Chandrababu: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి ఆగదు

ఐదేళ్లపాటు అమరావతిలో జగన్‌ చేసిన విధ్వంసంపై అధ్యయనం చేస్తున్నామని, ఎంత నష్టం జరిగింది? ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాం? గతంలో చేసిన నిర్మాణాలు ఎంతవరకు పనికొస్తాయి? భవిష్యత్తు కార్యాచరణేంటి?

Published : 21 Jun 2024 06:23 IST

జగన్‌ కక్షగట్టి.. దెబ్బతీశారు
త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తాం
అందరి సలహాలు తీసుకుని కార్యాచరణ ప్రకటిస్తాం
తుమ్మచెట్ల తొలగింపుతో రాజధాని పునరుద్ధరణకు శ్రీకారం
అమరావతి పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ఈనాడు - అమరావతి


నమూనా నవలోకం

ఉద్దండరాయునిపాలెంలో రాజధాని భవనాల నమూనాలను తిలకిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ తదితరులు


ఐదేళ్లపాటు అమరావతిలో జగన్‌ చేసిన విధ్వంసంపై అధ్యయనం చేస్తున్నామని, ఎంత నష్టం జరిగింది? ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాం? గతంలో చేసిన నిర్మాణాలు ఎంతవరకు పనికొస్తాయి? భవిష్యత్తు కార్యాచరణేంటి? అన్న అంశాలపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ‘‘రాష్ట్రం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినా ఏం చేయగలరని 

ఎన్నికల ముందే నన్ను కొందరు ప్రశ్నించారు. నేను పారిపోవడానికి సిద్ధంగా లేనని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటానని, రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తానని, పూర్వవైభవం తెస్తానని అప్పుడే చెప్పాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి నిర్మాణాన్నీ పూర్తిచేస్తాం’’ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిలో గురువారం విస్తృతంగా పర్యటించారు. ఐదేళ్లుగా నిలిచిపోయిన పనుల్ని, వైకాపా పాలనలో విధ్వంసానికి గురైన కట్టడాల్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... ‘‘ఈ ఐదేళ్లూ పనులు కొనసాగించి ఉంటే అమరావతి నిర్మాణం కొలిక్కి వచ్చేది. కానీ ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉండిపోయింది. 70-80% పూర్తయిన భవనాల పనులు నిలిచిపోయాయి. మరికొన్ని ఇళ్లను తుమ్మచెట్లు కమ్మేశాయి. సచివాలయ టవర్ల పునాదులు నీళ్లలో నానుతున్నాయి. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. భవనాలు బూజుపట్టాయి. తలుపులు విరగ్గొట్టారు. ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు చేయొచ్చో అన్నీ చేశారు. ఆ భవనాల్ని, కట్టడాల్ని రైతులు ఎంతగా కాపాడాలనుకున్నా పోలీసులు వాళ్లపైనే కేసులు పెట్టారు. రాజధాని నిర్మాణానికి గుత్తేదారులు తెచ్చిన మెటీరియల్, పైపులు, ఇసుక దోచుకుపోయారు. రోడ్లను తవ్వేసి కంకర కూడా పట్టుకుపోయారు’’ అని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


కావాలి ప్రగతి పునాదులు

శాశ్వత సచివాలయ భవనాల కోసం తీసిన పునాదుల్లో నీరు చేరిపోయి.. దయనీయంగా మారిన నిర్మాణాలను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు


అమరావతిపై నిత్యం విషం కక్కారు

అమరావతిపై వైకాపా నాయకులు విషప్రచారం చేశారని, బ్రాండును దెబ్బతీయాలని చూశారని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘శివరామకృష్ణన్‌ కమిటీ రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండాలని సూచించింది. ప్రాథమిక పాఠశాల విద్యార్థిని అడిగినా అమరావతే రాష్ట్రానికి మధ్యలో ఉందని చెబుతారు. అలాంటి అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్నారు. సింగపూర్‌ కన్సార్షియంను, ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ని తరిమేశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా.. రాజధాని ఏదంటే చెప్పుకోలేని దుస్థితిలోకి నెట్టేశారు. రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులపై అపవాదులు వేశారు’’ అని ఆయన మండిపడ్డారు.

తుమ్మచెట్లు తొలగించాలని చెప్పాను

రాజధాని ప్రాంతమంతా తుమ్మచెట్లు పెరిగిపోయి అడవిలా మారిపోయిందని, ఎక్కడ ఏ నిర్మాణాలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొందని చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే టెండర్లు పిలిచి తుమ్మచెట్లు తొలగించే పనిని వెంటనే చేపట్టాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు. 

ఆ మహిమే కాపాడింది

రాజధాని అమరావతి పరిరక్షణ కోసం 1,631 రోజులపాటు అక్కడి ప్రజలు, రైతులు ఉద్యమించడం ఒక చరిత్రగా ఆయన అభివర్ణించారు. శంకుస్థాపన స్థలం వద్ద ఏర్పాటుచేసిన చిహ్నాల్ని వైకాపా పాలనలో కొందరు దుండగులు ధ్వంసం చేసినా, పవిత్రమైన మట్టిని రైతులు కాపాడారన్నారు. అప్పట్లో యజ్ఞం చేసినచోట 1,631 రోజులుగా పూజలు చేస్తూ... ఆ మహిమను వారు కాపాడారని, అదే ఈ రోజు అమరావతికి రక్షణగా నిలిచిందని చంద్రబాబు పేర్కొన్నారు. 

ఆ 11 సీట్లు కూడా రాకూడదు

అధికారంలోకి వచ్చినవాళ్లు ఎవరైనా మంచి పనులతో పరిపాలన ప్రారంభిస్తారని, కానీ 2019లో జగన్‌ ప్రజావేదిక విధ్వంసంతో పరిపాలన ప్రారంభించారని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘అలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం లేదని, ఆయన పనికిరాడని ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పారు. వైకాపాకు 11 సీట్లే వచ్చాయంటే, ఆ దుష్టపాలనకు ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో అర్థమవుతోంది. అలాంటి వ్యక్తికి, పార్టీకి ఆ 11 సీట్లు కూడా రాకూడదు. అలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హుడా? అలాంటి వ్యక్తికి ఓటు వేయడం భావ్యమా? అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి’’ అని ఆయన కోరారు. చంద్రబాబు మాట్లాడుతుండగా... తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ ఆయనకో చీటీ అందజేశారు. రాజధాని రైతులు 1,631 రోజులు ఉద్యమించారని, ఆ అంకెలన్నీ కలిపితే 11 వస్తుందని, వైకాపాకు ఈ ఎన్నికల్లో ప్రజలు అన్ని సీట్లే ఇచ్చారని దానిలో పేర్కొన్నారు. చంద్రబాబు దాన్ని చదువుతూ... దేవుడు రాసిన స్క్రిప్ట్‌ అంటే ఇదేనని వ్యాఖ్యానించారు.

గల్లాపెట్టె ఖాళీ

రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చవుతుంది? ఎన్ని రోజులు పడుతుందన్న ప్రశ్నకు.. ‘‘ఇప్పుడే చెప్పడం కష్టం. గల్లాపెట్టె ఖాళీ అయింది. ఖజానాలో ఎన్ని డబ్బులున్నాయో తెలీదు. బడ్జెట్, బడ్జెటేతర అప్పులు చేశారు. లెక్కల్లో చూపించని అప్పులూ చాలానే ఉన్నాయి. అన్ని విషయాలూ మీ ముందు పెడతాం. మేం వేసే ప్రతి అడుగూ మీ భవిష్యత్తు కోసమే. దానిలో మిమ్మల్నందరినీ భాగస్వాముల్ని చేయడం మా కర్తవ్యం’’ అని పేర్కొన్నారు. రుషికొండపై కట్టిన భవనాలు ఏం చేయబోతున్నారన్న ప్రశ్నకు... రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, రూ.500 కోట్లు పెట్టి విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారని, రుషులు తపస్సు చేసిన పవిత్రమైన రుషికొండపై విధ్వంసానికి పాల్పడ్డారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వం మారినా రాజధానిలోని సీడ్‌యాక్సెస్‌ రోడ్డు మీదుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని చంద్రబాబు దృష్టికి తేగా.. ‘‘నేరాలు అలవాటైనవాళ్లు మారలేకపోతున్నారు. అధికార యంత్రాంగం ఇప్పటికైనా ప్రజాహితం కోసం పనిచేయాలి. ఇకపై అలాంటివి జరిగితే అధికారులపై కఠిన చర్యలుంటాయి. ప్రజల్లోనూ చైతన్యం రావాలి. ఇది వరకులా బాధితులపైనే దాడులు చేస్తే సహించను. ప్రజాహితం కోసం ఎవరు ముందుకు వచ్చి పనిచేసినా అండగా ఉంటాం’’ అని తెలిపారు.

రౌడీయిజం చేస్తామంటే కుదరదు

రాజధానిలో తప్పుడు పనులు చేసినవారిని, కంకర కూడా దోచుకున్నవారిని వదిలిపెట్టబోమని చంద్రబాబు తెలిపారు. ‘‘వైకాపా పాలనలో కొందరు ఇష్టారాజ్యంగా చేశారు. రౌడీయిజం చెలాయించారు. బెదిరింపులకు పాల్పడ్డారు. ఎదురు తిరిగినవారిని కొట్టారు. అలాంటివాళ్లను నిర్మొహమాటంగా అణిచేస్తాం. రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని రౌడీయిజం చేస్తామంటే ఊరుకోం’’ అని హెచ్చరించారు.


ఏపీలో ఏ అంటే అమరావతి.. పీ అంటే పోలవరం

ఆంధ్రప్రదేశ్‌ను సంక్షిప్తంగా ఏపీ అని పిలుస్తారని, దీనిలో ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరమని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ రెండు ప్రాజెక్టులకూ అంత ప్రాధాన్యం ఉందన్నారు. అవి జగన్‌ మూర్ఖత్వం వల్ల విధ్వంసానికి గురయ్యాయని ధ్వజమెత్తారు. పోలవరం, అమరావతి.. సంపద సృష్టి కేంద్రాలని, వాటివల్ల మొత్తం సమాజానికే మేలు జరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.


ప్రజావేదిక శిథిలాలను అలాగే ఉంచే అంశాన్ని పరిశీలిస్తాం

 

విధ్వంస గురుతులు

ఉండవల్లిలో వైకాపా ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక శిథిలాలను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో మంత్రి నారాయణ

జగన్‌ ప్రభుత్వం చేసిన విధ్వంసం భావితరాలకు తెలిసేలా ప్రజావేదిక శిథిలాలను అలాగే ఉంచాలని ఒక విలేకరి సూచించగా... అది మంచి సూచనేనని, పరిశీలిస్తామని తెలిపారు. రెండో ప్రపంచయుద్ధంలో అణుబాంబు తాకిడికి విధ్వంసమైన హిరోషిమా, నాగసాకి ప్రాంతాల్ని జపాన్‌ అలాగే ఉంచి... వాటిని స్ఫూర్తిగా తీసుకుని ఎదిగిందని గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని