Chandrababu:నాడు 43% ఫిట్‌మెంట్‌ ఇచ్చా

‘ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత రూ.22,700 కోట్ల రెవెన్యూ లోటున్నప్పుడు ఉద్యోగులు నా వద్దకు వచ్చారు. డబ్బులు లేవని... తమకు అన్యాయం చేయవద్దని, రాష్ట్రం కోసం కష్టపడతామని తెలిపారు. దీంతో ఒక్కమాటా

Updated : 09 Jan 2022 05:58 IST

ప్రస్తుత ప్రభుత్వం ఐఆర్‌ కన్నా 4% తగ్గించింది
వైకాపా నేతలు ఖనిజ సంపదను లూటీ చేస్తున్నారు
కుప్పం పర్యటనలో చంద్రబాబు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు - న్యూస్‌టుడే, శాంతిపురం: ‘ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత రూ.22,700 కోట్ల రెవెన్యూ లోటున్నప్పుడు ఉద్యోగులు నా వద్దకు వచ్చారు. డబ్బులు లేవని... తమకు అన్యాయం చేయవద్దని, రాష్ట్రం కోసం కష్టపడతామని తెలిపారు. దీంతో ఒక్కమాటా మాట్లాకుండానే 43% ఫిట్‌మెంట్‌ ఇచ్చా’ అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. ‘ప్రస్తుత ప్రభుత్వం 27% మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటించింది. శుక్రవారం ఉద్యోగ సంఘం నాయకులను బెదిరించి.. 23% ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. అంటే ఇచ్చిన దాంట్లోనే 4% తగ్గించారు. ఒకవైపు ఉద్యోగులు బాధపడుతుంటే... ఉద్యోగ సంఘాల నాయకులు అభినందిస్తున్నారు. ఆర్థిక ప్రయోజనాలను కల్పించకుండా ఉండేందుకే ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచారు. ఉద్యోగులూ ఆలోచించండి. ఇది పీఆర్సీ కాదు... రివర్స్‌ పేఆర్సీ’ అంటూ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజమెత్తారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా కుప్పం వచ్చిన ఆయన చివరి రోజు శనివారం గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో పర్యటించారు. రాష్ట్రంలో 4 రోజుల్లో ఇద్దరు దళితులు ఆత్మహత్య చేసుకున్నారని... నిరసన చేస్తున్న వారిపై రౌడీషీట్‌ తెరుస్తామని బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ క్రమంలో ‘జైభీమ్‌’ అంటూ నినాదాలు చేశారు.

ఒక్క గ్రామంలోనే 250 అక్రమ క్వారీలు
అనంతరం విలేకరులతో చంద్రబాబు మాట్లాడుతూ... ‘ఖనిజ సంపదను వైకాపా నాయకులు లూటీ చేస్తున్నారు. నేను వస్తున్నానని తెలుసుకుని క్వారీల్లోని యంత్రాలను తరలించేశారు. భారీగా మందుగుండు సామగ్రిని వినియోగిస్తూ స్థానికులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. పర్యావరణానికీ తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. వీటి కారణంగా హంద్రీ-నీవా టన్నెల్‌ జాడ కనిపించడం లేదు. ఒక్క ముద్దనపల్లెలోనే 250 క్వారీలు అక్రమంగా నిర్వహిస్తున్నారు. ద్రవిడ విశ్వవిద్యాలయంలోని 150 ఎకరాల్లోనూ ఇదే తంతు జరుగుతోంది. ఇటువంటి దందాలు బాగా చేస్తున్నందుకే ఒక వ్యక్తిని ఎమ్మెల్సీగా చేశారు. పలమనేరు ఎమ్మెల్యే, కుప్పం రెస్కో ఛైర్మన్‌తోపాటు వైకాపా నాయకులు ప్రకృతి సంపదను దోచేస్తున్నారు. ఇందులో ఒకాయన నాపై బాంబులు వేస్తానన్నారు. వీరందరికీ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతుగా ఉన్నారు. వెంటనే ఆయన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలి. ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే ఇలా ఉంటే... రాష్ట్రం మొత్తంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చివరకు పోలవరం కాలువ గట్టుపై ఉన్న మట్టిని కూడా వైకాపా నాయకులు వదలడంలేదు. కుప్పంలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా.. మైనింగ్‌, రెవెన్యూ, పోలీసులు నిద్ర పోతున్నారా’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ విచారణ చేయాలని, అక్రమ మైనింగ్‌పై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.


3 కిలోమీటర్లు నడిచి.. క్వారీలను పరిశీలించి...

కుప్పం నియోజకవర్గంలో వైకాపా నాయకులు అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు తదితరులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. శాంతిపురం మండలం సి.బండపల్లి పంచాయతీ ముద్దనపల్లె, ద్రవిడ విశ్వవిద్యాలయం తదితర చోట్ల ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని వివరించారు. అక్కడకే వెళ్లి అక్రమాల అంతుచూద్దాం పదండంటూ చంద్రబాబు కార్యకర్తలతో కలిసి ముద్దనపల్లె క్వారీల వద్దకు వెళ్లారు. సుమారు 3 కిలోమీటర్ల మేర కొండలు, గుట్టలు ఎక్కి మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. గంటకుపైగా ఆయన అక్కడే ఉన్నారు. వెంట ఉన్న కార్యకర్తలు ఆయన వేగాన్ని అందుకోలేకపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని