Anna Canteens: అన్న క్యాంటీన్‌ భవనాలు ఛిన్నాభిన్నం

పేదల ఆకలి తీర్చేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్‌ భవనాలను జగన్‌ ప్రభుత్వం ఛిన్నాభిన్నం చేసింది.

Updated : 14 Jun 2024 04:05 IST

శిథిలావస్థలో 63 భవనాలు
పునరుద్ధరణ నేపథ్యంలో ప్రభుత్వానికి నివేదిక

ఈనాడు, అమరావతి: పేదల ఆకలి తీర్చేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్‌ భవనాలను జగన్‌ ప్రభుత్వం ఛిన్నాభిన్నం చేసింది. వీటిని కొనసాగిస్తే చంద్రబాబు ప్రభుత్వానికి ఎక్కడ పేరొస్తుందో అన్న అక్కసుతో కార్యక్రమాన్ని నిలిపివేయడంతోపాటు రూ.కోట్ల వ్యయంతో నిర్మించినవాటిలో దాదాపు 119 భవనాలను ప్రభుత్వశాఖల అవసరాలకోసమని జగన్‌ ప్రభుత్వం కేటాయించింది. మరో 63 భవనాలను పక్కన పెట్టడంతో గత ఐదేళ్లుగా నిర్వహణలేక అవి శిథిలావస్థకు చేరుకున్నాయి.ఎన్డీయే ప్రభుత్వం అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను అధికారులు రూపొందించారు. సచివాలయాలు, వార్డు కార్యాలయాలు, వైద్యశాలలను ఖాళీగా ఉన్న ఇతర ప్రభుత్వ భవనాల్లోకి మార్చడం ద్వారా వాటిలో తిరిగి అన్న క్యాంటీన్లను తెరవవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

13 నెలలు...4.60 కోట్ల మందికి లబ్ధి

తెదేపా ప్రభుత్వ హయాంలో 2018 జులై నుంచి అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. 2019 జులై వరకు (13 నెలల పాటు) వీటిని నిర్వహించారు. వీటిలో నెలకు కనిష్ఠంగా 12.26 లక్షలు, గరిష్ఠంగా 49.31 లక్షల మంది ఇక్కడ భోజనం చేశారు. 13 నెలల్లో 4,60,31,660 మంది క్యాంటీన్ల ద్వారా లబ్ధి పొందారు. రెండు విడతల్లో మంజూరు చేసిన 203 అన్న క్యాంటీన్‌ భవన నిర్మాణాల్లో 184 పూర్తయ్యాయి. మిగిలిన 19 నిర్మాణాలను జగన్‌ ప్రభుత్వం పక్కన పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ మరో 152 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలనూ పట్టించుకోలేదు.

అందుబాటులో రూ.165.18 కోట్లు

క్యాంటీన్ల నిర్వహణకు తెదేపా ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో ఇంకా రూ.165.18 కోట్లు పీడీ ఖాతాలో మిగిలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాతలు ఇచ్చిన విరాళాల్లో రూ.1.11 కోట్లు బ్యాంకులో ఉన్నాయి. అన్న క్యాంటీన్ల భవన నిర్మాణాలకు సంబంధించి రూ.76.22 కోట్లతో ప్రభుత్వం అప్పట్లో గుత్తేదారు సంస్థతో ఒప్పందం చేసుకుంది. రూ.34.55 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.41.67 కోట్లు చెల్లించాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు