Andhra Pradesh: పేద పిల్లల ఫీజుల్ని మళ్లించేశారు

ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి ఐదేళ్లు వైకాపాతో అంటకాగి.. పేదల పిల్లల ఫీజులను భారీగా దారి మళ్లించారు.  ఓట్ల లెక్కింపు రోజున వైకాపా ఓడిపోతుందని తెలుసుకుని వెంటనే కీలకమైన దస్త్రాలను మాయం చేశారు. కొన్నింటిని మెషీన్‌లో వేసి, ముక్కలుగా కట్‌ చేశారు.

Published : 15 Jun 2024 05:33 IST

ఉన్నత విద్యామండలి నిర్వాకం
యాప్‌ పేరుతో రూ.90 లక్షల వ్యయం
ప్రైవేటు సంస్థలకు రూ.5 కోట్ల ప్రాజెక్టులు
విచారణ జరిగితే ఇబ్బందులొస్తాయని ఓట్ల లెక్కింపు నాడే రాజీనామా చేసిన ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి
ఈనాడు - అమరావతి

ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి ఐదేళ్లు వైకాపాతో అంటకాగి.. పేదల పిల్లల ఫీజులను భారీగా దారి మళ్లించారు.  ఓట్ల లెక్కింపు రోజున వైకాపా ఓడిపోతుందని తెలుసుకుని వెంటనే కీలకమైన దస్త్రాలను మాయం చేశారు. కొన్నింటిని మెషీన్‌లో వేసి, ముక్కలుగా కట్‌ చేశారు. ఆ వెంటనే ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను ఆమోదించని ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు మెడికల్‌ లీవ్‌ మంజూరు చేశారు. ఉన్నత విద్యామండలికి ఛైర్మన్, ఇద్దరు వైస్‌ ఛైర్మన్లు, ఒక కార్యదర్శిని ప్రభుత్వం నియమిస్తుంది. నామినేటెడ్‌ పోస్టులు కావడంతో పదవీలో ఉన్న సమయంలో ఎంతో కొంత వెనకేసుకునేందుకే ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఉన్నత విద్యామండలిని రాజకీయాలకు కేంద్రంగా మార్చేశారు. బీఈడీ ప్రవేశాల్లోనూ భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఇతర రాష్ట్రాల విద్యార్థుల ప్రవేశాలు, ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్ల ఆమోదం కోసం ఉన్నత విద్యామండలిలో కొందరు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఉన్నత విద్యామండలిలో ఐదేళ్లల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తే మరింత అవినీతి వెలుగుచూసే అవకాశం ఉంది. రూ.కోట్లలో అక్రమాలు జరిగినట్లు ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగుల ఫోరం సైతం పలు ఫిర్యాదులు చేసింది.

యాప్‌ రూపకల్పనకు రూ.లక్షల్లో

విద్యార్థులు, విశ్వవిద్యాలయాలకు సమాచారం కోసమంటూ ప్రత్యేకంగా రూ.90 లక్షలతో యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ రూపకల్పన బాధ్యతలను అనంతపురం జిల్లాకు చెందిన వారికే ఇచ్చారు. వాస్తవంగా హేమచంద్రారెడ్డి జేఎన్‌టీయూ, అనంతపురంలో మెకానికల్‌ ప్రొఫెసర్‌. అక్కడున్న సంబంధాలతో ఈ యాప్‌ కాంట్రాక్టు కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఒక యాప్‌ రూపకల్పనకు ఇంత భారీ మొత్తం ఖర్చుపెట్టడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

 • విద్యార్థులకు ఎలాంటి శిక్షణా ఇవ్వకుండానే హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థకు రూ.50 లక్షలు చెల్లించినట్లు లెక్కల్లో చూపారు. హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ ఉన్నత విద్యామండలికి సమీపంలోని మిడ్‌వ్యాలీలో ఉంటున్నట్లు తప్పుడు చిరునామా చూపి, నిధులు కొట్టేశారు. 
 • విద్యార్థులకు సమాచారం ఇచ్చేందుకంటూ చాట్‌బోట్‌ సర్వీసు పేరుతో రూ.45 లక్షలు, లక్ష లింక్‌డిన్‌ కోర్సుల లైసెన్సుల కోసమంటూ రూ.2.5 కోట్లకు ఉన్నత విద్యామండలి కౌన్సిల్‌ సమావేశంలో అనుమతులు తీసుకున్నారు. విద్యార్థులకు వీటిని ఉపయోగించలేదు. ఈ నిధుల వ్యయంపైనా ఆరోపణలున్నాయి. 
 • ఉన్నత విద్యలో డిజిటల్‌ ప్రమోషన్‌ కోసమంటూ రూ.22 లక్షలు ఖర్చు చేసినట్లు చూపారు. ఇవి ఏం చేశారో కార్యాలయంలో ఎవరికీ తెలియదు. 

ఉద్యోగులు లేకపోయినా జీతాలు..

ఉన్నత విద్యామండలిలో పని చేయకపోయినా నేరెళ్ల పీఎస్‌వీఎన్‌ మూర్తి అనే ఉద్యోగి పేరుతో గత రెండేళ్లుగా జీతాలు చెల్లిస్తున్నారు. రాష్ట్ర పరిశోధన మండలిలో ఈయన కన్సల్టెంట్‌ కింద పని చేస్తున్నట్లు చూపి నెలకు రూ.50 వేలు జీతంగా చెల్లిస్తున్నారు. ఈ ఏడాది మార్చితో ఒప్పంద గడువు ముగియడంతో 2025 ఫిబ్రవరి వరకు పొడిగించారు. పని చేయని ఉద్యోగి సర్వీసును సైతం కాగితాల్లో పొడిగించేయడం గమనార్హం.

 • 2019 ఎన్నికల్లో వైకాపాకు మద్దతుగా ప్రచారం చేసిన దినేష్‌రెడ్డికి ఉన్నత విద్యామండలిలో ఉద్యోగం ఇచ్చారు. ఈయన విధులకు సక్రమంగా రాకపోయినా మొదట రూ.లక్ష.. కొన్ని నెలలు ఆ తర్వాత రూ.1.25 లక్షల చొప్పున జీతంగా చెల్లించారు. 
 • మాజీ మంత్రి కుమారుడికి సైతం ఉన్నత విద్యామండలిలో ఉద్యోగం కల్పించినట్లు చూపి, నెలకు రూ.లక్ష చొప్పున చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. ఈయన విధులకు రాకపోయినా జీతాలు చెల్లించినట్లు తెలిసింది. 
 • రాష్ట్ర సచివాలయంలో పని చేస్తున్న ఓ అధికారికి ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసి ఇవ్వడం, మరో ఇద్దరు అధికారులకు రూ.లక్షల్లో జీతాలు, కార్లను ఉన్నత విద్యామండలి సమకూర్చింది. ఈ ఉద్యోగులెవరూ ఉన్నత విద్యామండలిలో పని చేయడం లేదు.

బొత్స ఓఎస్‌డీ, పేషీ నిర్వహణ పేరుతోనూ..

 • విద్యాశాఖ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేషీ నిర్వహణ, ప్రభుత్వ సలహాదారు, శింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి కారు బిల్లు, రాష్ట్ర సచివాలయం ఉన్నత విద్యాశాఖలో పని చేస్తున్న సిబ్బంది జీతభత్యాల కింద రూ.కోట్లలో నిధులు మళ్లించారు. నిబంధనల ప్రకారం ఉన్నత విద్యామండలికి వీటితో ఎలాంటి సంబంధం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న సాంబశివారెడ్డికి కారు అద్దె కింద రూ.81 వేలు చెల్లించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు బంధువైన ఎంఎస్‌ భగవాన్‌ను పేషీలో ఓఎస్‌డీగా నియమించుకుంటే ఈయనకు జీతభత్యాల కింద నెలకు రూ.1.40 లక్షల చొప్పున చెల్లించారు. పేషీ నిర్వహణ, కారు బిల్లుల కింద నెలకు రూ.1.70 లక్షల చొప్పున నిధులు మింగేశారు. 
 • ఉన్నత విద్య కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్టును ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు. దీనికి ఏడాదికి రూ.2.50 కోట్ల చొప్పున చెల్లిస్తున్నారు. వైకాపా ప్రభుత్వంలోని కీలక సలహాదారు సిఫార్సుతో ఈ ప్రాజెక్టును ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు. విచిత్రమేమిటంటే ఈ ప్రాజెక్టులో పని చేసే ఉద్యోగులకు రూ.లక్షల్లో జీతాలు చెల్లిస్తామంటూ ఉన్నత విద్యామండలి ముందుగానే వెల్లడించింది. మరో రెండు ప్రాజెక్టులకు రూ.3 కోట్లు చెల్లించేశారు. 
 • విజయనగరంలో జగన్‌ సభ కోసం హేమచంద్రారెడ్డి రూ.50 లక్షలు ఇచ్చారు. ఇవి ఇంతవరకు తిరిగి రాలేదు. 

అర్హతలు లేకపోయినా..

 • విశ్వవిద్యాలయాలను రాజకీయ కేంద్రాలుగా మార్చడంలో హేమచంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించారు. వైకాపా ప్రభుత్వంలోని అత్యున్నత అధికారి మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. వర్సిటీ విభాగాలపై ఒత్తిడి తెచ్చి, ప్రచురణ విభాగంలోని బోధనేతర సిబ్బందిని అధ్యాపకులుగా మార్పించడంలో కీలకంగా వ్యవహరించారు. అత్యున్నతాధికారి మేనల్లుడితోపాటు 11మంది బోధనేతర సిబ్బందిని బోధన సిబ్బందిగా మార్చారు. ఆడిట్‌ విభాగం తప్పుపట్టినా పట్టించుకోలేదు. 
 • యూజీసీ నిబంధనలను తుంగలోకి తొక్కి అర్హతలు లేకపోయిన శ్రీకాంత్‌రెడ్డిని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమించారు. పెద్దాయన సిఫార్సు చేయడంతో హేమచంద్రారెడ్డి నిబంధనలను కాలరాశారు. 

వాస్తవాలను దాచి, సెర్చ్‌ కమిటీ జాబితాలో శ్రీకాంత్‌రెడ్డి పేరు చేర్చేలా చక్రం తిప్పారు. వీసీలుగా నియమితులయ్యే వారికి ప్రొఫెసర్లుగా 10ఏళ్లు చేసిన అనుభం ఉండాలి. కానీ, శ్రీకాంత్‌రెడ్డికి ఐదేళ్ల అనుభవమే ఉంది. ఈ విషయం తెలిసినా హేమచంద్రారెడ్డి రహస్యంగా ఉంచి వీసీ పదవి లభించేలా తెరవెనుక చక్రం తిప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని