Chandrababu: మండల కేంద్రాలు, పట్టణాల్లో రిమోట్‌ వర్క్‌ స్టేషన్లు: చంద్రబాబు

‘‘మన విద్యార్థులు, యువత కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అన్వేషించాలని భావిస్తున్నాం. ఇంట్లో ఉంటూ పనిచేసుకునే రిమోట్‌ ఉద్యోగాలు అందుబాటులో ఉంటే చదువుకుంటూనే పనిచేసుకునే వీలుంటుంది.

Updated : 14 Jun 2024 10:50 IST

 ఇంట్లో ఉంటూనే పనిచేసుకునేలా ప్రణాళిక
ఉద్యోగవకాశాలు పెంచడమే మా మొదటి లక్ష్యం
విద్యార్థులతో సీఎం 

ఈనాడు, అమరావతి: ‘‘మన విద్యార్థులు, యువత కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అన్వేషించాలని భావిస్తున్నాం. ఇంట్లో ఉంటూ పనిచేసుకునే రిమోట్‌ ఉద్యోగాలు అందుబాటులో ఉంటే చదువుకుంటూనే పనిచేసుకునే వీలుంటుంది. దీనికోసం మండల కేంద్రాలు, పట్టణాల్లో కొన్ని రిమోట్‌ వర్క్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇంట్లో.. లేదా అక్కడికి వెళ్లి పనిచేసుకోవచ్చు. ఉద్యోగవకాశాలు పెంచడమే మా మొదటి లక్ష్యం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. నైపుణ్యగణన దస్త్రంపై సంతకం చేసిన తర్వాత ఆయన... తద్వారా లబ్ధిపొందే విద్యార్థులు, యువతతో కాసేపు ముచ్చటించారు.

చేయూత ఇచ్చే బాధ్యత తీసుకుంటాం

ఇంటర్మీడియట్‌ విద్యార్థి: అందరికీ ఐటీ అంటే ఆసక్తి ఉండదు. హోటల్‌ మేనేజ్‌మెంట్, ఫిల్మ్‌ మేకింగ్‌ వంటి ఇతర రంగాల్లోనూ అవకాశాలు అందుకునేలా యువతను ప్రోత్సహించాలి. 

చంద్రబాబు: ఇది చాలా మంచి ఆలోచన. ఉదాహరణకు పవన్‌కల్యాణ్‌కు ఆయన అన్నయ్య చిరంజీవి కొంత నటన నేర్పించారు. దాన్ని అందిపుచ్చుకుని ఆయన స్వయంకృషితో పైకి ఎదిగారు. అందరికీ అలాంటి ఆసరా లభించదు. ప్రభుత్వంగా మేము ఆ బాధ్యత తీసుకుంటాం. అవకాశాలు బాగుండే రంగంలో నైపుణ్యశిక్షణ ఇప్పిస్తాం. విదేశాల్లో నర్సు ఉద్యోగాలకు డిమాండు ఉంది. అలాంటి రంగాల్లో ప్రోత్సహిస్తాం. 

స్టార్టప్‌లు.. సమస్యల్ని అధగమించేలా ప్రణాళిక

ఓ విద్యార్థి: యువత స్టార్టప్‌లు పెట్టుకోవడానికి ప్రభుత్వం సాయం చేయాలి

చంద్రబాబు: యువతకు సరైన శిక్షణ, చేయూత లభించకపోవడం వల్లే స్టార్టప్‌లు విఫలమయ్యాయి. ఈ సమస్యల్ని అధిగమించేలా ప్రణాళిక రూపొందించి సాయం అందిస్తాం. నాణ్యమైన విద్య లభించేలా రాష్ట్రమంతటా ఇంజినీరింగ్‌ కళాశాలలు పెంచాం. దాన్ని అందిపుచ్చుకుని మనవాళ్లు ప్రపంచమంతటా విస్తరించారు. తెదేపా ప్రభుత్వం వల్ల వారికి మంచి జరిగిందని భావించి సొంత డబ్బులు పెట్టుకుని ఏపీకి వచ్చి ఓట్లు వేశారు. దాన్ని నేను ఎప్పటికీ మరిచిపోను. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు