Chandrababu: వ్యవసాయ రంగానికి రూ.2.64 లక్షల కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల ద్వారా వ్యవసాయ రంగానికి రూ.2.64 లక్షల కోట్ల రుణాలు అందజేయనున్నారు. ఇందులో రూ.1.66 లక్షల కోట్లు పంట రుణాలే.

Updated : 10 Jul 2024 05:37 IST

ఉపాధి కల్పన, పరిశ్రమలకు ప్రోత్సాహం
2024-25 రుణ ప్రణాళిక విడుదల చేసిన చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల ద్వారా వ్యవసాయ రంగానికి రూ.2.64 లక్షల కోట్ల రుణాలు అందజేయనున్నారు. ఇందులో రూ.1.66 లక్షల కోట్లు పంట రుణాలే. గతేడాదితో పోలిస్తే సాగు రంగానికి 14%, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 26% మేర రుణ లక్ష్యం పెంచారు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, మత్స్య, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయంలో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.32,600 కోట్ల రుణాలు అందించాలని నిర్దేశించారు. సచివాలయంలో మంగళవారం జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో రూ.5.40 లక్షల కోట్లతో రూపొందించిన 2024-25 రుణ ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. యూనియన్‌ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ రుద్ర, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ సీవీఎన్‌ భాస్కరరావు 2023-24లో రంగాల వారీగా సాధించిన లక్ష్యాలు, ఈ ఆర్థిక సంవత్సర రుణ మంజూరు వివరాలను వెల్లడించారు. 

సేద్యానికే అగ్ర ప్రాధాన్యం

ప్రాధాన్య రంగాలకు ఈ ఏడాది రూ.3.75 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే ఇది రూ.52 వేల కోట్లు అధికం. ప్రాధాన్య రంగాల్లో అధిక భాగం వ్యవసాయ, అనుబంధ విభాగాలకు నిర్దేశించారు. గతేడాది సాగు రంగానికి రుణలక్ష్యం 2.31 లక్షల కోట్లు కాగా, 90% వరకు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. 

పరిశ్రమలకు తోడ్పాటు

ఎంఎస్‌ఎంఈ రంగానికి ఈ ఏడాది పెద్దపీట వేశారు. గతేడాదితో పోలిస్తే రుణమంజూరు లక్ష్యాన్ని రూ.18,000 కోట్లు పెంచారు. సూక్ష్మ పరిశ్రమలకు రూ.46 వేల కోట్లు, చిన్న పరిశ్రమలకు రూ.27 వేల కోట్లు, మధ్య తరహా పరిశ్రమలకు రూ.13,500 కోట్లు, ఇతర విభాగాలకు రూ.500 కోట్ల చొప్పున ఇవ్వాలని లక్షించారు. గతేడాదితో పోలిస్తే విద్యా రుణాలను రూ.500 కోట్లు పెంచారు. 

కౌలు రైతులకు భారీగా పెంపు

ఈ ఏడాది కౌలు రైతులకు రూ.4 వేల కోట్ల పంట రుణాలివ్వాలని ప్రణాళికలో పేర్కొన్నారు. కొన్నేళ్లుగా కౌలు రైతులకు బ్యాంకుల్లో అప్పు పుట్టడం లేదు. ఈ ఏడాది ఆంక్షలు సడలించి రుణాలివ్వాలని ప్రభుత్వం బ్యాంకర్లకు సూచించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు