Chandrababu: 16,347 ఉపాధ్యాయ పోస్టులు

రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో గల ఛాంబర్‌లో గురువారం సాయంత్రం 4.41 గంటలకు ఆయన వేదపండితుల పూజలు, ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు తీసుకున్నారు.

Updated : 14 Jun 2024 06:46 IST

సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం
2వ సంతకం ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు
3వ సంతకం పింఛన్‌ రూ.4,000కు పెంపు
4వ సంతకం నైపుణ్య గణన
5వ సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ
కీలక ఎన్నికల హామీల అమలుకు తొలిరోజే పచ్చజెండా
ఈనాడు - అమరావతి 

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలి దస్త్రంపై సంతకం చేస్తున్న చంద్రబాబు

రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో గల ఛాంబర్‌లో గురువారం సాయంత్రం 4.41 గంటలకు ఆయన వేదపండితుల పూజలు, ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు తీసుకున్నారు. ఆ వెంటనే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు 5 అంశాల అమలు దస్త్రాలపై సంతకాలు చేశారు. లక్షల మంది నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలించేలా.. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ ప్రకటన విడుదల చేసే దస్త్రంపై నిరుద్యోగుల సమక్షంలో మొట్టమొదటి సంతకం చేశారు. ప్రజల ఆస్తులను కొల్లగొట్టేందుకు జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత దుర్మార్గపు, రాకాసి చట్టమైన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు ఫైల్‌పై భూ వివాదాల బాధితులు, రైతుల సమక్షంలో రెండో సంతకం పెట్టారు. లక్షల మంది లబ్ధిదారులకు మేలు కలిగేలా సామాజిక భద్రత పింఛన్లను రూ.4వేలకు పెంచుతూ లబ్ధిదారుల సమక్షంలో మూడో సంతకం చేశారు. యువత, విద్యార్థుల్లో నైపుణ్యాలు గుర్తించి ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు వీలుగా నైపుణ్య గణన (స్కిల్‌ సెన్సస్‌) దస్త్రంపై విద్యార్థులు, యువత సమక్షంలో నాలుగో సంతకం చేశారు. లక్షల మంది పేద ప్రజలు, అభాగ్యుల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ పేద ప్రజల సమక్షంలో ఐదో సంతకం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయా కార్యక్రమాలు, పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. చంద్రబాబు 2019 వరకూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వినియోగించిన ఛాంబర్‌నే ఇప్పుడూ తీసుకున్నారు. నూతన మంత్రులు, కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారు, ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగుల సమక్షంలో అత్యంత వేడుకగా ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన సతీమణి భువనేశ్వరి కూడా పాల్గొన్నారు. 

సామాజిక పింఛన్ల పెంపు దస్త్రంపై సంతకం చేసిన అనంతరం వృద్ధులతో మాట్లాడుతున్న 


మొదటి సంతకం: మెగా డీఎస్సీ 

నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకున్నాం..

‘‘గత ప్రభుత్వ హయాంలో డీఎస్సీ ద్వారా ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ఉద్యోగాలకు సరిగ్గా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. పరిశ్రమలు, పెట్టుబడులు రాకపోవడం వల్ల ఎవరికీ ప్రైవేటు ఉద్యోగాలు కూడా లభించలేదు. దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో 24% నిరుద్యోగిత రేటు ఉంది. నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకున్నాం. నేను, పవన్‌కల్యాణ్, భాజపా కలిసి ఎన్నికల్లో వారికి ఇచ్చిన హామీ మేరకు.. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ప్రకటనపై తొలి సంతకం చేస్తున్నా’’ అని చంద్రబాబు తెలిపారు.


రెండో సంతకం: ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు

ప్రజల భూములు, ఆస్తులకు రక్షణ లేకుండా చేశారు

‘‘గత ప్రభుత్వం ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ తీసుకొచ్చి ప్రజల భూములు, ఆస్తులకు రక్షణ లేకుండా చేసింది. ప్రజలు తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన, వారికి వారసత్వంగా లభించిన భూముల పట్టాదారు పాస్‌ పుస్తకాలపై జగన్‌ బొమ్మ వేసుకున్నారు. ఇదెక్కడి దారుణం? ఆయనేదో తన భూముల్ని ప్రజలకు ఇచ్చినట్లుగా పాస్‌ పుస్తకాలపై ‘జగనన్న భూహక్కు’ అంటూ ముద్రించారు. చట్టం ముసుగులో అన్నిచోట్లా తన మనుషులను పెట్టుకుని భూములు రికార్డులు మార్చేయడానికి ప్రయత్నించారు. తద్వారా దందాలు చేయాలని చూశారు. భూ రికార్డులు మారిపోతే బాధితులు హైకోర్టును ఆశ్రయించడం తప్ప వేరే దిక్కు లేకుండా చేశారు. హైకోర్టుకు వెళ్తే వివాద పరిష్కారానికి 50 ఏళ్ల పైనే పడుతుంది. అందుకే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని రద్దు చేస్తున్నాం. దాన్ని ఉపసంహరించుకునే దస్త్రంపై రెండో సంతకం చేస్తున్నా’’ అని చంద్రబాబు చెప్పారు. 


మూడో సంతకం: పింఛన్లు రూ.4వేలకు పెంపు

బకాయిలతో కలిపి జులైలో రూ.7వేలు ఇస్తాం

‘‘ఎన్టీఆర్‌ హయాంలోనే మొట్టమొదటిసారి సామాజిక భద్రత పింఛన్లు ప్రారంభమయ్యాయి. రూ.35తో ఆయన ఈ పథకాన్ని మొదలుపెట్టారు. దాన్ని నేను రూ.75కు పెంచాను. రాష్ట్రవిభజన తర్వాత రూ.200గా ఉన్న పింఛన్లను తొలుత రూ.1,000కి, తర్వాత రూ.2వేలకు పెంచాను. కానీ గత ప్రభుత్వం ఐదేళ్లలో విడతల వారీగా రూ.వెయ్యి మాత్రమే పెంచింది. అందుకే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు పింఛను రూ.4వేలకు పెంచాం. మొన్న ఏప్రిల్‌ నుంచే ఈ పెంపు వర్తిస్తుంది. ఏప్రిల్, మే, జూన్‌ నెలల బకాయిలు రూ.వెయ్యి చొప్పున మొత్తం రూ.3వేలు, జులై నెల పింఛను రూ.4వేలు కలిపి మొత్తం రూ.7వేలను జులైలో లబ్ధిదారులకు అందిస్తాం. దివ్యాంగుల పింఛను కూడా రూ.6 వేలకు పెంచాం. వారికి బకాయిలతో కలిపి జులైలో రూ.12 వేలిస్తాం. కొన్ని కేటగిరీల దివ్యాంగులకు ఇంకా ఎక్కువ వస్తుంది. మొత్తం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులను దృష్టిలో ఉంచుకుని పింఛను పెంపుపై మూడో సంతకం చేశాను’’ అని చంద్రబాబు అన్నారు. 


నాలుగో సంతకం: నైపుణ్య గణన

మొట్టమొదటిసారిగా నైపుణ్య గణన

‘‘యువతలో నైపుణ్యాన్ని గుర్తించేందుకు, దానికి అనుగుణంగా వారు ఉపాధి అవకాశాలు పొందేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడం కోసం నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్కరికీ కోరికలు ఉంటాయి. వాటిని సాధించుకోవాలంటే విజ్ఞానం, మెళకువలు కావాలి. ఉన్నత చదువులు చదివినా నైపుణ్యాలు లేకపోతే ఉద్యోగాలు లభించవు. నాలెడ్జ్‌ ఎకానమీలో తగిన నైపుణ్యాలుంటే... బాగా రాణించొచ్చు. ప్రపంచంలో ఇప్పటివరకూ చాలాచోట్ల జన గణన, కులగణన చేపట్టారు. కానీ మేం మొట్టమొదటిసారిగా నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టాం. ఎవరిలో ఎలాంటి నైపుణ్యం ఉంది? వారి నైపుణ్యాలకు తగ్గట్టుగా ఏయే ఉద్యోగాలు ఉన్నాయి? దేశంలో, ప్రపంచంలో ఎలాంటి ఉద్యోగావకాశాలు ఉన్నాయి? వాటికి తగిన నైపుణ్యాలు మన యువతలో ఉన్నాయా? లేదా? అనేది పరిశీలిస్తాం. పెట్టుబడులు భారీగా వచ్చినప్పుడు వేరే రాష్ట్రాల నుంచి ఉద్యోగులు రాకుండా మన రాష్ట్రం నుంచే కావాల్సిన మానవ వనరులను అభివృద్ధి చేయాలి. కావాల్సిన నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది నా మనసుకు బాగా దగ్గరగా ఉన్న సబ్జెక్ట్‌’’ అని చంద్రబాబు తెలిపారు.


ఐదో సంతకం: అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ

అన్న క్యాంటీన్లు రద్దు చేసి పైశాచిక ఆనందం పొందారు

‘‘పేదలకు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. చిరుద్యోగులు, కూలి పనులకు వెళ్లేవారికి ఇది ఎంతో ఉపయోగపడేది. కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్లు, తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి. మనం అన్న క్యాంటీన్లు పెడితే గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే... వాటిని మూసేసింది. చాలామంది అన్న క్యాంటీన్లలో భోజనాల ఏర్పాటుకు విరాళాలూ ఇచ్చారు. కానీ జగన్‌ ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని రద్దుచేసి పైశాచిక ఆనందం పొందారు. అందుకే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై అయిదో సంతకం చేస్తున్నాం. ఎన్ని క్యాంటీన్లు పెట్టాలనేది పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం’’ అని చంద్రబాబు చెప్పారు. 


తొలి సంతకంపై హర్షం 

సీఎం చంద్రబాబు. చిత్రంలో కనకమేడల, అయ్యన్నపాత్రుడు, తెనాలి శ్రావణ్‌కుమార్‌ తదితరులు

ముఖ్యమంత్రిగా చంద్రబాబు మెగా డీఎస్సీ దస్త్రంపై తొలి సంతకం చేయడాన్ని హర్షిస్తూ  యువత గురువారం సంబరాలు చేసుకున్నారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బ్రహ్మం చౌదరి ఆధ్వర్యంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద డీఎస్సీ అభ్యర్థులు.. చంద్రబాబు, మంత్రులు లోకేశ్, పవన్‌కల్యాణ్‌ల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంపిణీ చేశారు.  

 న్యూస్‌టుడే, తాడేపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు