Chandrababu: ప్రజలకూ నాకూ మధ్య అడ్డుగోడలుండవు

ప్రజలకు, తనకు మధ్య అడ్డుగోడలు ఏర్పాటు చేస్తే ఉపేక్షించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల నుంచి నేరుగా వినతుల స్వీకరణ, నిర్దేశిత సమయంలోగా పరిష్కారానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు.

Published : 16 Jun 2024 04:37 IST

సామాన్యుల్ని కలిసేందుకు ఎక్కువ సమయం
నేరుగా వినతుల స్వీకరణకు ప్రత్యేక ప్రణాళిక
మీడియాతో చంద్రబాబు

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో దివ్యాంగుల నుంచి వినతులు స్వీకరిస్తున్న సీఎం చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ప్రజలకు, తనకు మధ్య అడ్డుగోడలు ఏర్పాటు చేస్తే ఉపేక్షించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల నుంచి నేరుగా వినతుల స్వీకరణ, నిర్దేశిత సమయంలోగా పరిష్కారానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. ‘ప్రజలు తమ సమస్యల్ని నేరుగా ప్రభుత్వ పెద్దలకు చెప్పే అవకాశం కల్పిస్తాం. దీనికి వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తా. దీనికి ఎలాంటి విధానం అనుసరించాలనే విషయమై చర్చిస్తున్నాం. వినతుల స్వీకరణ సచివాలయంలోనా? మరేదైనా వేదిక ఏర్పాటు చేయడమా అనేది ఆలోచిస్తున్నాం. అక్కడికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శనివారం ఆయన తొలిసారి మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయానికి వచ్చారు. అక్కడ ఇనుప గ్రిల్స్‌తో బారికేడ్లు పెట్టి, తనను కలిసేందుకు వచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణుల్ని దూరంగా ఉంచడంపై మండిపడ్డారు. పార్టీ శ్రేణులకు, తనకు దూరం పెంచే ఇలాంటి చర్యలను సహించేది లేదని, గత ప్రభుత్వ హ్యాంగోవర్‌ వీడాలని పోలీసులకు స్పష్టం చేశారు. కార్యకర్తల తాకిడి ఎక్కువగా ఉంటే క్రమపద్ధతిలో వారిని నియంత్రించాలి తప్ప మరోసారి బారికేడింగ్‌ వ్యవస్థ కనిపించకూడదని పోలీసులను హెచ్చరించారు.


మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయానికి వచ్చిన అభిమానులు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరిస్తున్న సీఎం చంద్రబాబు 

రాజధానిలో కార్యకలాపాలు పెరుగుతాయి

రాబోయే రోజుల్లో రాష్ట్ర సచివాలయం, రాజధాని ప్రాంతంలో కార్యకలాపాలు పెరుగుతాయని చంద్రబాబు చెప్పారు. ఇందుకు అనుగుణంగా.. సచివాలయానికి వచ్చి వెళ్లే వారి కోసం రహదారులు, రవాణా, ఇతర సౌకర్యాలు పెంచుతామని వివరించారు. పోలవరం పర్యటనతో తన క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభమవుతాయని తెలిపారు. ‘ప్రజల్లోకి వెళ్లినప్పుడు పరదాలు, బారికేడ్లు, ఆంక్షలు ఉండకూడదనేది మా విధానం. భద్రతా నిబంధనలు పాటిస్తూనే, సాధ్యమైనంత వరకు వారికి అందుబాటులో ఉంటా’ అని తనను కలిసిన మీడియా ప్రతినిధులతో చంద్రబాబు చెప్పారు.

జగన్‌ విధ్వంస పాలనకు సాక్ష్యంగా ప్రజావేదిక శిథిలాలు

జగన్‌మోహన్‌రెడ్డి విధ్వంస పాలన ప్రజావేదిక కూల్చివేతతోనే మొదలైంది. ఆ విధ్వంసానికి ప్రజలందరికీ చాటిచెప్పేలా కూల్చేసిన ప్రజావేదికను అలాగే ఉంచుతామని.. అక్కడి శిథిలాలు కూడా తొలగించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రజావేదిక ఉంటే.. వినతుల స్వీకరణకు అనువుగా ఉండేదన్నారు.


పార్టీ నాయకులతో సమావేశమైన తెదేపా అధినేత 

పార్టీ కార్యాలయం వద్ద ఘనస్వాగతం 

ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తనను కలిసేందుకు వచ్చిన వారితో ఆయన ఫొటోలు దిగారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పార్టీ కార్యాలయ నాయకులతో చంద్రబాబు సమావేశమయ్యారు. గత ప్రభుత్వ అరాచకాలను బయటకు తీసి.. సామాజిక మాధ్యమ వేదికలుగా పోస్ట్‌ చేయడంతోపాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణలో వివిధ విభాగాలు చేసిన కృషి మంచి ఫలితాన్నిచ్చిందని అభినందించారు. విజయంతో పని అయిపోలేదని, మరింత బాధ్యతగా పనిచేయాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.


దివ్యాంగుడికి చంద్రబాబు ఆర్థిక సాయం

దివ్యాంగుడు కనపర్తి మనోజ్‌తో మాట్లాడుతున్న సీఎం 

ఈనాడు డిజిటల్, అమరావతి: కడపకు చెందిన కనపర్తి మనోజ్‌ అనే దివ్యాంగుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.3 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. శనివారం మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో చంద్రబాబును మనోజ్‌ కలిశారు. వీల్‌ ఛైర్‌కే పరిమితమైన తన పరిస్థితి గురించి ముఖ్యమంత్రికి వివరించారు. సీఎం సానుకూలంగా స్పందించి సాయం ప్రకటించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని