Amaravati: రాజధానిలో నిరంతర వెలుగులు

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుతో పాటు ఎయిమ్స్‌ వంటి ప్రతిష్ఠాత్మకమైన సంస్థలు ఉన్నందున అంతరాయాలు లేకుండా విద్యుత్తు సరఫరా చేసేందుకు వీలుగా పనులు ప్రారంభించారు.

Updated : 13 Jun 2024 10:58 IST

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా నూతన లైన్లు

నూతన ప్రభుత్వం కొలువుదీరిన వేళ దేదీప్యమానంగా వెలిగిపోతున్న అమరావతిలోని రాష్ట్ర సచివాలయ భవనాలు

ఈనాడు-అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుతో పాటు ఎయిమ్స్‌ వంటి ప్రతిష్ఠాత్మకమైన సంస్థలు ఉన్నందున అంతరాయాలు లేకుండా విద్యుత్తు సరఫరా చేసేందుకు వీలుగా పనులు ప్రారంభించారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో 33 కేవీ సబ్‌ స్టేషన్లు 20 నిర్మించి, వాటి నుంచి వినియోగదారులకు 440 వోల్టుల సరఫరా ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వం మారడంతో ఆ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వాటన్నింటినీ ఇప్పుడు తెరపైకి తెచ్చి అధ్యయనం చేస్తున్నారు. తాజాగా ప్రతి సబ్‌ స్టేషన్‌నూ రెండు నుంచి మూడు 33 కేవీ లైన్లతో అనుసంధానం చేస్తున్నారు. ప్రస్తుతం ఎయిమ్స్‌లోని సబ్‌ స్టేషన్‌ నుంచి 33 కేవీ లైను ద్వారా సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీకి విద్యుత్‌ సరఫరా అవుతోంది. దీనికి అదనంగా తాడికొండ 132 కేవీ స్టేషన్‌ నుంచి మరో 33 కేవీ లైనును సచివాలయం వద్ద ఉన్న కేంద్రానికి అనుసంధానించారు.

ఒకవేళ ఎయిమ్స్, తాడికొండల్లో సమస్యలు తలెత్తినా.. కొండవీటివాగు వద్ద ఉన్న కేంద్రం నుంచి సచివాలయానికి సరఫరా ఇచ్చేందుకు కొత్తగా 33 కేవీ లైను నిర్మిస్తున్నారు. ఎయిమ్స్‌లో ఉన్న కేంద్రంలో సాంకేతిక సమస్యలు ఏర్పడినా.. ఆసుపత్రికి సరఫరా ఆగిపోకుండా ఉండేందుకు కొండవీటివాగు కేంద్రం నుంచి 33 కేవీ లైను వేస్తున్నారు. తాడికొండ నుంచి సచివాలయానికి వచ్చే 33 కేవీ లైను నుంచి రాయపూడి వద్ద ట్యాప్‌ చేసి దొండపాడు టిడ్కో ఇళ్ల వద్ద ఉన్న ఉప కేంద్రానికి కొత్తగా మరో లైను నిర్మిస్తున్నారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి ప్రస్తుతం ఎయిమ్స్‌ వద్ద ఉన్న సబ్‌ స్టేషన్‌ నుంచి 33 కేవీ లైను ద్వారా సరఫరా ఇస్తున్నారు. ఈ లైనులో ఇబ్బందులు తలెత్తితే జనరేటర్‌ వినియోగిస్తున్నారు. ఇకపై అలా కాకుండా ఉండేందుకు కొండవీటివాగు కేంద్రం నుంచి ఉండవల్లిలోని ఉప కేంద్రానికి 33 కేవీ లైను వేయాలని నిర్ణయించారు. తద్వారా సీఎం నివాసానికి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగకుండా చూస్తారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు