Chandrababu: అధికారం వచ్చిందని.. కక్ష సాధింపులొద్దు

‘అధికారం వచ్చిందని కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దు.. విర్రవీగడం లాంటి చర్యలొద్దు.. ప్రజలు తప్పు పట్టేలా ఎలాంటి పనులూ చేయొద్దు’ అని తెదేపా నేతలు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

Updated : 16 Jun 2024 06:48 IST

ప్రజలు తప్పు పట్టే ఎలాంటి పనులూ చేయొద్దు
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన అందిద్దాం
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెదేపా నాయకులతో టెలికాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ‘అధికారం వచ్చిందని కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దు.. విర్రవీగడం లాంటి చర్యలొద్దు.. ప్రజలు తప్పు పట్టేలా ఎలాంటి పనులూ చేయొద్దు’ అని తెదేపా నేతలు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కార్యకర్తల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించొద్దని ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. శనివారం ఆయన ఉండవల్లిలోని నివాసం నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బూత్‌ స్థాయి కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘ఎన్నికల్లో ప్రజలిచ్చిన మెజారిటీని కాపాడుకోవాలి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇంత పొలిటికల్‌ వేవ్‌ లేదు. తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు అద్భుతమైన సమన్వయంతో పనిచేశారు. ఇంతటి ఘన విజయానికి సహకరించిన ప్రజలను మనం ఆదుకోవాలి’ అని నిర్దేశించారు. ‘అహంకారానికి దూరంగా.. బాధ్యతగా, చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రజలు ఆదరిస్తారు. ప్రభుత్వం చేసే పని, అందించే ఫలాలపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాలి. పార్టీలోని ప్రతి కమిటీ ఉత్సాహంగా పనిచేయాలి. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్తాం. నాయకుడు ఎలా ఉండకూడదో, రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తి ఉండకూడదో జగన్‌ ఒక కేస్‌ స్టడీ. పాలన ఎలా ఉండాలనే విషయంలో ఆదర్శంగా నిలుద్దాం. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే కృషి చేయాలి. 2029లోనూ ఇవే ఫలితాలొస్తాయి’ అని చెప్పారు.

ఈ విజయం కార్యకర్తలకే అంకితం

‘కూటమి విజయం సాధారణమైంది కాదు. గాలివాటంగా వచ్చిన గెలుపు అంతకంటే కాదు. ప్రజలు నమ్మకంతో చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. 8 జిల్లాల్లో క్వీన్‌స్వీప్‌ చేశాం. 20 ఏళ్లలో ఎన్నడూ గెలవని సీట్లు కూడా ఈసారి గెలిచాం. ఈ విజయం వెనక నాయకులు, కార్యకర్తల కష్టం, కృషి ఎంతో ఉంది. ఐదేళ్లపాటు పార్టీ కోసం నిలబడిన కార్యకర్తలకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నా. వారి రుణం తీర్చుకుంటా’ అని చంద్రబాబు ప్రకటించారు. ‘పసుపు జెండా పట్టుకుంటే చెయ్యి విరగ్గొట్టారు. జై తెలుగుదేశం అంటే గొంతు కోశారు.. అయినా కార్యకర్తలు ప్రాణాలు త్యాగం చేసి.. పార్టీ కోసం పనిచేశారు. కొందరు ప్రాణాలను, మరికొందరు ఆస్తుల్ని కోల్పోయారు. ఇంకొందరు జైళ్ల పాలయ్యారు. కార్యకర్తల కష్టాలు, వారిపై వేధింపులు, అక్రమ కేసులు, హత్యలు, అరెస్టులు చూసి నిద్రలేని రాత్రులు గడిపాను. మీ త్యాగం నా జీవితంలో మర్చిపోలేను’ అని పేర్కొన్నారు.

త్వరలో నామినేటెడ్‌ పదవులు

‘గత ఐదేళ్లుగానే ఈ ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు పడిన కష్టాలను మర్చిపోలేం. కింది స్థాయిలో ఎవరు.. ఎక్కడ ఎలా పనిచేశారో అధ్యయనం చేస్తున్నాం. నాయకులు, కార్యకర్తలకు ఎలా, ఏం చేయాలనే విషయమై ఆలోచిస్తున్నాం. కష్టపడి పనిచేసిన వారికి త్వరలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ద్వారా అవకాశాలిస్తాం. ప్రభుత్వాన్ని సమర్థంగా నడపడంతోపాటు పార్టీని బలోపేతం చేస్తా’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం, గౌరవం ఇచ్చేలా నేతలు నడుచుకోవాలని ఆదేశించార. ‘నేను తరచూ పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తా. జిల్లాలకు వెళ్లినప్పుడూ అక్కడి పార్టీ కార్యాలయాలకు వెళ్తాను. నేతలు కూడా జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు వెళ్లి.. కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. వారి ఇబ్బందులను గుర్తించి పరిష్కరిస్తేనే మనోబలం పెరుగుతుంది. గతంలోనే కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి సాయం అందించాం. ఇక ముందు కూడా ఆదుకుంటాం’ అని చెప్పారు.

100 రోజుల్లోనే అన్న క్యాంటీన్లు

నైపుణ్య గణనతో యువత జీవన ప్రమాణాలు మార్చడానికి ఎంతో అవకాశం ఉంటుందని చంద్రబాబు చెప్పారు. వారిలో ఏ మేరకు నైపుణ్యం ఉందో గణించి.. ఆ మేరకు అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ‘2014-19 మధ్య కాలంలో ఎక్కడెక్కడ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామో వాటన్నింటిని 100 రోజుల్లోనే ఏర్పాటు చేస్తాం. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌-6, ప్రజాగళం హామీలను అమలు చేస్తాం’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని