Chandrababu: రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం

గత ఐదేళ్ల జగన్‌ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

Updated : 06 Jul 2024 06:47 IST

ఇందుకు ఎన్డీయే తరఫున ఉమ్మడిగా పనిచేస్తాం
డెవిల్‌ను నియంత్రించాం... ఇక పెట్టుబడిదారులకు భయం లేదు
జాతీయ మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

ఈనాడు, దిల్లీ: గత ఐదేళ్ల జగన్‌ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఎన్డీయేకు అధికారం కట్టబెట్టినందున అన్ని పార్టీల నాయకులూ కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తామని చెప్పారు. దిల్లీ పర్యటన ముగింపు సందర్భంగా ఆయన శుక్రవారం రాత్రి జాతీయ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రస్తుతం ఎన్డీయేలో మీరు కీలక భాగస్వామి అయినా ఎందుకు ఎక్కువ పదవులు తీసుకోలేదు, డిప్యూటీ స్పీకర్‌ పదవి అడిగారా?

అన్న ప్రశ్నలకు చంద్రబాబు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. కేంద్రంలో ఎన్నో సంకీర్ణ ప్రభుత్వాల్లో తెదేపా భాగస్వామిగా ఉన్నా.. ఎప్పుడూ పదవులను కోరుకోలేదని, రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ పనిచేసిందని చెప్పారు. ప్రాంతీయపార్టీ అయినా జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తాము మద్దతిచ్చినట్లు పేర్కొన్నారు. ఇదివరకు వాజపేయీ ప్రభుత్వంలో తమకు ఏడు మంత్రి పదవులు ఇస్తామన్నా తీసుకోలేదని, ప్రభుత్వ సుస్థిరత కోసం అప్పట్లో స్పీకర్‌ పదవినే తీసుకున్నామని గుర్తుచేశారు. ఇప్పుడూ పదవులేమీ అడగలేదని, ఇచ్చిన రెండు పదవులను కాదనకుండా తీసుకున్నామని చెప్పారు. ఈ రెండింటితో తాము సంతోషంగా ఉన్నామని, అలా ఉండటం మీడియాకే బాధగా ఉందని నవ్వుతూ వ్యాఖ్యానించారు. వచ్చే ఐదేళ్లూ రాష్ట్ర పునర్నిర్మాణానికే పనిచేస్తామని, ఇదే విషయాన్ని ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రులకు చెప్పి.. కేంద్రం చేయూతనివ్వాలని కోరినట్లు తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

రాష్ట్రంలో అపార వనరులు

‘‘దక్షిణాదిలో మరే రాష్ట్రానికీ లేనన్ని వనరులు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నాయి. రాష్ట్రం గుండా కృష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తాయి. గోదావరిలోనే మిగులు జలాలు ఉన్నాయి. ఏటా 3వేల టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో కలుస్తోంది. వీటిని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్ర సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీర్చుకోవడంతో పాటు, దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాలకూ అందించడానికి వీలవుతుంది. గత జగన్‌ పాలనలో నిర్లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. ఇప్పుడు కొత్తవాల్‌ నిర్మాణానికి గతంలో పెట్టిన ఖర్చు కంటే రెట్టింపు అవుతుంది. ఈ ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదం స్థాయికి మేమింకా రాలేదు. జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రమే ఆ విషయం చూసుకుంటుంది. గత ఐదేళ్ల జగన్‌ పాలన కారణంగా అమరావతి వైబ్రెన్సీ కొంతవరకు తగ్గింది. దాన్ని పెంచడమే ధ్యేయంగా మేం పనిచేస్తాం. అమరావతిలో 135 ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయి. దాంతోపాటు రహదారులు, వంతెనల్లాంటి ముఖ్యమైన మౌలికవసతుల నిర్మాణాన్ని మేమే పూర్తిచేస్తాం. ఐకానిక్‌ భవనాలుగా తలపెట్టిన అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ నిర్మాణాలనూ సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తాం. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న భవనాలను పూర్తిచేసి ఉపయోగంలోకి తెస్తాం. రాష్ట్రంలో నైపుణ్యగణన చేపట్టబోతున్నాం. దీని ఫలితాల ఆధారంగా ప్రజలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి హామీలను కల్పిస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.

రెండు రాష్ట్రాలకూ సమన్యాయం జరగాలి

ఇరు తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో శనివారం నాటి సమావేశం సానుకూలంగా జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఒకవేళ రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చినా, తాను మాత్రం రెండు రాష్ట్రాల ప్రయోజనాలకూ ప్రాధాన్యం ఇస్తానని, రెండు రాష్ట్రాలకూ సమన్యాయం జరగాలన్నదే ఇప్పటికీ తన ఉద్దేశమని ఆయన తెలిపారు. సోదరులైన రెండు రాష్ట్రాల ప్రజలు విడిపోయినా కలిసిమెలిసి ముందుకు సాగాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడిదారులు వస్తున్నారని, అయితే ప్రతి ఒక్కరూ మళ్లీ ఆ భూతం వస్తే ఎలా అని అడుగుతున్నారని అన్నారు. అయితే ఆ డెవిల్‌ను నియంత్రిస్తామని, మీకేమీ భయం అవసరం లేదని తాను భరోసా ఇస్తున్నానని చెప్పారు. ఇప్పుడు తాము పెట్టుబడిదారులకు ద్వారాలు తెరిచామన్నారు. వచ్చే జనవరిలో దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు తప్పనిసరిగా హాజరవుతానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

రెండేళ్లు లక్ష్యంగా పెట్టుకొని నిర్మాణాలు చేపట్టండి: చంద్రబాబుతో పీయూష్‌ గోయల్‌

అమరావతిలో ముఖ్యమైన నిర్మాణాల పూర్తికి ఐదేళ్ల వరకు ఆగకుండా రెండేళ్లనే లక్ష్యంగా పెట్టుకొని పూర్తిచేస్తే బాగుంటుందని కేంద్ర వాణిజ్యశాఖ  మంత్రి పీయూష్‌ గోయల్‌ చంద్రబాబుతో అన్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన వాణిజ్య మంత్రిత్వశాఖ భవనంలో చంద్రబాబు గురువారం  కలిసినప్పుడు పీయూష్‌ గోయల్‌ ఆయన్ను చివరి అంతస్తుకు తీసుకెళ్లి అక్కడి నుంచి సెంట్రల్‌ విస్టాను చూపినట్లు సమాచారం. అదే తరహాలో అమరావతిలో దిగ్గజ భవన నిర్మాణాలను రెండేళ్లలోపు పూర్తిచేసి మూడో ఏడాదికి ప్రజలు వచ్చి వాటిని చూసేందుకు వీలు కల్పించాలని, దానివల్ల సాధారణ ప్రజలకు రాజధానితో అనుబంధం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని