Chandrababu: ముగ్గురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ

రాష్ట్ర సమస్యల పరిష్కారం దిల్లీ వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ముగ్గురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు.

Published : 06 Jul 2024 05:49 IST

 రాష్ట్ర సమస్యలపై ప్రస్తావన

శుక్రవారం దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

ఈనాడు, దిల్లీ: రాష్ట్ర సమస్యల పరిష్కారం దిల్లీ వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ముగ్గురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, వైద్య ఆరోగ్యం, ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాలను వేర్వేరుగా కలిశారు. రాష్ట్ర సమస్యలపై వారికి వినతిపత్రాలు సమర్పించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సుమారు గంటకు పైగా ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేయబోతున్నట్లు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. నీతి ఆయోగ్‌ సీఈఓ బీవీఆర్‌ సుబ్రహ్మణ్యంతోనూ చంద్రబాబు ఉదయం సమావేశమయ్యారు. రాష్ట్రాలకు కేంద్రం చేసే సాయంపై నీతి ఆయోగ్‌ సిఫార్సులు కీలకంగా మారిన నేపథ్యంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఆర్థిక, సామాజిక పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజిని అమలు చేసేలా చూడాలని కోరారు.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆలింగనం చేసుకుంటున్న సీఎం చంద్రబాబునాయుడు

కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ మంత్రి రామ్‌దాస్‌ అఠావలే, పలువురు పారిశ్రామికవేత్తలతోనూ చంద్రబాబు శుక్రవారం సమావేశమయ్యారు. దీంతో రెండు రోజుల దిల్లీ పర్యటనలో చంద్రబాబు ప్రధానమంత్రితోపాటు, 9 మంది కేంద్ర మంత్రులు, 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్, నీతిఆయోగ్‌ సీఈఓలతో భేటీ అయినట్లయింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి 25 రోజులే అయిందని, అందువల్ల ప్రస్తుత పర్యటనలో ఆయన కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి, ఆర్థికాంశాలు, కొన్ని ప్రధాన సమస్యలను మాత్రమే వారి దృష్టికి తీసుకెళ్లారని అధికారులు, ఎంపీలు తెలిపారు. ప్రధాని, కేంద్ర మంత్రుల స్పందన చూసిన తర్వాత.. రాష్ట్రానికి తప్పనిసరిగా మేలు జరుగుతుందన్న నమ్మకం కలిగినట్లు ఆయన పర్యటనలో పాలుపంచుకున్న ఎంపీలు తెలిపారు. 

మంత్రి నడ్డాతో సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. చిత్రంలో కేంద్ర మంత్రి
పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని