CM Chandrababu: శ్రీవారి సన్నిధిలో సీఎం చంద్రబాబు

శ్రీవారి దర్శనార్థం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబసమేతంగా బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన తొలిసారిగా తిరుమలకు విచ్చేశారు.

Published : 13 Jun 2024 06:25 IST

నేడు కుటుంబసమేతంగా దర్శనం

ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే-తిరుమల: శ్రీవారి దర్శనార్థం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబసమేతంగా బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన తొలిసారిగా తిరుమలకు విచ్చేశారు. 8.45 గంటల సమయంలో తిరుమలలోని శ్రీగాయత్రి నిలయానికి చేరుకున్నారు. ఆయన వెంట భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాంశ్‌ వచ్చారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకుని, అనంతరం తిరిగి ఉండవల్లి వెళ్లనున్నారు.

వర్షంలోనూ పలకరింపు

సీఎం చేరుకున్న అతిథిగృహానికి ఎదురుగా ఉన్న ఛైర్మన్‌ క్యాంపు కార్యాలయం వద్ద పార్టీశ్రేణులు చంద్రబాబు కోసం ఎదురుచూశాయి. నేరుగా అతిథిగృహానికి చంద్రబాబు వెళ్తుండగా కార్యకర్తలు ఒక్కసారి తమను కలిసి వెళ్లాలని అభ్యర్థించారు. దీంతో వర్షంలోనూ గొడుగుతో ఆయన వారి వద్దకు వెళ్లి అందరినీ పలకరించారు. ఈ సందర్భంగా స్థానికులు శాలువా కప్పి సత్కరించారు.

అధికారులను పట్టించుకోని సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబుకు జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్‌ఓ నరసింహ కిషోర్‌ స్వాగతం పలికే సమయంలో అతిథిగృహం బయటకు రాకుండా లోపలే ఉండి పుష్పగుచ్ఛం ఇవ్వబోగా.. ఆయన తీసుకునేందుకు నిరాకరించారు. కనీసం వాళ్లవైపు చూడలేదు. అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, ఇతర పార్టీనేతలు ఇచ్చిన పుష్పగుచ్ఛాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి సీఎం చంద్రబాబు కాళ్లకు మొక్కారు.

పరదాల సంస్కృతి పోలేదా?

తిరుమలలోని అతిథిగృహం వద్దకు చేరుకున్న   నారా లోకేశ్‌ స్థానికులతో మాట్లాడి వస్తుండగా పక్కనే పరదాలు కట్టి ఉండటాన్ని గమనించారు. అధికారులకు ఇంకా పరదాల సంస్కృతి పోలేదని ఆయన చమత్కరించారు. తాము వద్దని చెప్పినా కొనసాగిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. రెండు మూడు రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని స్పష్టం చేశారు. 

విమానాశ్రయం నుంచి..

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత తిరుమల వచ్చిన చంద్రబాబుకు రేణిగుంట విమానాశ్రయం వద్ద తెదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. విమానాశ్రయం వెలుపల ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్దసంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రతి ఒక్కరికీ అభివాదం చేశారు. అక్కడి నుంచి అలిపిరి వరకు అడుగడుగునా ఆయనకు నీరాజనం పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు