Andhra News: ఒక్కర్ని చంపండి.. చంద్రబాబు పారిపోతారు

వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి ఇంటిపై వైకాపా మూకలు దాడి చేసినప్పుడు.. అక్కడున్న తెదేపా కార్యకర్తల్లో ఒక్కరి తల తీసేస్తే చంద్రబాబు భయపడి ఇల్లు వదిలి పారిపోతారని జోగి రమేశ్‌ తన అనుచరులను ఉసిగొల్పారని ప్రత్యక్ష సాక్షి తమ్మా శంకర్‌రెడ్డి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.

Updated : 11 Jul 2024 06:59 IST

నాడు జోగి రమేశ్‌..  అనుచరుల్ని ఉసిగొల్పిన తీరిది
చంద్రబాబు ఇంటిపై వైకాపా మూకల దాడి కేసులో ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం

తాడేపల్లి, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి ఇంటిపై వైకాపా మూకలు దాడి చేసినప్పుడు.. అక్కడున్న తెదేపా కార్యకర్తల్లో ఒక్కరి తల తీసేస్తే చంద్రబాబు భయపడి ఇల్లు వదిలి పారిపోతారని జోగి రమేశ్‌ తన అనుచరులను ఉసిగొల్పారని ప్రత్యక్ష సాక్షి తమ్మా శంకర్‌రెడ్డి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంటిపై 2021 సెప్టెంబరు 17న వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్‌ తన అనుచరులతో దాడికి పాల్పడిన ఘటనపై కేసు నమోదైన విషయం విదితమే. వైకాపా అధికారంలో ఉన్నన్నాళ్లూ ఈ కేసు దర్యాప్తు ముందుకెళ్లలేదు. పైగా బాధితులపైనే ఎదురు కేసులు పెట్టారు. ఎన్డీయే అధికారంలోకి రావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆనాటి ఘటనలో ప్రత్యక్ష సాక్షి, ఉండవల్లికి చెందిన తమ్మా శంకరరెడ్డి నుంచి బుధవారం పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారు. అనంతరం ఆయన ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు. ‘ఉండవల్లికి చెందిన స్నేహితులం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడానికి వెళ్లాం. ఆ రోజు ఉదయం 11.30 గంటల సమయంలో హఠాత్తుగా ఐదారు కార్లలో జోగి రమేశ్, ఆయన అనుచరులు వచ్చారు. కర్రలతో వస్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఏదో గొడవ జరుగుతోందని వెళ్లిన మమ్మల్ని వారు కొట్టారు. చంద్రబాబునాయుడిని తరిమేద్దాం.. వీళ్లలో ఒక్కడిదైనా తల తీసి చంపేస్తే అప్పుడు చంద్రబాబు భయపడి ఇల్లు వదిలి పారిపోతారు. ఇక ఆంధ్రాకు రారు అని జోగి రమేశ్‌ బిగ్గరగా అరిచారు. మనకేంటి డీజీపీ ఉన్నారంటూ మూకలను రెచ్చగొట్టారు. గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న, నేను, నా స్నేహితులు.. జోగి రమేశ్‌ను ఎంతో వారించాం. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, ఇళ్ల మీదకు రావడం తప్పని చెప్పాం. అయినా వినకుండా కర్రలతో మా తలలపై కొట్టారు. నాతోపాటు జంగాల సాంబశివరావు, గాదె శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. డీఎస్పీ పిలిస్తే వచ్చి ఈ రోజు వాంగ్మూలం ఇచ్చాం’ అని శంకర్‌రెడ్డి వివరించారు. తనపై దాడి చేయడమే కాకుండా తిరిగి తనపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.


తప్పులతడకగా పోలీసుల రికార్డు

రిమాండ్‌ పిటిషన్‌ను తిప్పి పంపిన జడ్జి
గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి కేసులో పోలీసుల నిర్వాకం

నిందితులను కోర్టులో ప్రవేశపెడుతున్న పోలీసులు

గన్నవరం, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా గన్నవరంలోని తెదేపా కార్యాలయంపై వైకాపా మూకలతో కలిసి అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల దాడి కేసులో పోలీసులు రిమాండ్‌ రికార్డు తప్పుల తడకగా ఉంది. ఈ కేసులో పరారీలో ఉన్న 71 మంది నిందితుల్లో 15 మందిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన మూల్పూరి ప్రభుకాంత్, ఎర్రగుళ్ల నాగేష్‌ సహా 15 మందిని రిమాండ్‌ నిమిత్తం గన్నవరం 12వ అదనపు న్యాయస్థానంలో బుధవారం ప్రవేశపెట్టారు. రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తి.. ఎఫ్‌ఐఆర్‌లో ఓ పేరు, ఒకచోట పూర్తిపేరు, మరోచోట సగం పేరు, ఊరి పేర్లు తప్పులు ఉన్నట్లు గమనించారు. రిమాండ్‌ నివేదికలోని తప్పులు సవరించిన తర్వాతే నిందితులను కోర్టులో ప్రవేశపెట్టాలని సూచించారు. దీంతో రాత్రి 10 గంటలకు తప్పులు సరిచేసిన తర్వాత నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 14రోజులు రిమాండ్‌ విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని