VinFast: రాష్ట్రానికి విన్‌ఫాస్ట్‌?

విద్యుత్తు వాహనాల (ఈవీ) తయారీ సంస్థ విన్‌ఫాస్ట్‌.. రాష్ట్రంలో యూనిట్‌ ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తోంది. రూ.4 వేల కోట్ల పెట్టుబడితో ప్లాంట్‌ పెట్టేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలిస్తోంది.

Published : 11 Jul 2024 05:00 IST

విద్యుత్తు వాహన తయారీ ప్లాంటు ఏర్పాటుకు ఆసక్తి
రూ.4 వేల కోట్ల పెట్టుబడికి అవకాశం
సీఎం చంద్రబాబుతో భేటీ
ఏపీకి వస్తే భూమి, సౌకర్యాల కల్పనకు సిద్ధమన్న సీఎం

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందిస్తున్న విన్‌ఫాస్ట్‌ సీఈవో పామ్‌ సాన్‌ చౌ. చిత్రంలో మంత్రి టీజీ భరత్‌ తదితరులు

ఈనాడు, అమరావతి: విద్యుత్తు వాహనాల (ఈవీ) తయారీ సంస్థ విన్‌ఫాస్ట్‌.. రాష్ట్రంలో యూనిట్‌ ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తోంది. రూ.4 వేల కోట్ల పెట్టుబడితో ప్లాంట్‌ పెట్టేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలిస్తోంది. రాయలసీమలో పరిశ్రమ ఏర్పాటు చేస్తే అవసరమైన భూమిని కేటాయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంసిద్ధత వెలిబుచ్చారు. వియత్నాంకు చెందిన ఈ సంస్థకు విద్యుత్తు వాహనాల తయారీలో ప్రపంచంలోనే మంచి పేరుంది. తెదేపా ప్రభుత్వ హయాంలోనే అంతర్జాతీయంగా పేరున్న కియా సంస్థ రాష్ట్రంలోకి అడుగుపెట్టింది. అనంతపురం జిల్లాలో వాహన తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసింది. దీంతో జిల్లా రూపురేఖలే మారిపోయాయి. ఇప్పుడు ఈ విద్యుత్తు వాహన, బ్యాటరీ తయారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి వస్తే.. మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుంది. అందులోనూ పెట్టుబడిదారుల్ని ఆకట్టుకుని రాష్ట్రానికి రప్పించడంలో చంద్రబాబుకు ఎంతో అనుభవం ఉంది.

అన్ని విధాలా సహకరిస్తాం

భారత్‌లో ఈవీ ప్లాంటు ఏర్పాటులో భాగంగా వచ్చిన విన్‌ఫాస్ట్‌ ప్రతినిధి బృందంతో చంద్రబాబు బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సంస్థ సీఈఓ పామ్‌ సాన్‌ చౌ, ప్రతినిధులకు వివరించారు. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో ఎంతో పేరున్న ఆ సంస్థను రాష్ట్రానికి ఆహ్వానించారు. ఈవీ, బ్యాటరీ తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని కోరారు. అవసరమైన భూమి, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విన్‌ఫాస్ట్‌ ప్రతినిధులకు చంద్రబాబు విందు ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు విన్‌ఫాస్ట్‌ ప్రతినిధులు చంద్రబాబుకు వివరించారని పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. రాయితీలపై చర్చించి, అంతా అనుకూలంగా ఉంటే.. రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయమై నెల రోజుల్లో స్పష్టత వస్తుందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని