Andhra News: సహకార సంఘాలకు వైకాపా చెదలు

వైకాపా పాలనలో ఆ పార్టీ నాయకులు రాష్ట్రంలోని అధికశాతం సహకార బ్యాంకుల్ని ఊడ్చేశారు. రుణాల పేరుతో ఎడాపెడా కొల్లగొట్టారు.

Published : 06 Jul 2024 05:45 IST

రూ.6,000 కోట్లకు పైగా అక్రమాలు
అధికారపక్షమైతే చాలు.. ఉద్యోగాలు, రుణాలిచ్చేసిన అధికారులు

ఈనాడు-అమరావతి: వైకాపా పాలనలో ఆ పార్టీ నాయకులు రాష్ట్రంలోని అధికశాతం సహకార బ్యాంకుల్ని ఊడ్చేశారు. రుణాల పేరుతో ఎడాపెడా కొల్లగొట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో సహకార బ్యాంకుల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఒక్కో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పరిధిలో సగటున రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల మేర అక్రమాలు జరిగాయి. ఇవి కాకుండా సహకారశాఖ ముసుగులో దోచుకున్న ఆస్తులూ భారీ ఎత్తున ఉన్నాయి. జగనన్న పందేరం రూ.6 వేల కోట్లకు పైబడి ఉంటుందని అంచనా. అందుకే రాష్ట్రంలో 848 సహకార పరపతి సంఘాలు నష్టాల్లోకి చేరాయి. 

త్రిసభ్య కమిటీల పేరుతో ఇష్టారాజ్యంగా

వైకాపా అధికారంలోకి వచ్చాక.. సహకార సంఘాలకు ఎన్నికల మాటే మరచింది.  వైకాపా నేతల ఏలుబడిలో సహకార సంఘాల్లో రుణాలంటే.. కొంతమందికే అనే విధంగా తయారైంది.  వైకాపా కార్యకర్తలకే మెసెంజర్, పొరుగుసేవల ఉద్యోగాలు కట్టబెట్టారు. ఎకరం విలువ రూ.10 లక్షలు ఉంటే.. రూ.20లక్షల మేర రుణాలిచ్చిన వైనం శ్రీకాకుళంలో వెలుగుచూసింది.

  • ఒక్క ఏలూరు జిల్లాలోనే రూ.400 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. టి.నరసాపురంలో రూ.150 కోట్ల మేర అక్రమాలను గుర్తించగా.. రూ.16 కోట్లతో సరిపెట్టి విచారణ ముగించారు. పొలం లేకున్నా రుణాలిచ్చారు. వైకాపా నాయకుడు అనే అర్హత ఉంటే చాలు..రూ.6.9 కోట్ల నుంచి రూ.17 కోట్ల వరకు బ్యాంకు గ్యారంటీలు ఇచ్చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 40 మంది వైకాపా కార్యకర్తలకు పొరుగుసేవల ఉద్యోగాలిచ్చారు. వైకాపా నేతలతో కుమ్మక్కైన అధికారులు కుటుంబ సభ్యుల పేర్లతో రుణాలు తీసుకున్నారు. 
  • ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో పొదుపు సంఘాల పేర్లతో రూ.600 కోట్ల రుణాలు ఇవ్వగా.. రూ.100 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయి.  నూజెళ్లపల్లి సహకార సంఘం పరిధిలో రూ.2.22 కోట్లు మళ్లించారని విచారణలో తేలింది. ప్రత్తిపాడులో నకిలీ పాసుపుస్తకాలతో రూ.10 కోట్లు రుణాలుగా తీసుకున్నారు. 70 మంది వైకాపా కార్యకర్తలకు మెసెంజర్ల నియామకంలో పెద్దపీట వేశారు. అవినీతికి పాల్పడిన ఉద్యోగులకు ఇటీవల పదోన్నతులు కల్పించారు. చెంచుపేటలో నకిలీ బంగారం పెట్టి రుణాలు పొందారు. భట్టిప్రోలు, వినుకొండ, తెనాలి, నిజాంపట్నం తదితర పీఏసీఎస్‌ల పరిధిలో అక్రమాలకు అండగా నిలిచిన అధికారికి పోస్టింగ్‌లో పెద్దపీట వేశారు. 
  • పులివెందులకు భారీ ఎత్తున రుణాలు మంజూరయ్యాయి. జిల్లా మొత్తం మీద రూ.600 కోట్ల రుణాలిస్తే.. అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ ప్రాతినిథ్యం వహించే ఈ నియోజకవర్గానికి రూ.200 కోట్లకు పైగా సంతర్పణ చేశారు. కొన్ని పీఏసీఎస్‌లలో లేని సర్వే నంబర్లతో, నకిలీ పాసుపుస్తకాలతో రుణాలు తీసుకున్నారు. 
  • ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే రూ.300 కోట్లకు పైగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. కాకినాడ డీసీసీబీలో రూ.200 కోట్ల కుంభకోణంలో అక్కడి వైకాపా నాయకుడి అనుచరుల ప్రమేయం ఉంది.
  • అనంతపురం జిల్లాలో తాత్కాలిక ఉద్యోగులను రికార్డుల్లో చూపిస్తూ..భారీ ఎత్తున దోచుకున్నారు. 
  • ఉమ్మడి కర్నూలు జిల్లా కృష్ణగిరి పీఏసీఎస్‌లో నకిలీ పాసుపుస్తకాలతో రుణాలు తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో అప్పటి మంత్రుల అండతో పాలకవర్గ సభ్యులు, వారి బంధువుల పేర్లతో రూ.10 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నారు. లేని ఉద్యోగుల్ని చూపి జీతాల పేరుతో రూ.కోట్లు మళ్లించారు.  
  • కొవిడ్‌ సమయంలో నాబార్డు మంజూరు చేసిన రుణాలను కూడా.. వైకాపా నాయకులకే ప్రత్యేకం అన్నట్లు పంచుకున్నారు. వీటన్నిటిపై విచారణ చేయించాలని రైతులు కోరుతున్నారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని