Polavaram: ఈ నష్టానికి బాధ్యులెవరు?

‘పోలవరంలో ఇంత నష్టం జరగడానికి ఎవరు బాధ్యులు?’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు.

Updated : 18 Jun 2024 08:18 IST

ఈఎన్‌సీ నారాయణరెడ్డిని నిలదీసిన ముఖ్యమంత్రి
సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన అధికారులు

పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి పార్థసారథి, ఎంపీ మహేశ్‌ యాదవ్‌ తదితరులు 

ఈనాడు, అమరావతి: ‘పోలవరంలో ఇంత నష్టం జరగడానికి ఎవరు బాధ్యులు?’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా అని జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) నారాయణరెడ్డిని నిలదీశారు. డయాఫ్రంవాల్‌ దెబ్బతిన్న సమయంలో అక్కడే ఉన్న అధికారులు, ప్రభుత్వం మరికొంత అప్రమత్తంగా ఉంటే ఈ స్థాయిలో నష్టం జరిగేది కాదని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుకు ఇంత నష్టం జరిగితే యంత్రాంగానికి మరమ్మతులు ఎక్కడ మొదలుపెట్టాలో.. ఏం చేయాలో తెలియకపోవటం దారుణమని మండిపడ్డారు. ఈ పనులకే నాలుగేళ్లు పడితే ప్రాజెక్టును ఎప్పటికి పూర్తి చేద్దామనుకుంటున్నారని నిలదీశారు. పోలవరంలో సోమవారం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రాజెక్టు పరిశీలనలోనూ అధికారులను పలు అంశాలపై అక్కడికక్కడే ప్రశ్నించారు. అనంతరం సమావేశంలో జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ పోలవరం తాజా స్థితిగతులపై సీఎంకు ప్రజంటేషన్‌ ఇచ్చారు. చంద్రబాబు స్పందిస్తూ.. 2019, 2020 వరదల సమయంలో అధికారులు ఎవరున్నారు? డయాఫ్రం వాల్‌ ధ్వంసం కాకుండా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇందుకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఆ సమయంలో స్థానికంగా చీఫ్‌ ఇంజినీరు ఉన్నారని ఈఎన్‌సీ సమాధానమిచ్చారు. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా మీరూ బాధ]్యత వహించాలి కదా.. మీరూ చూసుకోవాలి కదా అని సీఎం నిలదీశారు. అందుకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తవడానికి ఎన్నేళ్లు పడుతుందని మేఘా ఇంజినీరింగ్‌ ప్రతినిధి సుబ్బయ్యను ప్రశ్నించారు. నాలుగు సీజన్లు అవసరమని ఆయన చెప్పారు. ఇప్పటికే ఒక సీజన్‌ కోల్పోయినట్లు కదా.. అంటే ప్రాజెక్టు నిర్మాణానికి ఐదేళ్లు పడుతుందంటున్నారు, అదీ నమ్మకంగా చెప్పడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ప్రాజెక్టులో కుడి, ఎడమ కాలువల అంచనా వ్యయం తగ్గిందని అధికారులు పేర్కొనగా.. కాలువల ప్రవాహ సామర్థ్యం, పొడవు, వెడల్పు మారకుండా అంచనా వ్యయం ఎలా తగ్గుతుందని సీఎం వారిని ప్రశ్నించారు. దీనికీ అధికారుల నుంచి సమాధానం లేదు. గతంలో ఈఎన్‌సీగా పని చేసిన ఎం.వెంకటేశ్వరరావు ఈ పర్యటనలో ముఖ్యమంత్రికి అనేక అంశాలు వివరించారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, కొలుసు పార్థసారథి, ఎంపీ మహేశ్, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, చిర్రి బాలరాజు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని