AP News: మార్పు మొదలైంది!

ప్రభుత్వ యంత్రాంగంలో భారీ కుదుపు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగం ప్రక్షాళన ప్రారంభించారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల్ని పెద్ద ఎత్తున బదిలీ చేశారు.

Updated : 20 Jun 2024 10:03 IST

భారీగా ఐఏఎస్‌ల బదిలీ 
21 మందికి స్థాన చలనం
వివాదాస్పద అధికారులపై వేటు
జీఏడీలో రిపోర్టు చేయాలని శ్రీలక్ష్మి, రజత్‌ భార్గవ, ప్రవీణ్‌ ప్రకాశ్, మురళీధర్‌రెడ్డిలకు ఆదేశం
వివేక్‌ యాదవ్, హరిజవహర్‌లాల్‌లకు నో పోస్టింగ్‌
గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్‌కుమార్‌లకు కీలక బాధ్యతలు.. అధికారుల్లో విస్మయం
సాయిప్రసాద్‌కు జలవనరుల శాఖ
సీఆర్‌డీఏ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్‌

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ యంత్రాంగంలో భారీ కుదుపు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగం ప్రక్షాళన ప్రారంభించారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల్ని పెద్ద ఎత్తున బదిలీ చేశారు. నిజాయతీపరులు, సమర్థులుగా గుర్తింపు తెచ్చుకున్నవారికి కీలక శాఖల బాధ్యత అప్పగించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ పెద్దలతో అంటకాగుతూ తీవ్ర వివాదాస్పద అధికారులుగా పేరుపొందినవారికి పోస్టింగ్‌ ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారు. వారిని సాధారణ పరిపాలనశాఖ (జీఏడీ)లో రిపోర్టు చేయాల్సిందిగా సూచించారు. కీలకశాఖలకు కార్యదర్శులు, విభాగాధిపతులుగా ఉన్న 21 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివాదాస్పదులుగా పేరుపొందిన పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్, వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీగా, సెర్ప్‌ సీఈవోగా ఉన్న మురళీధర్‌రెడ్డిలను జీఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. ప్రస్తుతం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్న పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టు నుంచి కూడా రజత్‌ భార్గవను తప్పించారు. ఈ నలుగురు అధికారులూ ఈ చర్యకు పూర్తిగా అర్హులన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వినిపిస్తోంది. 

  • జగన్‌ అవినీతి కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న శ్రీలక్ష్మి.. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి రాగానే తెలంగాణ కేడర్‌ నుంచి ఏపీకి వచ్చేశారు. అప్పటికి కార్యదర్శి హోదాలోనే ఉన్న ఆమెకు జగన్‌ ప్రభుత్వం చకచకా పదోన్నతులు కల్పించి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని చేసింది. కీలకమైన పురపాలకశాఖను ఆమె చేతిలో పెట్టింది. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టల్లా ఆడుతూ.. పురపాలక శాఖను ఆమె భ్రష్టుపట్టించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. రాజధాని అమరావతి విధ్వంసం, రుషికొండపై కట్టిన విలాసవంతమైన భవనాలు సీఎం నివాసానికి అనుకూలమంటూ నివేదిక ఇవ్వడం వంటి అంశాల్లో ఆమె ప్రభుత్వానికి పూర్తి అనుకూలంగా వ్యవహరించారు. అధికార పార్టీ నాయకులకు ప్రమేయం ఉన్న టీడీఆర్‌ బాండ్‌ల కుంభకోణాన్ని అడ్డుకునే విషయంలో ఆమె సకాలంలో స్పందించలేదన్న విమర్శలున్నాయి. 
  • రజత్‌ భార్గవ ఎక్సైజ్, పర్యాటకశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. జే-బ్రాండ్ల మద్యంతో వైకాపా ప్రభుత్వ పెద్దలు సాగించిన అడ్డగోలు దోపిడీకి ఆయన పూర్తిగా సహకరించారన్న ఆరోపణలున్నాయి.
  • వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయంలో చేరి చక్రం తిప్పిన ప్రవీణ్‌ ప్రకాశ్‌ అత్యంత వివాదాస్పద అధికారిగా పేరు తెచ్చుకున్నారు. జగన్‌ కోసం రుషికొండపై విలాసవంతమైన భవనాల నిర్మాణానికి ఆ ప్రాంతాన్ని ఎంపిక చేయడంలోనూ, గుజరాత్‌ నుంచి ప్రముఖ ఆర్కిటెక్ట్‌ను తీసుకురావడంలోనూ ఆయనదే కీలకపాత్ర. ఆయన పాఠశాల విద్యాశాఖను అస్తవ్యస్త నిర్ణయాలతో భ్రష్ఠుపట్టించారన్న ఆరోపణలున్నాయి. 
  • ప్రస్తుతం సీఆర్‌డీఏ కమిషనర్‌గా ఉన్న మరో వివాదాస్పద అధికారి వివేక్‌ యాదవ్‌తోపాటు, కార్మికశాఖ కార్యదర్శిగా ఉన్న హరిజవహర్‌లాల్‌ను బదిలీ చేసినా వారికి ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు.

వీరికి కీలక బాధ్యతలా?

వైకాపా ప్రభుత్వ హయాంలో అత్యంత వివాదాస్పద అధికారులుగా పేరు తెచ్చుకున్న గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్‌ కుమార్‌లకు ఈ ప్రభుత్వం మళ్లీ కీలక శాఖల బాధ్యతలు అప్పగించడం అధికార వర్గాల్ని విస్మయానికి గురిచేస్తోంది. గోపాలకృష్ణ ద్వివేది కూడా శ్రీలక్ష్మి, రజత్‌ భార్గవ వంటి వివాదాస్పద అధికారుల కేటగిరీలోకే వస్తారు. ప్రస్తుతం ఆయన వ్యవసాయ, పశుసంవర్ధక శాఖలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనను ఇప్పుడు కార్మికశాఖకు బదిలీ చేసిన ప్రభుత్వం, గనులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ కొనసాగిస్తుండటం గమనార్హం. తిరుపతి జిల్లా కలెక్టర్‌గా ఉన్న ప్రవీణ్‌ కుమార్‌ను గనుల శాఖ కమిషనర్, డైరెక్టర్‌గా నియమించింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఆయన తిరుపతి కలెక్టర్‌గా వెళ్లారు. దానికి ముందు వైకాపా ప్రభుత్వ హయాంలో పురపాలకశాఖ కమిషనర్, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ, ఏపీఐఐసీ ఎండీ వంటి కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన.. అప్పటి ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి కనుసన్నల్లో పనిచేస్తూ అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి అధికారిని తీసుకొచ్చి గనులశాఖ డైరెక్టర్‌గా నియమించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో గనుల శాఖ డైరెక్టర్‌గా పనిచేసిన వెంకట్‌రెడ్డి ఆ శాఖను భ్రష్ఠు పట్టించారు. వైకాపా పెద్దలు చెప్పినట్టల్లా ఆడుతూ.. రాష్ట్రంలో యథేచ్ఛగా గనుల దోపిడీకి సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ శాఖలో తవ్వితీయాల్సిన అక్రమాలు చాలా ఉన్నాయి.

సాయిప్రసాద్‌కు కీలక బాధ్యతలు..

ప్రస్తుతం భూపరిపాలనశాఖ ప్రత్యేక కమిషనర్‌గా ఉన్న జి.సాయిప్రసాద్‌కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగిస్తూ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బుడితి రాజశేఖర్‌ను వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆయన 2014-19 మధ్య కూడా వ్యవసాయశాఖ బాధ్యతలు నిర్వర్తించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో మొదట్లో ఆయనకు కీలక బాధ్యతలే అప్పగించినా.. ఎన్నికల ముందు ఆయనను పక్కన పెట్టారు. అప్పట్లో సీఎంవోలో చక్రం తిప్పిన ఒక అధికారితో ఆయనకు భేదాభిప్రాయాల వల్ల పోస్టింగ్‌ ఇవ్వలేదని ప్రచారం జరిగింది. 2019కి ముందు తెదేపా ప్రభుత్వ హయాంలో తితిదే కార్యనిర్వహణాధికారిగా పనిచేసి, ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను కీలకమైన పురపాలకశాఖకు మార్చారు. 

సీఆర్‌డీఏ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్‌..

ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను వేగంగా పూర్తి చేస్తారని పేరు తెచ్చుకున్న కాటమనేని భాస్కర్‌ను రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్‌గా నియమించారు. ప్రస్తుత ప్రభుత్వం ముందున్న అత్యంత ప్రాధాన్యతాంశాల్లో రాజధాని నిర్మాణం ఒకటి. ఐదేళ్లలో విధ్వంసానికి గురైన అమరావతి నిర్మాణాన్ని మళ్లీ పరుగులు పెట్టించాలంటే సమర్థుడైన భాస్కర్‌ వంటి అధికారితోనే సాధ్యమని భావించిన ప్రభుత్వం ఆయనకు కీలక బాధ్యతను అప్పగించింది. 

విద్యాశాఖలో కీలక మార్పులు..

ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జె.శ్యామలరావును ఇటీవల తితిదే ఈవోగా బదిలీ చేసిన ప్రభుత్వం, ఆయన స్థానంలో ఇప్పుడు సౌరభ్‌గౌర్‌ను ఆ శాఖ కార్యదర్శిగా నియమించింది. నైపుణ్యాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగానూ ఆయనకు పూర్తి అదనపు బాధ్యత అప్పగించింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాశ్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం, ఆయన స్థానంలో కోన శశిధర్‌ను నియమించింది. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ఐటీ శాఖనూ పూర్తి అదనపు బాధ్యతగా ఆయనకే అప్పగించింది. 

ఆర్థికశాఖ సమూల ప్రక్షాళన..

వైకాపా ప్రభుత్వ హయాంలో అడ్డగోలు, అవకతవక నిర్ణయాలకు కేంద్రమైన ఆర్థికశాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం నడుం బిగించింది. రైల్వేశాఖ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చి ఆ శాఖ కార్యదర్శిగా (ఎక్స్పెండిచర్‌) పనిచేసిన సత్యనారాయణ నిబంధనల్ని కాలరాసి, ప్రభుత్వ పెద్దల అస్మదీయ గుత్తేదారులకు ఇష్టారాజ్యంగా బిల్లులు చెల్లించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన చడీచప్పుడు లేకుండా మళ్లీ మాతృశాఖకు వెళ్లిపోయేందుకు అంతా సిద్ధం చేసుకున్న దశలో ప్రభుత్వం అడ్డుకుంది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు రిలీవ్‌ కావొద్దని ఆదేశించింది. ఈ బదిలీల్లో ఆయన స్థానంలో   ఎం.జానకిని ఆశా కార్యదర్శి (ఎక్స్పెండిచర్‌)గా నియమించింది. ప్రస్తుతం పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న వాడ్రేవు వినయ్‌చందన్‌ను ఆర్థికశాఖలో మరో కార్యదర్శి (ఎఫ్‌పీ)గా నియమించింది.

రావత్‌కూ స్థాన చలనం?

ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్‌.ఎస్‌.రావత్‌కు స్థానచలనం ఖాయమని తెలుస్తోంది. బుధవారం బదిలీ చేసిన అధికారుల జాబితాలో ఆయన పేరు లేదు. ఒకటి రెండు రోజుల్లో ఆయనను    కూడా బదిలీ చేస్తారని, ఆయన స్థానంలో పీయూష్‌ కుమార్‌ను నియమిస్తారని సమాచారం. ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీసులో ఉన్నారు.

త్వరలో మరిన్ని మార్పులు..

రెండు మూడు రోజుల్లో మరి కొందరు కార్యదర్శులు, విభాగాధిపతుల బదిలీలు జరగనున్నాయి. ఐపీఎస్‌ అధికారుల బదిలీలూ ఉంటాయి. అదే క్రమంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనూ ప్రభుత్వం మార్చనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని