Vasudeva Reddy: ఏపీఎస్‌బీసీఎల్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు

జగన్‌ ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్యనాయకులు సూత్రధారులుగా కొనసాగించిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) మాజీ ఎండీ, ఐఆర్‌టీఎస్‌ అధికారి డి.వాసుదేవరెడ్డిపై సీఐడీ ఉచ్చు బిగిస్తోంది.

Published : 22 Jun 2024 05:52 IST

ఎక్సైజ్‌ కమిషనరేట్‌లో ఉన్న డిస్టిలరీలు, బ్రూవరీస్‌ కార్యాలయం సీజ్‌
వైకాపా హయాంలో డిస్టిలరీలు, బ్రూవరీస్‌ కమిషనర్‌గానూ వాసుదేవరెడ్డి బాధ్యతలు 

ఈనాడు, అమరావతి: జగన్‌ ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్యనాయకులు సూత్రధారులుగా కొనసాగించిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) మాజీ ఎండీ, ఐఆర్‌టీఎస్‌ అధికారి డి.వాసుదేవరెడ్డిపై సీఐడీ ఉచ్చు బిగిస్తోంది. గుంటూరు జిల్లా కుంచనపల్లిలోని ఆయన విల్లాలో శుక్రవారం ఉదయం నుంచి సీఐడీ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే వాసుదేవరెడ్డి తన విల్లాకు తాళాలు వేసేసి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. ఆ తాళాలు పగులగొట్టి సోదాలు నిర్వహించేందుకు న్యాయస్థానం నుంచి సీఐడీ అధికారులు అనుమతి పొందారు. అయితే ఆ తర్వాత వేరే తాళాలు దొరకడంతో విల్లా తలుపులు తెరిచి తనిఖీలు చేపట్టారు. శుక్రవారం రాత్రి వరకూ ఈ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌ నానక్‌రాంగూడలో వాసుదేవరెడ్డి నివసించే విల్లాలోనూ ఇప్పటికే సీఐడీ బృందాలు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీఎస్‌బీసీఎల్‌ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్‌ పరికరాలు, ఇతర పత్రాలను వాసుదేవరెడ్డి చోరీ చేశారన్న ఫిర్యాదుపై ఆధారాల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర అభియోగాలతో ఈ నెల 6న కేసు నమోదైంది. అందులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నాయి.

వాసుదేవరెడ్డి గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఏపీఎస్‌బీసీఎల్‌ ఎండీతో పాటు.. డిస్టిలరీ, బ్రూవరీస్‌ విభాగం కమిషనర్‌గా కూడా కొనసాగారు. వైకాపా అధికారం చేపట్టిన వెంటనే ఇతరుల యాజమాన్యంలో ఉన్న డిస్టిలరీలను అప్పటి ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్య నాయకుల పరమయ్యేలా చూడటంలో వాసుదేవరెడ్డి కీలకంగా వ్యవహరించారన్న ఫిర్యాదులున్నాయి. అలాగే ఆయా డిస్టిలరీల్లో జే బ్రాండ్ల తయారీకి అనుమతులివ్వటంతో పాటు ఇతర అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రసాదంపాడులోని ఎక్సైజ్‌ కమిషనరేట్‌ రెండో అంతస్తులో ఉన్న డిస్టిలరీస్, బ్రూవరీస్‌ విభాగం కార్యాలయాన్ని సీఐడీ అధికారులు సీజ్‌ చేశారు. అక్కడి నుంచి దస్త్రాలు, కాగితాలు ఏవీ బయటకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. వైకాపా హయాంలో ప్రభుత్వ పెద్దలు, వైకాపా నాయకులు, వారి సన్నిహితులు కలిసి.. మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నీ గుత్తాధిపత్యంలో ఉంచుకుని భారీ ఎత్తున దోచుకున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో ఆ దోపిడీ, కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాలు, పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను మాయం చేసేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నాలు చేసినట్లు సీఐడీ గుర్తించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు