Chandrababu: నడవలేడు.. నడిపించలేడు!

‘ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నడవలేడు, తిరగలేడు. వృద్ధుడు కదా! మొండికేసిన ఎద్దును ముల్లుగర్రతో పొడిచేందుకే నేను వచ్చా. ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లకే పరిమితమై యంత్రాంగాన్ని

Updated : 25 Nov 2021 06:11 IST

సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పాలి

బాధితులకు పరిహారమిచ్చే వరకూ పోరాడతా

వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

చంద్రబాబు విమర్శ

చిత్తూరు జిల్లాలోని రాయలచెరువును పరిశీలిస్తున్న చంద్రబాబునాయుడు.
చిత్రంలో మాజీ మంత్రి అమరనాథరెడ్డి, తెదేపా నాయకులు

ఈనాడు, ఈనాడు డిజిటల్‌, తిరుపతి: ‘ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నడవలేడు, తిరగలేడు. వృద్ధుడు కదా! మొండికేసిన ఎద్దును ముల్లుగర్రతో పొడిచేందుకే నేను వచ్చా. ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లకే పరిమితమై యంత్రాంగాన్ని నడిపించలేకపోతున్నారు’ అని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు రాలేకపోయిన ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను చంద్రబాబు బుధవారం పరిశీలించారు. ఏర్పేడు మండలం పాపానాయుడుపేట వద్ద కూలిన వంతెనతో పాటు తిరుచానూరు వంతెన, రాయలచెరువు, తిరుపతిలోని ముంపు కాలనీల్లో పర్యటించారు. మహిళలు వరదల కారణంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాంతాల్లో మాట్లాడుతూ.... ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో తిరుపతితో పాటు పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రాయలచెరువు తెగుతుందని రాష్ట్రం హోరెత్తుతుంటే ముఖ్యమంత్రి గాల్లోనే తిరుగుతున్నాడు. ఈ సీఎం.. గాలి సీఎం. నేను ముఖ్యమంత్రిగా ఉంటే తిరుపతిలోనే బసచేసి ఉండేవాడిని. చుట్టపుచూపుగా వచ్చే సీఎం మనకు అవసరమా? ప్రజలు ప్రాణాలు కోల్పోయిన తర్వాత వస్తారా? బాధ్యత కలిగిన సీఎం అసెంబ్లీని వాయిదా వేసి క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల కష్టాలను తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సిందిపోయి.. నాపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారు. ఇప్పటికీ బాధితులకు పరిహారం అందించలేదు. అందరికీ సాయం అందేలా పోరాడతా. ప్రభుత్వం వద్ద నిర్ధిష్ట డిమాండ్లు పెడతా. రాష్ట్రంలోని రైతులు వరి వేయవద్దని వ్యవసాయ మంత్రి ప్రకటన చేశారు. రైతులు వరి కాకుంటే గంజాయి పండిస్తారా? వరి వేయవద్దనే అధికారం మీకు ఎవరిచ్చారు? ఇవాళ వరి వద్దన్నారు.. రేపు వ్యవసాయమే వద్దంటారు.

 మడమతిప్పిన సీఎం...

అమరావతి రాజధాని విషయమై రెండున్నరేళ్ల తర్వాత తప్పు చేశాం, ఉపసంహరించుకుంటున్నామన్నాడు. మళ్లీ కొత్త బిల్లు తెస్తానని అంటున్నాడు. మడమ తిప్పి మాటమార్చిన సీఎం పూర్తిగా అవకాశవాది. అసెంబ్లీలో నాపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారు. చిన్న కుప్పం పట్టణంలో అక్రమాలు చేసి మొనగాళ్లమని విర్రవీగుతున్నారు. కొండపల్లి వంటి చిన్న మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు రెండు రోజులుగా దౌర్జన్యం చేస్తున్నారు. న్యాయస్థానానికి వెళ్తే సిగ్గు ఉందా అని హెచ్చరించే పరిస్థితి వచ్చింది. ప్రజాసేవ చేయరు, చేసే వారిని చేయనివ్వరు. మీకిచ్చిన సమయం అయిపోయింది. మార్పు ప్రారంభమైంది. ధైర్యం ఉంటే ప్రజాసేవలో పోటీపడండి, కేసులు పెట్టి చరిత్రహీనులు కావద్దు. ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రభుత్వం చేయదు, మరొకరిని చేయనివ్వదు. మా ప్రభుత్వం రాగానే నెల రోజుల్లో వరద మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందిస్తాం. మీ సమస్యలపై సీఎంకు, సీఎస్‌కు గురువారం లేఖలు రాస్తా. వారి స్పందన చూస్తా. లేకుంటే మళ్లీ తిరుపతికి వస్తా.

మిత్రుడు ఇంటికి చంద్రబాబు

శ్రీవేంకటేశ్వర వర్సిటీ ఆర్థికశాస్త్ర విభాగం విశ్రాంత ఆచార్యులు కొమ్మినేని శ్రీనివాసులునాయుడు ఇంటికి చంద్రబాబు వెళ్లారు. శ్రీకృష్ణనగర్‌లో పర్యటిస్తూ ఇక్కడే ఉంటున్న మిత్రుడి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పలకరించారు. ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు.

రాయలచెరువు పర్యటనపై ఆంక్షలు

రాయలచెరువు ప్రాజెక్టును పరిశీలించాలనుకున్న చంద్రబాబుకు పోలీసులు ఆంక్షలు విధించారు. చెరువు ప్రమాదకరంగా ఉందని, అక్కడికి వెళ్లడం శ్రేయస్కరం కాదంటూ మంగళవారమే తెదేపా శ్రేణులకు నోటీసులు ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం చంద్రబాబు శానంభట్లలోని జేబీఎస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు వచ్చినప్పుడు పోలీసులు మరోమారు ఈ విషయాన్ని ప్రస్తావించారు. తాను అక్కడికి వెళ్లి తీరుతానని చంద్రబాబు స్పష్టంచేశారు. భారీ కాన్వాయ్‌ కాకుండా మూడు వాహనాల్లో వెళ్లాల్సిందిగా పోలీసులు సూచించారు. ఆ మేరకు ఆయన మూడు వాహనాలతో వెళ్లి రాయలచెరువు కట్టను పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని