Chandrababu: దేశంలో పెట్టుబడుల పరిణామాలు తెలియజేయండి: అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

దేశంలో పెట్టుబడులకు సంబంధించిన పరిణామాలు, వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ కలిగిన కంపెనీల విస్తరణ సమాచారమంతా ఎప్పటికప్పుడు తనకు చేరేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.

Updated : 17 Jun 2024 08:50 IST

ఈనాడు, అమరావతి: దేశంలో పెట్టుబడులకు సంబంధించిన పరిణామాలు, వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ కలిగిన కంపెనీల విస్తరణ సమాచారమంతా ఎప్పటికప్పుడు తనకు చేరేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్న విదేశీ విద్యాసంస్థలు, కార్పొరేట్, బిజినెస్‌ రంగాల్లో పరిణామాలన్నింటినీ తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ముంబై, దిల్లీ కేంద్రంగా వెలువడే ఆర్థిక, వ్యాపార, పెట్టుబడుల వ్యవహారాల వార్తలను రిపోర్ట్‌ చేసే జాతీయస్థాయి వార్తాపత్రికలను రోజూ ఉదయం తన డ్యాష్‌బోర్డులో పెట్టాలని నిర్దేశించారు. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోని పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా... పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్రానికి ఉన్న అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. ఏవైనా పెద్ద సంస్థలు వాటి విస్తరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే.. ఆ సమాచారం ముందుగానే తెలుసుకుని వారితో సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనేది ముఖ్యమంత్రి వ్యూహం. అందులో భాగంగా అధికారులకు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ అనువైన కేంద్రమనే ముద్రను కార్పొరేట్‌ రంగంలో వేసి, తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించొచ్చని సీఎం భావిస్తున్నారు. విధ్వంసమైన ప్రభుత్వ వ్యవస్థలను గాడిన పెట్టడం, అధికార యంత్రాంగం ప్రక్షాళన, పార్టీ కార్యకర్తలకు, నేతలకు సమయమివ్వడం వంటి కార్యకలాపాల్లో బిజీగా ఉంటూనే... రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను చంద్రబాబు సిద్ధం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని