AP news: అనుమతుల్లేకుండానే ఊరూరా వైకాపా ప్యాలెస్‌లు..!

బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి, ఇడుపులపాయ... ఇలా ఊరూరా రాజప్రాసాదాల్ని తలదన్నే సొంత ప్యాలెస్‌లు... ఎక్కడ చూసినా భూములు... రూ.వేల కోట్ల ప్రాజెక్టులు, కంపెనీలు, ఆస్తులు... అయినా వైకాపా అధ్యక్షుడు జగన్‌ ధనదాహం తీరలేదు.

Updated : 23 Jun 2024 11:13 IST

ఈనాడు - అమరావతి

బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి, ఇడుపులపాయ... ఇలా ఊరూరా రాజప్రాసాదాల్ని తలదన్నే సొంత ప్యాలెస్‌లు... ఎక్కడ చూసినా భూములు... రూ.వేల కోట్ల ప్రాజెక్టులు, కంపెనీలు, ఆస్తులు... అయినా వైకాపా అధ్యక్షుడు జగన్‌ ధనదాహం తీరలేదు. సొంతానికే కాదు... పార్టీ జిల్లా కార్యాలయాలకూ మైసూరు రాజమహల్‌ని తలదన్నేలా భవనాల్ని కట్టేస్తున్నారు. 30 ఏళ్లు తానే అధికారంలో ఉంటానన్న భ్రమలో రూ.500 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి విశాఖలోని రుషికొండపై అత్యంత విలాసవంతమైన భవనాల్ని కట్టుకున్నా... ప్యాలెస్‌లపై జగన్‌కు మోజు తగ్గలేదు. పార్టీ కార్యాలయాల పేరుతో ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ భూముల ‘అధికారిక కబా’్జకు తెగబడ్డారు. 33 ఏళ్ల లీజు ముసుగులో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు టెండర్‌ పెట్టారు. చేతిలో అధికారం ఉందని చెలరేగిపోయారు. అత్యంత విలువైన భూముల్ని చెరబట్టారు. నగరాలు, పట్టణాల నడిబొడ్డున, జాతీయ రహదారులకు పక్కన అత్యంత ఖరీదైన భూముల్ని కేటాయించేసుకున్నారు. సామాజిక, సంస్థాగత అవసరాల కోసం గతంలో వివిధ విభాగాలు, సంస్థలకు కేటాయించిన భూముల్నీ బలవంతంగా లాక్కున్నారు. ఆయా విభాగాల అధికారులు ఆ భూముల్ని తీసుకోవద్దు మొర్రో... అని మొత్తుకున్నా ఖాతరు చేయలేదు. ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులొత్తిన జిల్లా కలెక్టర్లు, అధికారగణం ఆఘమేఘాలపై స్పందించారు. పైనుంచి ఉత్తర్వులు రావడమే తడవు జీ హుజూర్‌ అంటూ... భూముల కేటాయింపు పూర్తిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో రూ.కోట్ల విలువైన భూముల్ని ఏడాదికి ఎకరానికి రూ.వెయ్యి చొప్పున లీజుకు కట్టబెట్టేశారు. అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేసినవాళ్లు ఎంత పెద్దవాళ్లయినా కూల్చేయాల్సిందేనని అసెంబ్లీ సాక్షిగా సుద్దులు చెప్పిన పెద్దమనిషి జగన్‌... ఊరూరా అనుమతి లేకుండానే పార్టీ కార్యాలయ భవనాలు కట్టేస్తున్నారు. ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీకి వచ్చిన రూ.వందల కోట్లే వెచ్చించారో, మరే రూపంలో వచ్చిన డబ్బు ఖర్చు చేస్తున్నారో గానీ... ఏ భవనం చూసినా కళ్లు తిరిగిపోయేలా నిర్మిస్తున్నారు. రాజప్రాసాదాల్లా ఉన్న ఆ భవనాల్ని చూస్తే ఒక ప్రాంతీయ పార్టీ జిల్లా కార్యాలయమని ఎవరూ అనుకోరు..! చాలా జాతీయ పార్టీలకు కూడా అంత విలాసవంతమైన కార్యాలయ భవనాలుండవేమో..! కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న భాజపానే దిల్లీలో రెండెకరాల్లో జాతీయ కార్యాలయం కట్టుకుంది. వైకాపా జిల్లా కార్యాలయాల నిర్మాణాలు కొన్నిచోట్ల ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. మిగతాచోట్ల వివిధ దశల్లో ఉన్నాయి. విశాఖ, ఒంగోలులో కార్యాలయాల్ని ఇప్పటికే ప్రారంభించారు. కోర్టు కేసులు ఉండటంతో బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పాడేరుల్లో నిర్మాణాలు మొదలవలేదు. చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో ప్రారంభించి, పునాదుల దశలో నిలిపేశారు. కోనసీమ జిల్లాలో ఏకంగా పశువులు నీళ్లు తాగే చెరువునే వైకాపా కార్యాలయానికి కేటాయించేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జలవనరుల శాఖకు చెందిన స్థలంలో అనుమతుల్లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనాన్ని ప్రభుత్వం శనివారం కూల్చివేయడంతో... రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కార్యాలయాలపై ‘ఈనాడు యంత్రాంగం’ చేసిన పరిశీలనలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. ప్రతి జిల్లా కేంద్రంలో ఎకరం నుంచి 2 ఎకరాల చొప్పున భూములు కేటాయించారు. 26 జిల్లాల్లో కలిపి 42.24 ఎకరాలు కేటాయించగా, వాటి విలువ రూ.688 కోట్లు ఉంటుందని అంచనా. వీటిలో ఒక్క ప్రకాశం జిల్లాలోనే అనుమతులు తీసుకుని భవనం కట్టారు. అమలాపురం పక్కనే ఉన్న జనుపల్లె, పాడేరుల్లో కోర్టు కేసుల వల్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. మిగతా 23 చోట్లా అనుమతుల్లేవు. వైకాపా ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి చెందిన రాంకీ ఇన్‌ఫ్రా సంస్థే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకార్యాలయాల నిర్మాణం చేపడుతోంది.


తూర్పు గోదావరి జిల్లా

రాజమహేంద్రవరంలో రోడ్లు భవనాలశాఖకు చెందిన 2 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న భవనం.. 2023 మే నెలలో చదును పనులు ప్రారంభించి శరవేగంగా నిర్మాణం చేపట్టారు.


విజయనగరం

విజయనగరం రింగ్‌రోడ్డుకు సమీపంలో ఎకరం భూమిలో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనం.. గతంలో ఇదే స్థలాన్ని శంకర్‌ ఫౌండేషన్‌ కంటి ఆసుపత్రికి, విద్యుత్తు ఉపకేంద్ర నిర్మాణానికి ప్రతిపాదించారు. విజయనగరం మహారాజులకు చెందిన భూమిని ప్రభుత్వ భూమిగా చూపించి ఇచ్చేశారు.


పార్వతీపురం మన్యం

పార్వతీపురం పట్టణ పరిధిలోని కొత్త బెలగాంలో వైకాపాకు కేటాయించిన 1.18 ఎకరాల్లో కడుతున్న కార్యాలయ భవనం.. జలవనరులశాఖ ఆధ్వర్యంలో రైతులకు సాగునీటి వినియోగంపై శిక్షణా కేంద్ర నిర్మాణానికి గతంలో ప్రతిపాదించారు.


బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ

అమలాపురం పట్టణాన్ని ఆనుకుని ఉన్న జనుపల్లెలో వైకాపా కార్యాలయ నిర్మాణానికి కేటాయించిన చెరువు భూమి..


విశాఖపట్నం

విశాఖపట్నంలోని చినగదిలి మండలం ఎండాడలో కేటాయించిన రూ.100 కోట్ల విలువైన భూమిలో పూర్తయిన వైకాపా కార్యాలయ నిర్మాణం.. దీని కోసమే లా కళాశాల రోడ్డును 80 అడుగుల నుంచి 100 అడుగులకు విస్తరించారు.


కాకినాడ

కాకినాడలోని పైడా వారి వీధిలో 22ఎ నిషేధిత జాబితాలో ఉన్న 2 ఎకరాల భూమిలో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయం. దీన్ని కుదువ పెట్టి బ్యాంకు నుంచి రుణం తెచ్చేందుకు కూడా ప్రయత్నించారు.


పశ్చిమ గోదావరి

ఉండి మండలం ఎన్‌ఆర్‌పీ అగ్రహారంలో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనం.. పేదల ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని ధర్నాలు చేపట్టిన పట్టించుకోకుండా వైకాపా కార్యాలయానికి కేటాయించారు.


పల్నాడు

నరసరావుపేట పట్టణ సమీపంలో.. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, జిల్లా ప్రధాన ఆసుపత్రి, రైల్వేస్టేషన్‌ పక్కనే.. వైకాపా కార్యాలయ భవనానికి అగ్రహారం భూమి 1.50 ఎకరాలు కేటాయించారు. 


అనకాపల్లి

అనకాపల్లి సమీపంలో గతంలో కాపుభవనానికి కేటాయించిన భూమిలో వైకాపా కార్యాలయ భవనం..స్థానికులు వ్యతిరేకించినా లెక్క చేయకుండా కేటాయించారు.


బాపట్ల

జాతీయ రహదారి బైపాస్‌ పక్కనే.. ఆర్టీసీ డిపోకు ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకుని నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనం..


కృష్ణా

మచిలీపట్నంలో అత్యంత రద్దీగా ఉండే జిల్లా కోర్టు సెంటర్లో రూ.60 కోట్లకు పైగా విలువైన 2 ఎకరాల స్థలంలో పూర్తయిన వైకాపా కార్యాలయ భవనం.


చిత్తూరు

చిత్తూరు నగరంలో వైకాపా కార్యాలయ నిర్మాణానికి కేటాయించిన రెండెకరాల స్థలం.


తిరుపతి

రేణిగుంట మండలం కుర్రకాల్వలోని పారిశ్రామికవాడలో ఏపీఐఐసీకి చెందిన రెండెకరాల భూమిలో నిర్మాణం పూర్తయిన వైకాపా కార్యాలయ భవనం. 


అనంతపురం

అనంతపురంలోని హెచ్‌ఎల్‌సీ కాలనీ వద్ద జలవనరులశాఖకు చెందిన భూమిలో నిర్మిస్తున్న కార్యాలయ భవనం.. జలవనరులశాఖ అనుమతి లేకుండానే నిర్మాణం తుదిదశకు చేరింది. 


కర్నూలు

కర్నూలు నడిబొడ్డున అయిదురోడ్ల కూడలిలో 1.60 ఎకరాల్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం.. రూ.100 కోట్ల విలువైన ఈ భూమిని గతంలో ఏపీఆగ్రోస్‌కు కేటాయించగా.. దాన్ని తిరిగి తీసుకుని వైకాపాకు ఇచ్చారు.


వైఎస్సార్‌

కడపలో కర్నూలు-తిరుపతి ఆరువరసల జాతీయరహదారి పక్కనే కడప నగర ముఖద్వారంలో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయం.. ఎలాంటి అనుమతులు లేకుండానే.. శరవేగంతో నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు.


శ్రీసత్యసాయి

పుట్టపర్తి విమానాశ్రయం ఎదురుగా.. అనుమతులు లేకుండానే దాదాపు నిర్మాణం పూర్తయిన వైకాపా కార్యాలయ భవనం.. అక్కడున్న గుట్టను తొలగించి దీన్ని నిర్మించారు.


అన్నమయ్య

రాయచోటిలో గయాళు భూముల్ని.. ఏడబ్ల్యూ భూమిగా మార్చి మరీ వైకాపా కార్యాలయానికి కేటాయింపులు చేశారు. నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవు.


అల్లూరి సీతారామరాజు

పాడేరులో వైకాపా కార్యాలయానికి కేటాయించిన స్థలం వద్ద గతంలో ఆందోళన చేపట్టిన గిరిజనులు.


నెల్లూరు

నెల్లూరు అర్బన్‌ పరిధిలో వెంకటేశ్వరపురం సమీపంలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి గతంలో కేటాయించిన భూమిని.. వైకాపా కార్యాలయానికి కేటాయించారు. అందులో తుది దశకు చేరిన నిర్మాణం..


ఎన్టీఆర్‌

విజయవాడలో అత్యంత రద్దీగా ఉండే విద్యాధరపురంలోని సితారసెంటర్‌ సమీపంలోని.. రూ.50 కోట్లకు పైగా విలువైన భూముల్లో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనం.. అప్పట్లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ చక్రం తిప్పి ఈ భూమిని కార్పొరేషన్‌ ద్వారా కేటాయింపజేసుకున్నారు.


శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు గ్రామంలో 1.50 ఎకరాల్లో జాతీయ రహదారికి ఆనుకుని నిర్మిస్తున్న కార్యాలయ భవనం.. ఇది మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటికి సమీపంలోనే ఉంది.


ఏలూరు

ఏలూరు నడిబొడ్డున రైల్వేస్టేషన్‌కు కూతవేటు దూరంలో క్రీడాప్రాధికార సంస్థకు చెందిన స్థలంలో నిర్మించిన కార్యాలయ భవనం. అన్ని హంగులతో ప్రారంభానికి సిద్ధమైంది.


నంద్యాల

నంద్యాలలోని ఎకరా స్థలంలో నిర్మాణం ప్రారంభించిన వైకాపా కార్యాలయ భవనం.. గతంలో ఈ స్థలాన్ని పేదల గృహాలకు  ఇవ్వాలని అనుకున్నా.. తర్వాత వైకాపాకు కేటాయింపజేసుకున్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని