Chandrababu: తితిదే నుంచే ప్రక్షాళనకు శ్రీకారం

‘తిరుమలలో ప్రసాదాలు, పరిశుభ్రత అన్నింటికీ తిలోదకాలిచ్చారు. శ్రీవారిని తమ అవసరాలకు వినియోగించుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేశారు.

Updated : 14 Jun 2024 04:06 IST

పైరవీల కోసం శ్రీవారి పేరును వాడుకున్నారు
ప్రపంచవ్యాప్తంగా స్వామి ఆలయాలు నిర్మిస్తాం
తిరుమలలో సీఎం చంద్రబాబునాయుడు

తిరుమలలో విలేకరులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో శ్రీకాళహస్తి, తిరుపతి,
చిత్తూరు ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్‌రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, గురజాల జగన్‌మోహన్,
చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్‌

ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే-తిరుమల: ‘తిరుమలలో ప్రసాదాలు, పరిశుభ్రత అన్నింటికీ తిలోదకాలిచ్చారు. శ్రీవారిని తమ అవసరాలకు వినియోగించుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేశారు. తితిదే నుంచే పరిపాలన ప్రక్షాళన ప్రారంభిస్తా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. తితిదేలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్నారు. గత ప్రభుత్వం దీన్ని వాణిజ్యకేంద్రంగా మార్చిందని దుయ్యబట్టారు. ‘‘వేంకటేశ్వరస్వామి ఆలయానికి రాగానే పవిత్రభావం రావాలి. ఇందుకోసం భోజనప్రసాదం ఉండాలి, ధరలు పెంచకూడదు, దర్శనటికెట్లు బ్లాక్‌లో అమ్ముకోకూడదు. పచ్చదనంతో ఎంతో పరిశుభ్రంగా ఉండే తిరుమలను ఎంత దారుణంగా తయారుచేయాలో అలా చేశారు. అన్యమత ప్రచారం చేసి.. గంజాయి, మద్యం, మాంసం విక్రయించారు’’ అని విమర్శించారు. శ్రీవారి దర్శనానంతరం ఆయన గురువారం తిరుమలలో మీడియాతో మాట్లాడారు. 

తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరిస్తున్న సీఎం చంద్రబాబు. పక్కన భువనేశ్వరి

ఊరూరా తిప్పారు..

‘తిరుమల పైరవీలకు కేంద్రంగా మారిపోయింది. వేంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పారు. కోర్టు కేసులు, పనులు చేసుకునేందుకే పదవులు ఇచ్చారు. ఇతర దేవుళ్లు వచ్చే జన్మలో శిక్షిస్తారేమో గానీ వేంకటేశ్వరస్వామికి అపచారం తలపెట్టినవారు ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారు. స్వామిని స్వార్థం కోసం అమ్ముతారా, ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా?’ అంటూ ప్రశ్నించారు.

సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందిస్తున్న తితిదే జేఈవో వీరబ్రహ్మం 

ఇల వైకుంఠం..

‘తిరుమలను అపవిత్రం చేయడం భావ్యం కాదు. మరణించాక వైకుంఠానికి వెళ్లాలని కోరుకుంటాం. తెల్లవారుజామున మూడుగంటలకు ఇక్కడ స్వామిని దర్శించుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతినే పొందుతాం. అనేకసార్లు నేనూ అదే అనుభూతి పొందాను. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు ఏడుకొండల వాడా వేెంకటరమణా గోవిందా గోవిందా, ఓం నమో వేంకటేశాయ అని స్మరిస్తుంటా. ఇదే నినాదం తప్ప వేరే వ్యక్తి, నినాదం ఉండకుండా ప్రక్షాళన చేస్తా. ప్రపంచం మొత్తం అభినందించేలా తితిదేను తీర్చిదిద్దుతా. ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు నిర్మిస్తాం’ అని స్పష్టం చేశారు. 

మంత్రి లోకేశ్, బ్రాహ్మణిలకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందిస్తున్న తితిదే జేఈవో వీరబ్రహ్మం

కుటుంబం ధైర్యాన్ని ఇచ్చింది

‘దేశానికి కుటుంబవ్యవస్థ అతి పెద్ద సంపద. ఇది భద్రతను, ఆనందాన్ని ఇస్తుంది. నేను జైల్లో ఉన్నప్పుడు ఆదుకున్నది, నిలబడినది కుటుంబమే. మా కుటుంబంలో ఎవరికీ ఏమీ ఇవ్వక్కర్లేదు. 35 ఏళ్ల క్రితమే కుటుంబసభ్యులు రాజకీయాలపై ఆధారపడకూడదన్న ఉద్దేశంతో చిన్న వ్యాపారం ప్రారంభించా. నా భార్య, కుమారుడు, కోడలు అందరూ వ్యాపారం బాగా చేసుకుంటున్నారు. నేను వాళ్లకు కొంత సమయం ఇవ్వాల్సి ఉంది’ అని అభిప్రాయపడ్డారు.

రంగనాయకుల మండపంలో సీఎం చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాంశ్‌ 

నిద్రలేని రాత్రులు గడిపారు

‘కొందరు ప్రజాస్వామ్యం కోసం పోరాడి, నిద్రలేని రాత్రులు గడిపి, కోర్టు చుట్టూ తిరిగారు. శనివారం వస్తే ఎక్కడ పొక్లెయిన్‌ వస్తుందో, ఎక్కడ 41-ఎ కింద కేసులు పెట్టి అరెస్టు చేస్తారోననే భయంతో బతికారు. ఇప్పుడు ఎక్కడా చెట్లు నరికే పనిలేదు. పరదాలు కట్టే, పొక్లెయిన్లు పంపించే పరిస్థితి లేదు. ప్రజాపాలన ప్రారంభమైంది. ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది. ఐదేళ్ల నష్టంతోరాష్ట్రం30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. దీన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. భగవంతుడు ఆ శక్తిని తెదేపాకు ఇచ్చాడు. ప్రభుత్వంలో భాగస్వాములు కావాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.

నంబర్‌ 1 రాష్ట్రంగా..

‘2047కి ప్రపంచంలోనే భారతదేశం నం.1, 2 స్థానాల్లో ఉంటుంది. ఏ దేశానికి వెళ్లినా అక్కడ భారతీయులు, అందులో 30% తెలుగువారు ఉంటారు. ప్రపంచంలోనే ఏపీ నంబర్‌ 1గా ఉండాలి. తెలంగాణ కూడా బాగుండాలి. విభజన తర్వాత హైదరాబాద్‌ తెలంగాణకు వెళ్తుందని, మళ్లీ కష్టపడి రాజధానిని నిర్మించడమే కాకుండా ఏపీ రుణం తీర్చుకుంటానని వచ్చా. అమరావతి, పోలవరం ప్రారంభించా. అమరావతి విధ్వంసం పాలైంది. పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. మళ్లీ రాష్ట్రాన్ని బాగుచేసుకుందాం’ అని చంద్రబాబు తెలిపారు.

శ్రీవారి దర్శనం..

అంతకుముందు కుటుంబసమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారిని దర్శించుకున్నారు. అతిథిగృహం నుంచి నేరుగా వైకుంఠం-1 క్యూకాంప్లెక్స్‌ వద్దకు చేరుకున్నారు. ఆపై మహద్వారం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి తితిదే ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, తితిదే జేఈఓ వీరబ్రహ్మం ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కుకుని స్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో చంద్రబాబు కుటుంబసభ్యులకు వేదపండితులు ఆశీర్వచనం, శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు. అధికారులు డ్రై ఫ్లవర్‌ సాంకేతికతతో రూపొందించిన స్వామి, అమ్మవార్ల చిత్రపటాలు అందజేశారు. ఆలయం వెలుపలికి వచ్చాక గొల్లమండపం పక్కనుంచి పెద్దజీయంగారి మఠానికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడ ఉన్న భక్తులు, కార్యకర్తలు జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. అనంతరం అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. అక్కడినుంచి అతిథిగృహం చేరుకుని అనంతరం తిరుచానూరు వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.


పేదరికం లేని సమాజం

‘పేదరికం లేని సమాజాన్ని స్థాపించేందుకు శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వాలని, ప్రజల సహకారం అందించాలని కోరాను. సంపద లేనప్పుడు, సృష్టించడం తెలియనప్పుడు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత శ్రీవారి ఆశీస్సులతో రెండోదశ సంస్కరణలు నేనే ప్రారంభించా. తద్వారా బ్రహ్మాండమైన రహదారులు వచ్చాయి. తొలుత చెన్నై-నెల్లూరు వరకు ఏర్పాటుచేశాం. తర్వాత స్వర్ణ చతుర్భుజి రహదారులు, జిల్లా రహదారులు వచ్చాయి. సంపద సృష్టించడమే కాదు.. పేదలకు ఇచ్చే కార్యక్రమాలకూ శ్రీకారం చుట్టా’ అని చంద్రబాబు పేర్కొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని