Chandrababu: ఆర్థిక సుడిగుండం నుంచి గట్టెక్కించండి

గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు.

Updated : 05 Jul 2024 06:49 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చంద్రబాబు వినతి
మరో ఆరుగురు కేంద్ర మంత్రులతోనూ సీఎం భేటీలు
16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ అరవింద్‌ పనగడియాతోనూ..
రాష్ట్ర సమస్యల పరిష్కారంపై విస్తృత చర్చలు
ఈనాడు - దిల్లీ

ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైన సీఎం చంద్రబాబు

గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జగన్‌ ప్రభుత్వ ఐదేళ్ల  దుష్పరిపాలనతో ఆర్థిక వనరులన్నీ ఆవిరైపోయాయని చెప్పారు. వచ్చే ఆదాయం జీతాలు, పింఛన్లు, అప్పులు తీర్చడానికి కూడా సరిపోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తగిన చేయూతనివ్వాలని కోరారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి దిల్లీకి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు. ప్రధానమంత్రితోపాటు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్, రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, ఇంధనశాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి, 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ అరవింద్‌ పనగడియాలతో వరుసగా సమావేశమయ్యారు.

వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 2014లో రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న సమస్యలు, దానికితోడు గత ఐదేళ్ల జగన్‌ దుష్పరిపాలన వల్ల తలెత్తిన ఇబ్బందులను వివరించారు. గత ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళికతో పనిచేయకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌ దారుణంగా దెబ్బతిన్నట్లు వివరించారు. అనుత్పాదక వ్యయం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం సహజ వనరుల దోపిడీ, మానవవనరుల అభివృద్ధిని గాలికొదిలేయడంతో అభివృద్ధి అడుగంటిపోయినట్లు చెప్పారు. ఆదాయాలు పడిపోయి అప్పులు ఆకాశాన్నంటినట్లు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు, ఇతర జలవనరులు, రహదారులు, రాజధాని నిర్మాణాలను గత ప్రభుత్వం విస్మరించడం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు. రాష్ట్ర ఆదాయం కంటే జీతాలు, పింఛన్లు, అప్పుల చెల్లింపులు పెరిగిపోయాయని, దీనివల్ల మూలధన వ్యయం కోసం ప్రభుత్వం వద్ద ఆర్థిక వనరులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మద్యంపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం విచక్షణారహితంగా అప్పులు చేసిందని, దానికితోడు ప్రజాధనాన్ని పెద్దఎత్తున దారి మళ్లించిందని చెప్పారు. ఫలితంగా ప్రజావసరాలు తీర్చడానికి ప్రస్తుతం ఆర్థిక వనరులు లేని పరిస్థితి దాపురించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనివ్వకపోతే ఈ సవాళ్ల నుంచి బయటపడటం కష్టమని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 

మోదీ నాయకత్వంలో బలంగా పుంజుకుంటాం

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చంద్రబాబు ప్రధానితో చర్చించారు. ఈ సమావేశం జరిగిన తీరును సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పంచుకున్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన అంశాల పరిష్కారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిర్మాణాత్మక సమావేశం జరిగింది. ఆయన నాయకత్వంలో మన రాష్ట్రం మళ్లీ బలమైన పవర్‌హౌస్‌గా అవతరిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు. 

చంద్రబాబును ఆహ్వానించడం మాకు గౌరవం: పనగడియా

భారత్, ఆంధ్రప్రదేశ్‌ విషయంలో చంద్రబాబుకున్న ఆశాభావం ఎంతో స్ఫూర్తినిచ్చినట్లు 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ అరవింద్‌ పనగడియా అభిప్రాయపడ్డారు. ఆయన్ను 16వ ఆర్థిక సంఘం కార్యాలయానికి ఆహ్వానించడాన్ని ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి సాంకేతిక నగరంగా తీర్చిదిద్దిన నిజమైన దార్శనిక నాయకుడు చంద్రబాబు అని ఆయన అభివర్ణించారు. 

ఏఐఎస్‌ అధికారులకు విందు

చంద్రబాబునాయుడు గురువారం రాత్రి దిల్లీలో 66 మంది అఖిల భారత సర్వీసు అధికారులకు విందు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తమ వంతు చేయూతనందించాలని వారిని కోరారు. ఆయన శుక్రవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, నీతి ఆయోగ్‌ సీఈఓ బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం, వేదాంత గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్, ఎన్టీపీసీ సీఎండీ గుర్‌దీప్‌ సింగ్, ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్‌ సంతోష్‌ యాదవ్, ఫిక్కి ప్రతినిధి బృందంతో సమావేశం కానున్నారు.


ప్రధానిని చంద్రబాబు సాయం కోరిన 7 ప్రధానాంశాలు

1. స్వల్పకాలానికి రాష్ట్రానికి ఆర్థికంగా చేయూతనివ్వడం 

2. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పునఃప్రారంభానికి సత్వర చర్యలు తీసుకోవడం

3. అమరావతి రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల సముదాయం పూర్తికి సమగ్ర ఆర్థిక సాయం అందించడం

4. పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వడం

5. రాష్ట్రాలకు మూలధన వ్యయం అందించే ప్రత్యేక పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు అదనపు కేటాయింపులు జరిపి రహదారులు, వంతెనలు, సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడటం 

6. బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీ తరహాలో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు మద్దతు పలకడం 

7. దుగరాజపట్నం పోర్టు పూర్తి చేసేలా రాష్ట్రానికి చేయూతనందించడం


వికసిత ఆంధ్రప్రదేశ్‌కు కట్టుబడి ఉన్నాం: అమిత్‌షా

వికసిత భారత్‌ భారత్‌తోపాటు, వికసిత ఆంధ్రప్రదేశ్‌కు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడితో దేశం, రాష్ట్ర పురోగతిని వేగవంతం చేయడానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించాం. భారత్, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని  చంద్రబాబుతో సమావేశం అనంతరం ఆయన ఎక్స్‌లో తెలిపారు. ‘డైనమిక్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం ఉత్సాహంగా సాగింది. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ అభివృద్ధి బాటన సాగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ పురోగతి, వృద్ధి కోసం ఎలా సాయం చేయాలన్న అంశంపై చర్చించాం’ అని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న జాతీయ రహదారుల ప్రాజెక్టుల గురించి చంద్రబాబు, ఇతర సీనియర్‌ అధికారులతో సమీక్షించినట్లు నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. చంద్రబాబుతో వ్యవసాయం, గ్రామీణ రంగాల అభివృద్ధిపై చర్చించినట్లు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. రాష్ట్ర రైతుల సాధికారత, పురోగతి కోసం మోదీ నాయకత్వంలో తాము కలిసికట్టుగా పనిచేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రోత్సహించి దాని నిజమైన శక్తిసామర్థ్యాలను వెలికితీయడంతోపాటు, ఆ రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వంలో ఏం చేయాలన్న దానిపై చర్చించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి, ఇంధనశాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని