Vijayawada: దుర్గమ్మ సేవలో సీఎం చంద్రబాబు దంపతులు

ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు గురువారం దర్శించుకున్నారు. 

Published : 14 Jun 2024 05:22 IST

ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు పట్టువస్త్రాలు, పండ్లు అందజేస్తున్న
ఎంపీ కేశినేని శివనాథ్‌ దంపతులు,  పక్కన మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్సీ వెంకన్న

విజయవాడ (ఇంద్రకీలాద్రి), న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు గురువారం దర్శించుకున్నారు.  గన్నవరం విమానాశ్రయం చేరుకొని నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న వారిని మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు, మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సాదరంగా ఆహ్వానించారు. వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన తర్వాత వేదపండితులు ఆశీర్వచనం చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ, ఈఓ రామారావు వారికి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. ఎంపీ కేశినేని శివనాథ్‌ దంపతులు ముఖ్యమంత్రి దంపతులకు పండ్లు, పట్టువస్త్రాలు అందజేశారు. తెదేపా నాయకులు పంచుమర్తి అనురాధ, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, నాగుల్‌మీరా, బడేటి ధర్మారావు, పద్మశేఖర్‌ పాల్గొన్నారు. 

గత ప్రభుత్వ హయాంలో వేధింపులపై ఫిర్యాదు

గత ప్రభుత్వ హయాంలో దుర్గగుడిలో కీలక అధికారి తమను వేధించిన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చేందుకు ఓ మహిళా అధికారి ప్రయత్నించారు. తనను ఉద్దేశపూర్వకంగా కాణిపాకం బదిలీ చేయించారని ఆమె వాపోయారు. జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజలు చేయించారని చెబుతుండగా ఈఓ రామారావు వారించారు. సీఎం చంద్రబాబు ఈ విషయాల గురించి చూద్దాం అంటూ పయనమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని