Chandrababu: చంద్రబాబు భావోద్వేగం

అంతెత్తున పెరిగిన కంపచెట్లతో అడవిని తలపిస్తున్న రాజధానిని... అమరావతిపై జగన్‌ కక్షసాధింపునకు సాక్షీభూతంగా ఐదేళ్లుగా అక్కడే పడి ఉన్న ప్రజావేదిక శిథిలాల్ని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు గుండె బరువెక్కింది.

Updated : 21 Jun 2024 07:14 IST

చిట్టడవిని తలపిస్తున్న రాజధాని ప్రాంతం
మొండిగోడలతో మిగిలిపోయిన భవనాలు
పవిత్ర మట్టికి ప్రణమిల్లిన సీఎం చంద్రబాబు
నీళ్లలో నానుతున్న పునాదులు చూసి ఆవేదన


సంకల్ప ప్రణామం

అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలోని పవిత్ర స్థలం
‘మన మట్టి - మన అమరావతి’ వద్ద మోకాళ్లపై ప్రణమిల్లిన సీఎం చంద్రబాబు


ఈనాడు, అమరావతి: అంతెత్తున పెరిగిన కంపచెట్లతో అడవిని తలపిస్తున్న రాజధానిని... అమరావతిపై జగన్‌ కక్షసాధింపునకు సాక్షీభూతంగా ఐదేళ్లుగా అక్కడే పడి ఉన్న ప్రజావేదిక శిథిలాల్ని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు గుండె బరువెక్కింది. మొండిగోడలతో అసంపూర్తిగా మిగిలిపోయిన భవనాలు... చెరువుల్ని తలపిస్తున్న సచివాలయం, హైకోర్టు భవనాల పునాదులు... వాటిలో ఏళ్లతరబడి నానుతున్న నిర్మాణాల్ని చూసి చలించిపోయారు. రాజధాని శంకుస్థాపన సమయంలో పలు ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన మట్టిని చూసి భావోద్వేగానికి గురయ్యారు. రాజధాని నిర్మాణాన్ని తిరిగి కొనసాగించే శక్తినీ, సంకల్పాన్నీ ఇవ్వాలంటూ... పవిత్రమైన ఆ మట్టికి నమస్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రాజధానిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విస్తృతంగా పర్యటించారు. ఐదేళ్లలో రాజధాని ప్రాంతంలో జగన్‌ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని, రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని మట్టిపాలు చేసిన తీరును చూసి తీవ్ర ఆవేదన చెందారు.


నాటి ఆరంభోత్సవ వైభవం

2015 అక్టోబరు 22న శంకుస్థాపన సందర్భంగా కళకళలాడుతున్న పవిత్ర స్థలం


ప్రజావేదికతో మొదలు

ఉండవల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి పక్కనే ఉన్న ప్రజావేదిక శిథిలాల్ని సందర్శించడంతో చంద్రబాబు రాజధాని పర్యటన ప్రారంభమైంది. వివిధ సమావేశాలు నిర్వహించేందుకు, ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చే ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు 2019కి ముందు చంద్రబాబు ప్రభుత్వం ప్రజావేదికను నిర్మించింది. అప్పట్లో ఆ ప్రజావేదిక ఎన్నో విధాలుగా ఉపయోగపడింది. కలెక్టర్ల సదస్సులు మొదలు, అనేక సమావేశాలు అక్కడే జరిగేవి. ముఖ్యమంత్రి విలేకర్లతోనూ అక్కడే మాట్లాడేవారు. అలాంటి ప్రజావేదికను అధికారంలోకి రాగానే కూల్చేసిన జగన్‌ ప్రభుత్వం... ఐదేళ్లలో ఆ శిథిలాలను కావాలనే తొలగించకుండా, అలా వదిలేసింది. ప్రజావేదిక శిథిలాలను పరిశీలించిన చంద్రబాబు... అప్పట్లో వాటిని కూల్చాలని ఎవరు ఆదేశాలిచ్చారు? లిఖితపూర్వకంగా ఆదేశించారా? మౌఖికంగా చెప్పారా? అని సీఆర్‌డీఏ అధికారుల్ని అడిగారు. మౌఖికంగానే ఆదేశించారని సీఆర్‌డీఏ అధికారులు బదులివ్వగా... ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనం నిర్మాణానికి ఒక ప్రొసీజర్‌ అనుసరించినప్పుడు, కూల్చాలన్నా నిబంధనల్ని అనుసరించాలి కదా? అని ప్రశ్నించారు.     

మహిళా రైతుల హారతులు

అక్కడి నుంచి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు మీదుగా రాజధాని శంకుస్థాపన ప్రదేశానికి చంద్రబాబు చేరుకున్నారు. పవిత్రమైన మట్టి ఉంచిన చోటుకు వెళ్లారు. రాజధాని శంకుస్థాపన దృశ్యాలు కళ్లముందు కదలాడుతుండగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఆ మట్టి చుట్టూ ప్రదక్షిణ చేసి.. ప్రణమిల్లి, కొబ్బరికాయ కొట్టారు. ఆ సమయంలో రాజధాని రైతుల ఉద్యమానికి చిహ్నంగా మెడలో ఆకుపచ్చ కండువా ధరించారు. అక్కడి నుంచి ఆయన రాజధాని సమయంలో హోమం చేసిన శాలలోకి చేరుకున్నారు. అప్పటికే అక్కడ పూజలు చేస్తున్న రాజధాని మహిళలు ఆయనకు దిష్టి తీసి, హారతులిచ్చారు. ఆయన వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఆయన హోమ గుండానికి కొబ్బరికాయ కొట్టి నమస్కరించారు. పక్కనే అమరావతి డిజైన్లు, త్రీడీ నమూనాలు ఉంచిన గ్యాలరీని చంద్రబాబు సందర్శించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ ప్రాంతాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేయడం, కాపలా కూడా ఉంచకపోవడంతో ఎన్నికలకు కొన్నిరోజుల ముందు కొందరు దుండగులు ఆ నమూనాల్ని ధ్వంసం చేసి, అక్కడ బీభత్సం సృష్టించారు. తెదేపా అధికారంలోకి వచ్చాక అప్రమత్తమైన సీఆర్‌డీఏ అధికారులు... ఆ నమూనాల్ని కొంత పునరుద్ధరించారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో... రాజధానిలో వివిధ ప్రాజెక్టుల వివరాలు, చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. చంద్రబాబు వాటిని పరిశీలించారు. 


సీఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజధాని నమూనా చిత్రాన్ని చూపుతూ మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
 

నీళ్లలో నానుతున్న పునాదుల్ని చూసి ఆవేదన

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారుల కోసం నిర్మించిన టవర్లను చంద్రబాబు పరిశీలించారు. ఇప్పటికే సిద్ధమైన ఫ్లాట్‌లోకి వెళ్లి కలియతిరిగి చూశారు. సీనియర్‌ అధికారులు, మంత్రుల కోసం తలపెట్టిన గృహాల్ని పరిశీలించారు. వాటిచుట్టూ ముళ్లచెట్లు పెరిగి అడవిలా మారడంతో ఆవేదన వ్యక్తంచేశారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్ల కోసం వేసిన పునాదుల్ని పరిశీలించారు. అవి నీటిలో నానుతూ ఉండడాన్ని చూసి ఆవేదన చెందారు.

కాన్వాయ్‌ని వెనక్కి తిప్పి... భవనాల సందర్శన

చంద్రబాబు పర్యటనలో భాగంగా నాలుగో తరగతి ఉద్యోగుల కోసం నిర్మించిన నివాస భవనాల్నీ పరిశీలించాల్సి ఉంది. మంత్రుల నివాస భవనాల్ని పరిశీలించాక నేరుగా విలేకర్లతో మాట్లాడేందుకు సీఆర్‌డీఏ కార్యాలయ భవనం వద్దకు తీసుకొచ్చారు. నాలుగోతరగతి ఉద్యోగుల నివాస భవనాల్ని చూడలేదన్న విషయాన్ని గమనించిన చంద్రబాబు కాన్వాయ్‌ని వెనక్కి తిప్పించి... అక్కడకు తీసుకెళ్లారు. ఆ భవనాల్లోకి వెళ్లి మొత్తం పరిశీలించారు.


ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రదేశం వద్ద చంద్రబాబుకు హారతి పడుతున్న మహిళలు

రాజధాని రైతుల ఘనస్వాగతం

సీడ్‌యాక్సెస్‌ రోడ్డు పక్కనే నిర్మాణంలో ఉన్న సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద విలేకర్లతో మాట్లాడారు. అక్కడ చంద్రబాబుకు రాజధాని రైతులు, సీఆర్‌డీఏ ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. రాజధాని పర్యటనలో చంద్రబాబు వెంట పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, కొలికపూడి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అశోక్‌కుమార్‌ సింఘాల్, సీఆర్‌డీఏ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, గుంటూరు జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి తదితరులున్నారు. సీఆర్‌డీఏ పూర్వ కమిషనర్‌ వివేక్‌యాదవ్‌ కూడా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని