Chandrababu: ఐఏఎస్‌లూ.. పొలాలకు వెళ్లండి

ఐఏఎస్‌ అధికారులు కూడా సచివాలయం నుంచి పొలాలకు కదలాలని.. రైతులతో మాట్లాడాలని, సాగు ఖర్చులు తగ్గించుకునేందుకు సలహాలు, సూచనలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

Published : 04 Jul 2024 05:26 IST

అన్నదాతలతో మాట్లాడండి
వైకాపా పాలనలో సాగు భారమై రైతులకు అప్పులు పెరిగాయి
రైతు భాగస్వామ్యంతోనే పంటల బీమా
ఖరీఫ్‌ సాగుపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
 

వ్యవసాయ, జలవనరుల శాఖల అధికారులతో సచివాలయంలో సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు.. పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు, సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, ఉన్నతాధికారులు

ఈనాడు, అమరావతి: ఐఏఎస్‌ అధికారులు కూడా సచివాలయం నుంచి పొలాలకు కదలాలని.. రైతులతో మాట్లాడాలని, సాగు ఖర్చులు తగ్గించుకునేందుకు సలహాలు, సూచనలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఖరీఫ్‌ సాగుపై బుధవారం ఆయన వెలగపూడి సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖలు, జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు. రైతులకు ఉచిత సూక్ష్మపోషకాలతోపాటు భూసార పరీక్షలు, సూక్ష్మసేద్యం పథకాలను వైకాపా ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేసి గేట్లకు కనీసం గ్రీజు కూడా పెట్టలేదని దుయ్యబట్టారు. ఆక్వా, ఉద్యాన రంగాల్లో వృద్ధి పడిపోయిందని విమర్శించారు. 

అధికారులకు చంద్రబాబు ఆదేశాలు

  • పాత (2019కి ముందున్న) విధానంలోనే రైతు భాగస్వామ్యంతో పంటల బీమా అమలు చేయాలి.
  • పంట కాలువల్లో పూడికలు తీయాలి. గుర్రపుడెక్క తొలగించాలి.
  • సాగునీటి కొరత లేకుండా చూడాలి.
  • రాయలసీమకు ఎక్కువగా కృష్ణా జలాలు వినియోగించాలి
  • వృథాగా పోయే గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు అందించాలి.
  • సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో ఉత్తమ విధానాలు అనుసరించాలి.
  • డ్రోన్ల ద్వారా పురుగుమందుల పిచికారీపై రైతుల్లో అవగాహన కల్పించాలి.
  • ప్రకృతి వ్యవసాయం దిశగా రైతుల్ని నడిపించాలి.
  • ఆక్వా, ఉద్యాన రంగాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. 

3.04 లక్షల ఎకరాల్లో పంటలు

గోదావరి డెల్టాకు జూన్‌ 1 నీరు విడుదల చేశామని అధికారులు సీఎంకు చెప్పారు. పట్టిసీమ, పుష్కర, తాడిపూడి, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల నుంచి నీటి విడుదల ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు సాధారణం కంటే 50% అధికంగా వర్షపాతం నమోదైందని తెలిపారు. 3.04 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారని వివరించారు.


ఉచిత పంటల బీమాపై దృష్టి పెట్టాలని కోరుతున్న రైతులు 

ఈనాడు-అమరావతి: ఉచిత పంటల బీమా పేరుతో ఐదేళ్లపాటు రైతుల్ని నిలువునా ముంచిన వైకాపా ప్రభుత్వం.. రెండేళ్లుగా కంపెనీలకు ప్రీమియం కూడా చెల్లించలేదు. రూ. 1,252 కోట్ల బకాయిలు పెట్టింది. దీంతో రైతులకు పంటనష్ట పరిహారం కూడా ప్రశ్నార్థకంగా మారింది. సాగు చేసిన ప్రతి ఎకరాకు ఉచిత బీమా అంటూనే.. నిబంధనల పేరుతో సాగు విస్తీర్ణంలో సగాన్ని తగ్గించింది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు రైతులకు న్యాయం చేసేలా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తుందనే ఆశలో రైతులు ఉన్నారు. అయితే 2019 ముందు నాటి పాత విధానంలోనే పథకం కొనసాగిస్తామని, రైతుల భాగస్వామ్యంతో అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనిపై రైతుల్లో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఖరీఫ్‌ మొదలైన నేపథ్యంలో..బ్యాంకులు, మీసేవా కేంద్రాల్లో ప్రీమియం చెల్లించే అవకాశం లేదు. వారికి లాగిన్‌ కూడా ఇవ్వలేదు. కొత్తగా టెండర్లు పిలిచి ప్రీమియం వసూలు చేసే సరికి ఖరీఫ్‌ ముగుస్తుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని.. రైతుల నుంచి నామమాత్రపు ప్రీమియం వసూలు చేసి 100% పంటల బీమా కల్పించేలా చూడాలని చంద్రబాబును రైతులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని