Chevireddy: ఆర్టీసీ స్థలాలకు చెవిరెడ్డి స్కెచ్‌

రూ.కోట్ల విలువైన ఆర్టీసీ స్థలాలను తిరుపతికి చెందిన వైకాపా నేత, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమిపాలైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి కారుచౌకగా కొట్టేశారు.

Updated : 25 Jun 2024 07:14 IST

లీజు పేరిట విలువైన భూములకు ఎసరు 
వైకాపా పాలనలో ‘పోటీ’ లేకుండా సాగిన దందా

ఒంగోలు అర్బన్, గ్రామీణం, టంగుటూరు, న్యూస్‌టుడే: రూ.కోట్ల విలువైన ఆర్టీసీ స్థలాలను తిరుపతికి చెందిన వైకాపా నేత, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమిపాలైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి కారుచౌకగా కొట్టేశారు. ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి చెందిన సీఎంఆర్‌ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ పేరిట ఆర్టీసీ స్థలాలకు అగ్రిమెంట్‌ చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు, అద్దంకి డిపోల పరిధిలోని స్థలాలను లీజు పేరుతో దక్కించుకున్నారు. గత ఏడాది నవంబరులో ఆర్టీసీ అధికారులు వీటికి టెండర్లు పిలవగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో పదిహేనేళ్లకు లీజు ఒప్పందం చేసుకున్నారు. ఈ స్థలాల కోసం పలువురు పోటీపడినా వారిని బెదిరించి.. వారంతట వారే టెండర్ల నుంచి తప్పుకొనేలా చేసి, కుమారుడి సంస్థకు కట్టబెట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

  • ఒంగోలు డిపో పరిధిలో 1978 చదరపు అడుగుల స్థలానికి... నెలకు రూ.2.26 లక్షలు (జీఎస్టీ అదనం) చెల్లించేలా ఒప్పందం చేశారు. వాస్తవానికి... ఇక్కడ టెండర్ల పక్రియలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నారు. మొదటి వ్యక్తి తాను లీజు కట్టలేనని పక్కకు తప్పుకోవడంతో...రెండోదిగా ఉన్న సీఎంఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థకు టెండరు దక్కింది. తొలివ్యక్తిని బెదిరించడంతో ఆయన తప్పుకొన్నట్లు సమాచారం. ఆరు నెలల పాటు కన్‌స్ట్రక్షన్‌ పీరియడ్‌గా నిర్ణయించి ఎటువంటి లీజూ వసూలు చేయరాదని ఒప్పంద సమయంలో నిర్ణయించారు.
  • ప్రస్తుతం బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న అద్దంకి డిపోనకు ఆగ్నేయంగా ఉన్న 1970 చదరపు అడుగుల స్థలాన్ని సైతం సీఎంఆర్‌ ఇన్‌ఫ్రానే తీసుకుంది. నెలకు రూ.62 వేలు చొప్పున  లీజు చెల్లించేలా టెండర్లు దక్కించుకుంది. ఇక్కడ కూడా ఇంతవరకు ఎటువంటి పనులూ చేపట్టలేదు.

లీజులు రద్దు చేయాలి: ఎమ్మెల్యే దామచర్ల

ఆర్టీసీ ఆర్‌ఎం సుధాకర్‌తో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌

ఒంగోలు డిపో ఆవరణలో లీజుకు ఇచ్చిన స్థలాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ సోమవారం సాయంత్రం పరిశీలించారు. సంస్థ ఆర్‌ఎం సుధాకర్‌తో మాట్లాడి లీజు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  చెవిరెడ్డి భాస్కరరెడ్డి... ఆయన కుమారుడు మోహిత్‌ రెడ్డి పేరుతో సీఎంఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లో విలువైన భూములు అడ్డగోలుగా దక్కించుకున్నారని ఆరోపించారు. ఒంగోలులో స్థలం చదును పనులు ఆపించామని... మిగతా పదహారు చోట్లా నిలిపేస్తామని పేర్కొన్నారు. గతంలోనూ ఇక్కడ ఉండే ఆయన (మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి) బస్టాండ్‌ ఎదుట ఉన్న వాణిజ్య సముదాయాన్ని... తన అనుయాయులకు 33 ఏళ్లకు కారుచౌకగా లీజులకు ఇప్పించారని ఆరోపించారు. ఈ అక్రమాలను సీఎంవో దృష్టికి తీసుకువెళ్లి... ఆయా ఒప్పందాలు వెంటనే రద్దు చేయాలని కోరామన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.


టంగుటూరులోనూ అదే తీరు...

టంగుటూరులో రైల్వేస్టేషన్‌ ఎదుట 8 ఎకరాల విస్తీర్ణంలో ఆర్టీసీ బస్టాండ్‌ ఉంది. బస్సుల రాకపోకలకు వీలుగా రెండు ఎకరాలు ఉంచి... మిగతా ప్రాంతంలో పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ భారీ వృక్షాలు ఉన్నాయి. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఈ స్థలంలో... సుమారు అర ఎకరం భూమిని వైకాపా ప్రభుత్వం లీజుకు కట్టబెట్టింది. ఒప్పందం చేసుకున్న వారు అక్కడి వృక్షాలను మూడు రోజులుగా నరికేస్తూ... చదును చేస్తున్నారు. స్థానికులు ఆరా తీయడంతో లీజు వ్యవహారం సోమవారం బయటకు వచ్చింది. ఈ విషయమై ఒంగోలు డిపో మేనేజర్‌ ధర్మవరపు శ్రీనివాసరావును వివరణ కోరగా... స్థలం ఎవరు లీజుకు తీసుకున్నారు, ఎంత స్థలం ఇచ్చారన్నది రికార్డులు చూసి చెప్పాల్సి ఉందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని