Updated : 10 Apr 2022 05:28 IST

CM Jagan: నేడే ఖరారు!

చివరి నిమిషం వరకూ గోప్యత

నేటి మధ్యాహ్నం గవర్నర్‌కు కొత్త మంత్రుల జాబితా

వెంటనే వారందరికీ ఫోన్లు

ముఖ్యమంత్రే మాట్లాడి శుభాకాంక్షలు తెలిపే అవకాశం

ఈనాడు, అమరావతి: కొత్త మంత్రుల (కొనసాగనున్న పాత మంత్రుల పేర్లూ కలిపి) జాబితా ఆదివారం ఖరారు కానుంది. ఈ జాబితాను మధ్యాహ్నం గవర్నర్‌కు పంపే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం వెల్లడించారు. చివరి నిమిషం వరకూ సీఎం జగన్‌ మార్పులు చేర్పులు చేస్తారన్నారు. జాబితాను గవర్నర్‌కు పంపిన తర్వాత.. అందులో ఉన్నవారికి సోమవారం మంత్రులుగా ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి ఫోన్లు వెళ్తాయి. కొత్త మంత్రులతో సీఎం జగన్‌ నేరుగా మాట్లాడి శుభాకాంక్షలు చెప్పనున్నారని సీఎంవో వర్గాల సమాచారం.

కొనసాగుతున్న కసరత్తు..

మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణపై మూడు నాలుగు రోజుల నుంచి సీఎం కసరత్తు చేస్తున్నారు. శుక్ర, శనివారాలు రెండు రోజులూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని పిలిపించుకుని చర్చించారు. ఆదివారం ఉదయం కూడా జాబితాపై కసరత్తు జరగనుంది. జాబితాను గవర్నర్‌కు పంపేవరకూ అందులోని పేర్లు బయటకు రాకుండా గోప్యత పాటించాలని సీఎం స్పష్టం చేశారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.

ఎవరికి ఏ శాఖ..

కసరత్తులో భాగంగా కొత్త మంత్రుల పేర్లతో పాటు, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే విషయంపైనా సీఎం ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. మంత్రి పదవులు కోల్పోయినవారికి గౌరవం తగ్గకుండా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు ఎలా చేయాలనే దానిపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. జిల్లా అభివృద్ధి మండళ్ల (డీడీబీ) ఏర్పాటు, వాటి బాధ్యతలను మాజీ మంత్రులకు అప్పగించడం, వారికి ప్రోటోకాల్‌, అందులో న్యాయపరమైన ఆటంకాలు రాకుండా ఎలా చేయాలనే అంశాలపై విస్తృత చర్చ జరిగిందని సమాచారం. కొత్తమంత్రివర్గం కొలువుదీరాక డీడీబీలను ఖరారుచేసే అవకాశం ఉందంటున్నారు.

రేపు తేనేటి విందు

సోమవారం కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది. వెలగపూడి సచివాలయ భవన సముదాయం పక్కనున్న పార్కింగ్‌ స్థలంలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని 11:31 గంటల నుంచి నిర్వహించనున్నారు. అది ముగిశాక.. ముఖ్యమంత్రి గవర్నర్‌తో కలిసి కొత్త మంత్రులతో తేనేటి విందులో పాల్గొనడంతోపాటు గ్రూప్‌ ఫొటో తీయించుకుంటారు.

పాత కొత్తల కలయిక: సజ్జల

సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ‘పాత, కొత్తవారి కలయికలో మంత్రివర్గం ఏర్పాటు కానుంది. పాతవారిలో 7 నుంచి 10 మంది ఉండొచ్చు, లేదా అయిదుగురే కొనసాగవచ్చు. లేదా 10-12 మంది ఉండొచ్చు.. బీసీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మహిళల ప్రాతినిధ్యం కూడా సముచితంగా ఉంటుంది. ముందుగా కొత్త జిల్లాల ప్రాతిపదికన ప్రతీ జిల్లాకూ మంత్రి అనుకున్నా.. కొన్ని జిల్లాల్లో అవసరం ఉండట్లేదు, మరికొన్ని జిల్లాల్లో కుదరట్లేదు. ఈ నేపథ్యంలో అనుకున్నవారిలో కొందరికి పదవులు రాకపోవచ్చు. అలాగని ఎవరినీ బుజ్జగించాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోవడం లేదు. 149 మంది ఎమ్మెల్యేలూ (మంత్రి గౌతమ్‌రెడ్డి మృతిచెందారు) ముఖ్యమంత్రి బృందమే. మంత్రివర్గంలో చోటు దక్కనివారికి పార్టీ బాధ్యతలుంటాయి, అందరూ సమానమే. మంత్రి పదవులు వచ్చినవారు ఏమీ ఎక్కువ కాదు’ అని తెలిపారు.


కొత్తగా మంత్రిమండలిలో చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారంలో ఉన్న పేర్లు
ధర్మాన ప్రసాదరావు
కళావతి/రాజన్నదొర
భాగ్యలక్ష్మి/ధనలక్ష్మి
ముత్యాలనాయుడు/గుడివాడ అమర్నాథ్‌
దాడిశెట్టి రాజా/జక్కంపూడి రాజా
కొండేటి చిట్టిబాబు/తలారి వెంకట్రావు
ముదునూరి ప్రసాదరాజు/గ్రంధి శ్రీనివాస్‌
రక్షణ నిధి/సామినేని ఉదయభాను
జోగి రమేష్‌/పార్థసారథి
పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి/విడదల రజిని
కోన రఘుపతి/మేరుగ నాగార్జున
హఫీజ్‌ఖాన్‌/ముస్తఫా
సుధ/జొన్నలగడ్డ పద్మావతి
కాకాణి గోవర్ధన్‌ రెడ్డి
రోజా/భూమన కరుణాకర రెడ్డి
శిల్పా చక్రపాణి రెడ్డి/ఆర్థర్‌

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని