆఖర్లో ఎం.రామ్‌ప్రసాద్‌రెడ్డి ప్రమాణం చేశారు. అందరూ తెలుగులోనే ప్రమాణ పత్రాన్ని చదవగా, టీజీ భరత్‌ ఒక్కరే ఆంగ్లంలో చదివారు. ఎన్‌ఎండీ ఫరూక్‌ అల్లాపై ప్రమాణం చేయగా, ముఖ్యమంత్రి సహా మిగతా మంత్రులంతా దైవసాక్షిగా అని పేర్కొన్నారు.


ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోదీ, చంద్రబాబు ఆత్మీయ ఆలింగనంప్రమాణ స్వీకారోత్సవం అనంతరం... ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంత్రులు... (కూర్చున్న వారు ఎడమ నుంచి) వాసంశెట్టి సుభాష్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, కె.అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, నారా లోకేశ్, పవన్‌కల్యాణ్, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, సత్యకుమార్, ఎన్‌.ఎం.డి. ఫరూక్, (నిల్చున్న వారు ఎడమ నుంచి) టీజీ భరత్, గుమ్మడి సంధ్యారాణి, గొట్టిపాటి రవికుమార్, కొలుసు పార్థసారథి, పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణ రెడ్డి,  అనగాని సత్యప్రసాద్, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, కందుల దుర్గేష్, బీసీ జనార్దనరెడ్డి, సవిత, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్‌ప్రసాదరెడ్డి


ప్రధాని ఆత్మీయ అభినందనలు

పలువురు జాతీయ నేతలు, రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరైన వేళ.. వారి పరస్పర పలకరింపులు, అభినందనలు, ఆత్మీయ ఆలింగనాలతో కార్యక్రమం ఆద్యంతం హృద్యంగా సాగింది. ప్రముఖ నటులు చిరంజీవి, రజనీకాంత్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వేదికపైకి వచ్చినప్పుడు ప్రాంగణమంతా కేరింతలతో మార్మోగింది. కేంద్రమంత్రి చిరాగ్‌ పాస్వాన్‌ను రామ్మోహన్‌నాయుడు.. బాలకృష్ణకు పరిచయం చేశారు. రామ్మోహన్‌నాయుడిని చిరంజీవి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. చంద్రబాబు ప్రమాణం అనంతరం ప్రధాని మోదీ ఆయన్ను ఆలింగనం చేసుకొని, పుష్పగుచ్ఛమిచ్చి అభినందించారు. పవన్‌ను కూడా ఆలింగనం చేసుకున్నారు. ప్రమాణం తర్వాత పవన్‌.. సోదరుడు చిరంజీవికి పాదాభివందనం చేశారు. లోకేశ్‌ చంద్రబాబు, గవర్నర్‌ పాదాలకు నమస్కరించారు. మోదీ, అమిత్‌ షాలకు పాదాభివందనం చేయబోగా, వారు వారించారు. జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌.. పవన్‌ కల్యాణ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం చివర్లో ప్రధాని మోదీని చంద్రబాబు శాలువతో సత్కరించారు. పుష్పగుచ్ఛం, జ్ఞాపిక అందజేశారు. 


మంత్రిగా ప్రమాణం చేస్తున్న పవన్‌కల్యాణ్‌

అతిరథ మహారథులతో అసాధారణ వేడుక

చంద్రబాబు ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు, నవ్యాంధ్రకు ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాజా ప్రమాణ స్వీకారం.. నాలుగోది. గతంలో ఎన్నడూ లేని విధంగా, అసాధారణ రీతిలో ఈసారి వేడుకకు ప్రధానితో పాటు పెద్ద సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. భాజపా సీనియర్‌ నాయకులు, ఎన్డీయే పక్షాల నాయకులు తరలివచ్చారు. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డా, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, చిరాగ్‌ పాస్వాన్, రాందాస్‌ అథవాలే, అనుప్రియ పటేల్‌ తదితరులు హాజరయ్యారు. ఇంకా ఎన్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం) నేత ప్రఫుల్‌ పటేల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం, తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్, భాజపా అగ్రనేతలు బీఎల్‌ సంతోష్, సిద్ధార్థనాథ్‌ సింగ్, పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తదితరులు వేదికపై ఆసీనులయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు రిటైర్డ్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పాల్గొన్నారు. అగ్రనటులు రజనీకాంత్, ఆయన సతీమణి లత, చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెదేపా నుంచి ఇటీవలే కేంద్ర మంత్రులైన రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. వివిధ దేశాల రాయబార కార్యాలయ అధికారులు, కాన్సులేట్‌ జనరల్స్‌ హాజరయ్యారు. సినీ, వ్యాపార ప్రముఖులు కుటుంబ సమేతంగా వచ్చారు. లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్‌తో పాటు ఎన్టీఆర్‌ కుమార్తెలు, కుమారులు, మనవలు, మనవరాళ్లు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు సోదరుడి కుమారుడు నారా రోహిత్, నటుడు నిఖిల్‌ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి సతీమణి సురేఖ, కుమారుడు, నటుడు రామ్‌చరణ్, నాగబాబు, నీహారిక, సాయిధరమ్‌తేజ్, పవన్‌ కల్యాణ్‌ భార్య అనా, కుమారుడు అకీరా నందన్‌ హాజరయ్యారు. భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఇంతమంది అతిరథ మహారథుల సమక్షంలో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. సాధారణంగా భాజపా ప్రభుత్వాలు కొలువుదీరే వేళ ప్రధాని సహా ఆ పార్టీ అగ్రనేతలు హాజరవుతుంటారు. ఈ దఫా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి తెదేపా చోదక శక్తిగా మారిన క్రమంలో భాజపా నేతలు అగ్ర ప్రాధాన్యమిచ్చి హాజరైనట్లు అవగతమవుతోంది.


వేదికపై చిరునవ్వులు చిందిస్తున్న ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు

కనుల పండువగా కార్యక్రమం

ఐదేళ్ల వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి లభించిందన్న ఊరట ఒకవైపు.. ఎన్డీయే అసాధారణ విజయం తెచ్చిన ఊపు మరోవైపు.. వెరసి కొత్త ప్రభుత్వం కొలువుదీరే ఘట్టం పలు ప్రత్యేకతలను సంతరించుకుంది. వేడుకలో తెదేపా, జనసేన, భాజపా.. మూడు పార్టీల కార్యకర్తల ఆనందోత్సాహాలకు పట్టపగ్గాల్లేవు. ఉదయాన్నే కెరటాల్లాగా కదిలొచ్చారు. కొత్త మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు, సామాన్య కార్యకర్తలు సైతం కుటుంబ సమేతంగా హాజరై వేడుక తిలకించారు. ఇందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వేదిక అందరికీ కనిపించేలా 36 గ్యాలరీల్లో ఎల్‌ఈడీ తెరలు అమర్చారు. అత్యంత ప్రముఖుల కోసం ప్రత్యేకంగా మూడు గ్యాలరీలు కేటాయించారు. తెెలుపు, పసుపు, ఎరుపు, కాషాయ రంగుల అలంకరణతో ప్రాంగణం రంగులీనింది. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, సాధించిన విజయాలు, చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ప్రదర్శించిన లఘుచిత్రం ఆకట్టుకుంది. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. 


ప్రధాని మోదీకి శ్రీవారి ప్రతిమను బహూకరిస్తున్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌


పచ్చకండువాలు తిప్పుతూ సంబరాలు చేసుకుంటున్న తెలుగుదేశం మహిళా కార్యకర్తలు

ప్రమాణస్వీకారాన్ని తిలకిస్తున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి, దర్శకులు క్రిష్, మెహర్‌ రమేష్, నటుడు నిఖిల్‌ తదితరులు


ప్రమాణ స్వీకారానికి ఎన్నారైలు


నటుడు శివాజీతో ఎన్నారైలు

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెదేపా ఎన్‌ఆర్‌ఐ విభాగం తరపున వివిధ దేశాలకు చెందిన 400 మందికి పైగా అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. తెదేపా ఎన్నారై మీడియా సమన్వయకర్త సాగర్‌ దొడ్డపనేని ఆధ్వర్యంలో వీరంతా తరలి వచ్చారు. దారిలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడడంతో దాదాపు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ సభావేదికకు చేరుకున్నారు.

ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం గన్నవరం ఎయిర్‌పోర్టులో  ప్రధాని నరేంద్ర మోదీకి వీడ్కోలు పలుకుతున్న సీఎం చంద్రబాబు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని