Chandrababu: ఆరోగ్య బీమా ప్రతిపాదనలు రూపొందించండి

ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా కాకుండా బీమా విధానంలో రోగులకు వైద్య సేవలందించేలా ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

Published : 10 Jul 2024 04:34 IST

అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
నిధులు లేకుండా కొత్త వైద్య కళాశాలలా?
వైకాపా ప్రభుత్వ తీరుపై మండిపాటు

ఈనాడు, అమరావతి: ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా కాకుండా బీమా విధానంలో రోగులకు వైద్య సేవలందించేలా ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి మంగళవారం సమీక్షించారు. అధికారులు మాట్లాడుతూ ‘కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ.5 లక్షల వార్షిక పరిమితితో ట్రస్టు విధానంలో సేవలందిస్తోంది. త్వరలో దీన్ని రూ.10 లక్షలకు పెంచబోతోంది. ఈ పరిమితి రాష్ట్రంలో రూ.25 లక్షల వరకు ఉంది. కేంద్రం కూడా బీమా విధానంపై సమాలోచనలు చేస్తోంద’ని సీఎంకు వివరించారు. చంద్రబాబు స్పందిస్తూ ‘రాష్ట్రంలోనూ బీమా విధానాన్ని అమలు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టాం. తదనుగుణంగా శాఖాపరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. ఎక్కడ మేలైన విధానాలున్నాయో పరిశీలించండ’ని సూచించారు.

‘లోటు భర్తీ నిధి’ అందుతుందా? 

కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించాలని నిర్ణయించే ముందు నిధుల లభ్యత, సమీకరణ, నిర్వహణ ఖర్చులు, ఇతరత్రా అన్ని రకాలుగా ఆలోచించకుండానే వైకాపా ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఎన్‌ఎంసీ తొలి విడత తనిఖీల ద్వారా అనుమతులు ఇవ్వకపోవడం, నిర్మాణ పనుల్లో ప్రతిష్టంభన, వైద్య బోధకుల కొరత గురించి అధికారులు చెప్పినప్పుడు సీఎం పైవిధంగా స్పందించారు. గత జులై నుంచి గుత్తేదారులకు బిల్లులు చెల్లించలేదని అధికారులు సీఎంకు చెప్పారు. ‘కేంద్రం నుంచి నిధులు ఎంతవరకు వస్తాయి? లోటు భర్తీ నిధి కింద కేంద్రం నుంచి అదనంగా ఏమైనా సాయం అందుతుందా? తదితర అంశాలపై సమగ్ర నివేదిక అందించండ’ని ఆదేశించారు. మరో విడత సమావేశం ద్వారా కొత్త వైద్య కళాశాలల్లో ప్రవేశాల ప్రారంభంపై స్పష్టత వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తైనందున 2014కు ముందు ప్రారంభమైన కళాశాలల్లో స్థానికులకు మాత్రమే ప్రవేశాలు కల్పించేందుకు, రాష్ట్ర ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలకు రాష్ట్ర హోదా తొలగించేందుకు, అధికారులు చేసిన ఇతర ప్రతిపాదనలను సీఎం ఆమోదించారు. సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ లక్ష్మీశ, డీఎంఈ నరసింహం పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని