Chandrababu: అమరావతిని బంగారం చేస్తాం

అమరావతిపై కక్షతో విధ్వంసానికి పాల్పడిన జగన్‌ ప్రభుత్వం.. రాజధాని బ్రాండ్‌ ఇమేజ్‌ను సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. విభజన జరిగి పదేళ్లయినా రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 04 Jul 2024 06:37 IST

జగన్‌ కక్షగట్టి దాన్ని బూడిద చేశారు 
అక్కడి నుంచే పునరుద్ధరిస్తాం 
ప్రజలు, పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని తిరిగితెస్తాం 
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి 
మతిలేనివాళ్లే రాజధానిని మారుస్తామంటారని ధ్వజం  
అమరావతిపై శ్వేతపత్రం విడుదల 
పునర్నిర్మాణానికి కంకణం 
ఈనాడు - అమరావతి 

రాజధాని అమరావతిపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

మరావతిపై కక్షతో విధ్వంసానికి పాల్పడిన జగన్‌ ప్రభుత్వం.. రాజధాని బ్రాండ్‌ ఇమేజ్‌ను సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. విభజన జరిగి పదేళ్లయినా రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ లాంటి మతిలేనివారు తప్ప రాజధానిని మారుస్తానని ఎవరూ అనరని ధ్వజమెత్తారు. జగన్‌ ప్రభుత్వం బూడిదగా మార్చిన ప్రాంతం నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతామని, అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ప్రజలు, పెట్టుబడిదారుల్లో అమరావతిపై మళ్లీ నమ్మకం కలిగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం రాజధానిలో చేసిన విధ్వంసం, భవిష్యత్‌ కార్యాచరణపై ఆయన బుధవారం సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేసి, పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. 

పెట్టుబడిదారుల్లో నమ్మకం పోయింది 

‘గత ఐదేళ్లలో అమరావతి ప్రతిష్ఠ మసకబారింది. 2019కి ముందు అమరావతికి నిధుల సమీకరణకు బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో బాండ్లు విడుదల చేస్తే.. గంటల వ్యవధిలో రూ.2 వేల కోట్లు వచ్చాయి. అప్పట్లో రేటింగ్‌ ఏజెన్సీలు అమరావతి బాండ్లకు ఏ+, ‘ఏఏ’ రేటింగ్‌లు ఇచ్చాయి. ఇప్పుడు ఆ రేటింగ్‌ సీ, బీబీ+కి పడిపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కల్పించే రాజధాని నగరం లేకపోవడం వల్ల యువత వలస పోతున్నారన్నారని, భావితరాల భవిష్యత్‌ సర్వనాశనమైందని విచారం వ్యక్తం చేశారు. ‘జగన్‌ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతిని దెబ్బతీసే కుట్రను అమల్లోకి తెచ్చింది. ఎక్కడి పనులు అక్కడ నిలిపేసింది. రూ.వేల కోట్ల వ్యయంతో చేసిన నిర్మాణాల్ని గాలికొదిలేసింది. రాజధాని రైతులు, ప్రజలు 1631 రోజులు ఉద్యమం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకొచ్చి భూములిచ్చిన రైతులపై జగన్‌ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. తీవ్ర వేధింపులకు, అణచివేత చర్యలకు పాల్పడింది. రాజధానిలో 1,197 ఎకరాల భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్‌ ఉపసంహరించింది. 2,903 మంది రైతులకు కౌలు, 4,422 మందికి కౌలు రద్దు చేసింది. మౌలిక వసతుల నిర్మాణ పనుల అంచనా వ్యయాన్ని రూ.3 వేల కోట్లకు కుదించింది. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి కోసం ఒప్పందం చేసుకున్న సింగపూర్‌ కన్సార్షియంపై అసంబద్ధ ఆరోపణలు మోపి, తరిమికొట్టింది. కేంద్ర ప్రభుత్వానికి లేనిపోని ఫిర్యాదులు చేసి కేంద్ర సాయం రాకుండా చేసింది. సీఆర్‌డీఏ హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టులోని ఫ్లాట్లన్నీ అప్పట్లో క్షణాల్లో బుక్‌ అయిపోయాయి. ఆ ప్రాజెక్టు పూర్తయితే సీఆర్‌డీఏకి రూ.57.37 కోట్లు లాభం వచ్చేది. కానీ జగన్‌ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఇప్పుడు ఆ ప్రాజెక్టులో రూ.164.5 కోట్ల నష్టం వస్తుంది’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. 

రూ.20, 30 వేల కోట్ల ఆదాయం వచ్చేది

రాజధానిలో మౌలిక వసతులు, నిర్మాణాలపై ప్రభుత్వమే రూ.50 వేల కోట్లు ఖర్చు పెట్టేలా అప్పట్లో ప్రణాళికలు రూపొందించామని, అది ఆచరణలోకి వస్తే ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.20-30 వేల కోట్ల ఆదాయం వచ్చేదని తెలిపారు. ‘రాజధానిలోని ఎస్‌ఆర్‌ఎం, విట్‌ వంటి యూనివర్సిటీల్లో చదువుకున్న పేద పిల్లలకు ఏడాదికి రూ.కోటి ప్యాకేజీతో ఉద్యోగాలు వస్తున్నాయి. రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే.. అలాంటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు అనేకం వచ్చేవి. రాజధానిలో అన్ని అవసరాలకూ పోగా ప్రభుత్వం వద్ద 8 వేల ఎకరాలు మిగులుతుంది. ఆ భూమి విలువ 2019లోనే ఎకరం రూ.10 కోట్లు. రాజధాని నిర్మాణం కొనసాగించి ఉంటే ఎకరం విలువ ఈపాటికే రూ.20 కోట్లకు చేరేది. అలా ప్రభుత్వం వద్ద రూ.1,60,000 కోట్ల విలువైన సంపద ఉండేది. రాజధాని నిర్మాణానికి నిధుల కోసం వెతకాల్సిన పరిస్థితి వచ్చేది కాదు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలిచ్చారు.

రాజధాని అమరావతిపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

రాజధానిని మార్చకుండా చట్టపరంగా చర్యలేమైనా చేపడతారా?

అది కచ్చితంగా ఆలోచించాల్సిన అంశమే.

అమరావతి నిర్మాణం పూర్తికి లక్ష్యాలేమైనా నిర్దేశించుకున్నారా?

లక్ష్యాలు నిర్దేశించుకుని కట్టడానికి అది ఒక భవనం కాదు. ఒక వ్యక్తో, కంపెనీనో చేసేది కాదు. నగర నిర్మాణమనేది అనేక మంది భాగస్వామ్యంతో దశలవారీగా జరిగే నిరంతర ప్రక్రియ. 

రాజధానిలో స్థలాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థల మాటేంటి?

132 సంస్థలకు స్థలాలిస్తే ఐదారు తప్ప మిగతావి రాలేదు. వాటితో మాట్లాడి, ఒప్పించే ప్రయత్నాలు ప్రారంభించాం. ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌ సంస్థకు అప్పట్లో మా ప్రభుత్వం మంగళగిరి వద్ద స్థలం కేటాయించింది. జగన్‌ ప్రభుత్వం నీళ్లు కూడా ఇవ్వకపోవడంతో.. 950 పడకలతో నడవాల్సిన ఎయిమ్స్‌లో ఇప్పుడు 300 పడకలు మాత్రమే ఉన్నాయి.  

స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి మళ్లీ సింగపూర్‌ కన్సార్షియమ్‌ను ఆహ్వానిస్తారా?

అమరావతి అభివృద్ధికి మేం ప్రపంచంలోని ఉత్తమ సంస్థల్ని తీసుకొస్తే జగన్‌ ప్రభుత్వం అందర్నీ తరిమేసింది. ఆ కంపెనీలు మళ్లీ వస్తాయా, లేదా అన్నది చూడాలి. మా ప్రయత్నం మేం చేస్తాం. 

రాజధాని రైతులకు కౌలు చెల్లింపు గడువు  పొడిగిస్తారా?

దీనిపై ఆలోచించి, వారికి న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటాం. రైతులపై జగన్‌ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని తొలగించేందుకు చర్యలు చేపడతాం. అమరావతి పరిరక్షణకు వారంతా ఐదేళ్లు పోరాడారు. విరాళాలు సేకరించి, ఆస్తులు అమ్ముకుని న్యాయపోరాటం చేశారు. వారికి కచ్చితంగా న్యాయం చేస్తాం.  

ఆర్‌-5 జోన్‌పై ప్రభుత్వం ఆలోచనేంటి?

ఏ ఊరివాళ్లకు అక్కడ ఇంటి స్థలం ఇస్తే ఉపయోగం ఉంటుంది. ఆర్‌-5 జోన్‌లో గత ప్రభుత్వం స్థలాలు ఇచ్చినవారిలో అర్హులకు వారి ప్రాంతాల్లో స్థలాలిచ్చి, ఇళ్లు కట్టిస్తాం.


యంత్రాంగం డల్‌ అయిపోయింది

గన్‌ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘నేను నాలుగోసారి ముఖ్యమంత్రినయ్యాను. కానీ ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదు. నేను మొదటిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు అధికారులంతా చాలా ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంతో ఉండేవారు. వరుసగా రెండోసారి నేనే సీఎంనయ్యాను కాబట్టి తేడా ఏమీ రాలేదు. మూడోసారి రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రినయ్యాను. సవాలక్ష సవాళ్లున్నా పరిగెత్తే యంత్రాంగం ఉండేది. ఇప్పుడు యంత్రాంగం డల్‌ అయిపోయింది. అలవాట్లు మారిపోయాయి. వ్యవస్థ మొత్తం విధ్వంసమైంది’ అని ఆయన పేర్కొన్నారు.


రాజధాని బ్రాండ్‌ ఇమేజ్‌ని పునరుద్ధరిస్తాం

రాజధాని విధ్వంసాన్ని చూసి నాకంటే బాధపడేవారు ఇంకెవరూ ఉండరు. శంకుస్థాపన సమయంలో హెలికాప్టర్‌లో రెండు రోజులు తిరిగి అమరావతిలోని ప్రతి అంగుళంలోనూ పవిత్రమైన జలాల్ని, మట్టిని చల్లాను. రాజధాని నిర్మాణానికి ఎలాంటి దుష్టశక్తులు అడ్డుపడకూడదని అనుకున్నాను. ఎన్ని చేసినా దుష్టశక్తుల నుంచి అమరావతిని కాపాడుకోలేకపోయాం. నాశనమైన అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ను పునరుద్ధరిస్తా. దిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వంతో అమరావతి సహా రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలపై మాట్లాడతాం. మేం ఎన్డీయేలో భాగస్వాములం. కేంద్ర సహకారంతో రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభిస్తాం. 

పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌లో చంద్రబాబు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు