Chandrababu: కుదేలైన వ్యవస్థలను గాడిన పెడుతున్నాం

రాష్ట్రంలో గత ప్రభుత్వ విధానాలతో కుదేలైన వ్యవస్థలను గాడిన పెట్టేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

Published : 10 Jul 2024 05:06 IST

ఇందుకు బ్యాంకుల సహకారం అవసరం
రుణాల మంజూరులో సంపద సృష్టించే రంగాలకు ప్రాధాన్యమివ్వండి
ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సీఎం చంద్రబాబు 

బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు..
సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, అధికారులు 

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో గత ప్రభుత్వ విధానాలతో కుదేలైన వ్యవస్థలను గాడిన పెట్టేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సంపద సృష్టించే రంగాలకు ప్రాధాన్యమివ్వాలని, వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని బ్యాంకర్లకు సూచించారు. కౌలు రైతులకు ఆంక్షలు తొలగించి సులభ రీతిలో రుణాలివ్వాలని పేర్కొన్నారు. సచివాలయంలో మంగళవారం జరిగిన 227వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ‘దేశవ్యాప్తంగా డిజిటల్‌ లావాదేవీల్లో ముందున్న మొదటి మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. భవిష్యత్తులో అగ్రగామిగా నిలిచేలా ప్రణాళికలు అమలు చేయాలి. డిజిటల్‌ చెల్లింపులతో అవినీతి తగ్గుతుంది. ఉత్పాదకత పెరుగుతుంది. దీన్ని బ్యాంకులు ప్రోత్సహించాల’ని సూచించారు. యువతలో నైపుణ్య పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ఉద్యాన, ఆక్వా రంగాలకు మరింతగా రుణాలిచ్చి ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఉద్యాన రంగం పూర్తిగా నాశనమైందని, తిరిగి నిలబెడితేనే రైతులకు మేలు జరుగుతుందని గుర్తుచేశారు. ఆవులు, గేదెల కొనుగోలుకు రుణాలివ్వాలన్నారు. కొత్త ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలు తీర్చేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకు బ్యాంకులు సహకరించాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ కోరారు. రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో బ్యాంకులు నమ్మకమైన భాగస్వాములు కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

5 ప్రధాన అంశాలపై అధ్యయనానికి కమిటీ

ఐదు ప్రధాన అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు మంత్రులు, బ్యాంకర్లు, నిపుణులతో కమిటీ వేయనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఈ కమిటీ అధ్యయనం చేయాల్సిన విషయాలివీ.. 

1. వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చుల తగ్గింపు, కౌలు రైతులకు రుణాలు, మెరుగైన పంటల బీమా అమలు.

2. పీ4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనకు అవసరమైన ప్రాజెక్టులు, ప్రణాళికల అమలు.

3. డిజిటల్‌ లావాదేవీల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో  నిలపడం.

4. నైపుణ్యాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు.

5. సంపద సృష్టించి, జీఎస్‌డీపీ పెంచే రంగాలకు ప్రోత్సాహం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని