Andhra News: అక్రమాలు నిజం.. తప్పు మాత్రం మాది కాదు

రాష్ట్రంలో ఐదేళ్ల వైకాపా పాలనలో ఆ పార్టీ నాయకుల భూ కబ్జాలు, విశాఖలో దసపల్లా వంటి విలువైన స్థలాల అన్యాక్రాంతం, ఎసైన్డ్‌ భూములపై శాశ్వత హక్కుల పేరుతో అక్రమాలు, సహజ వనరుల దోపిడీ వంటి అంశాలపై ప్రభుత్వం త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనుంది.

Updated : 09 Jul 2024 07:07 IST

వైకాపా పాలనలో భూముల స్వాహాపై రెవెన్యూ అధికారుల నివేదిక
అసమగ్రంగా ఉందంటూ చంద్రబాబు అసంతృప్తి
అప్పటి భూకబ్జాలపై త్వరలో శ్వేతపత్రం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఐదేళ్ల వైకాపా పాలనలో ఆ పార్టీ నాయకుల భూ కబ్జాలు, విశాఖలో దసపల్లా వంటి విలువైన స్థలాల అన్యాక్రాంతం, ఎసైన్డ్‌ భూములపై శాశ్వత హక్కుల పేరుతో అక్రమాలు, సహజ వనరుల దోపిడీ వంటి అంశాలపై ప్రభుత్వం త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనుంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సచివాలయంలో మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్‌తో కలిసి ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఏపీ భూ హక్కు చట్టం, రీసర్వే, విద్యుత్‌ సంస్థలు, వైకాపా కార్యాలయాలకు భూముల కేటాయింపు, పేదలకు సెంటు స్థలాలు, రెవెన్యూ వ్యవహారాల్లో వైకాపా నాయకుల జోక్యం తదితరాలపై అధికారులు రూపొందించిన నివేదికను ఆయన పరిశీలించారు. అప్పట్లో జరిగిన తప్పులన్నీ ముఖ్యమంత్రి, మంత్రులు, వైకాపా నాయకులే చేసినట్టు, వాటిలో ఎక్కడా తమ ప్రమేయమే లేనట్టు అధికారులు పేర్కొనడం గమనార్హం. నివేదిక సమగ్రంగా లేదంటూ చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేశారు. పూర్తి వివరాలతో మరింత లోతుగా తయారు చేయాలని ఆదేశించారు. నివేదికలో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలివీ..

విశాఖలో భూముల స్వాహా!

  • విశాఖలో రామానాయుడు స్డూడియో భూములను నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్‌ కేటగిరీలోకి మార్చారు. వివాదాస్పద సీబీసీఎన్‌సీ భూముల్లో వైకాపా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భవన నిర్మాణ ప్రాజెక్టుకు అనుమతులిచ్చారు. రూ.65 కోట్ల విలువైన టీడీఆర్‌ బాండ్‌లు జారీ చేశారు. ఎన్‌సీసీ, దసపల్లా, హయగ్రీవ భూములు స్వాహా చేశారు. శారదా పీఠానికి కొత్తవలసలో అత్యంత విలువైన 15 ఎకరాల భూమిని ఎకరం రూ.1 చొప్పున కేటాయించారు.  
  • కేటాయింపు జరిగి 20 ఏళ్లు దాటిన ఎసైన్డ్‌ భూములపై యాజమాన్యహక్కులు కల్పించేలా వైకాపా ప్రభుత్వం చేసిన చట్టం మేరకు 9,93,284 ఎకరాలను 22(ఎ) జాబితా నుంచి తప్పించారు. ఆ భూములను పేదల నుంచి వైకాపా నాయకులు తక్కువ ధరకు కొట్టేశారు.
  • నీతి ఆయోగ్‌ ప్రతిపాదించిన నమూనా టైట్లింగ్‌ యాక్ట్‌ స్ఫూర్తికి భిన్నంగా వైకాపా ప్రభుత్వం ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని రూపొందించింది. ఆ చట్ట నిబంధనలతో ప్రజల భూములకు రక్షణ ప్రశ్నార్థకం కానుంది. ప్రమాదకరమైన ఈ చట్టాన్ని మరే రాష్ట్ర ప్రభుత్వమూ తీసుకురాలేదు.
  • భూముల రీసర్వే నిర్వహణకు సమయం ఇవ్వనందున తుది రికార్డుల్లో అనేక తప్పులు దొర్లాయి. (పట్టాదారు పాస్‌ పుస్తకాలపై జగన్‌ ఫొటోలు వేయడాన్ని నివేదికలో ప్రస్తావించారు.)
  • ప్రకాశం జిల్లా ఒంగోలు, చుట్టుపక్కల భారీగా భూకుంభకోణాలు జరిగాయి. జనన, మరణ ధ్రువపత్రాల జారీలోనూ అక్రమాలకు పాల్పడ్డారు. సర్వే రిపోర్టు, భూ మార్పిడి, పాత స్టాంపు పేపర్లపై పాత తేదీలు నమోదు చేసి, నకిలీ వ్యక్తులతో జీపీఏలను సృష్టించారు. కుటుంబ వివాదాల్లో ఉన్న, అన్‌క్లెయిమ్డ్‌ ప్రైవేట్‌ భూములను కొందరు స్వాహా చేశారు. 

రెవెన్యూ వ్యవహారాలన్నింటా జోక్యం

  • ఇళ్ల పట్టాలు, వ్యవసాయ భూముల పంపిణీకి లబ్ధిదారుల ఎంపికలో వైకాపా నాయకులు జోక్యం చేసుకునేవారు. లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసేవారు.
  • ఓటర్ల నమోదులో కల్పించుకొని, వారికి అనుకూలంగా పని చేయాల్సిందిగా అధికారులపై ఒత్తిడి తెచ్చేవారు.
  • తీవ్ర అవకతవకలకు పాల్పడిన నలుగురు తహసీల్దార్ల డిస్మిస్, నిర్బంధ పదవీ విరమణ, 10 మంది హోదా తగ్గింపునకు సీసీఎల్‌ఏ ఆదేశాలిస్తే, వైకాపా నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వారి శిక్షను తగ్గించారు.
  • సాగు భూముల్లో అక్రమ లేఅవుట్‌లు వేసి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయేతర భూములుగా మార్చేసుకున్నారు.
  • నాన్‌ ఆక్వా జోన్‌ పరిధిలోకి వచ్చే భూములను చేపల చెరువులుగా మార్చేశారు. 
  • ప్రైవేటు వారి భూములను 22(ఎ) జాబితాలో పెట్టించి, వారిపై ఒత్తిడి తెచ్చి కారుచౌకగా కొట్టేశారు.

ఇళ్ల స్థలాల్లో భారీ దోపిడీ

  • పేదలకు ఇళ్ల స్థలాల కింద ఇవ్వాలనుకున్న భూములను వైకాపా నేతలు బినామీల పేర్లతో తక్కువ ధరకు కొని, వాటిని అధిక ధరలకు తీసుకునేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఇళ్ల పట్టాల కోసం 28,554.64 ఎకరాల ప్రభుత్వ భూమిని వినియోగించారు. అధిక శాతం ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన ఎసైన్డ్‌ భూములను సేకరించారు. నివాసయోగ్యం కాని, నీరు నిలిచే, పర్యావరణ ప్రభావం చూపే భూములను సేకరించారు. చాలాచోట్ల గ్రామాలకు దూరంగా ఉండటంతో లబ్ధిదారులు వాటిని తీసుకోలేదు. ఎన్జీటీ ఆదేశాలతో 54 ఎకరాల భూములను మళ్లీ అటవీ భూములుగా పునరుద్ధరించాల్సి వచ్చింది. ఫలితంగా ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లింది.
  • లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత లేదు. పెద్దసంఖ్యలో అనర్హుల పేర్లను జాబితాల్లో చేర్చారు. ఇళ్ల పట్టాలు పొందిన వారిలో 20% మంది ఇప్పటికే అమ్ముకున్నారు.
  • తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలకు నీటమునిగే ఆవ భూములను సేకరించారు. ఇళ్ల పట్టాలకు అనుకూలం కాని వీటికి అధిక మొత్తంలో పరిహారం చెల్లించారు. ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో పశువుల మేత బీడు భూములను సేకరించారు. 2013 భూసేకరణ చట్టంలో నిర్ణయించిన దానికంటే 2-3 రెట్లు ఎక్కువ పరిహారం చెల్లించేలా ఒత్తిడి తెచ్చారు. ఈ మొత్తాన్ని రైతులకు చెల్లించకుండా మధ్యవర్తులు వాటాలు తీసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో ఎకరా రూ.30 లక్షలు ఉంటే, నష్టపరిహారం రూ.55 లక్షల చొప్పున ఇప్పించారు.
  • పల్లపు ప్రాంతాలను సేకరించి, వాటిని చదును చేసే కాంట్రాక్టులను కూడా వైకాపా నేతలే దక్కించుకున్నారు. ఉపాధి హామీ పథకం కింద చెరువుల్లో పూడిక తీసిన మట్టిని అక్కడకు తరలించి నిధులు కాజేశారు. నెల్లూరు జిల్లాలో భూమి చదును కోసం రూ.34.73 కోట్లు వినియోగించారు. ఊరికి దూరంగా, శ్మశానాలకు, అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నచోట లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాలేదు.
  • ప్రభుత్వం తక్కువ ధరకు భూములు సేకరిస్తోందంటూ విశాఖపట్నం జిల్లా భీమిలి, ఆనందపురం, పద్మనాభం, అనకాపల్లి జిల్లాలోని సబ్బవరం, పరవాడల్లో వైకాపా నేతలు అక్కడి రైతులను తప్పుదోవ పట్టించడంతోపాటు భయపెట్టారు. వారి భూములను ఒప్పంద పత్రాలపై కొనుగోలు చేశారు.
  • ఇండోసోల్‌ సోలార్‌ సంస్థకు 10,226 ఎకరాలు, గ్రీన్‌కో కంపెనీకి 14,828 ఎకరాలు కేటాయించారు. 
  • వివిధ జిల్లా కేంద్రాల్లో అత్యంత విలువైన భూములను వైకాపా కార్యాలయాలకు కేటాయించారు. ఎకరాకు ఏడాదికి రూ.1,000 చొప్పున 40.78 ఎకరాలు కట్టబెట్టారు. వాటి విలువ రూ.కోట్లలో ఉంటుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని