Ap news: అక్షరానికి అవినీతి చెద!

కొత్తగా జూనియర్‌ కళాశాల మంజూరు చేయాలంటే రూ.10లక్షలు..

Updated : 23 Jun 2024 09:21 IST

కొత్త విద్యాసంస్థ పెట్టేందుకు.. రెన్యువల్‌కు ఒక్కో ధర
బదిలీలు, పోస్టింగ్‌లకు వసూళ్లు
విద్యా కానుక, చిక్కీల పేరుతో దోచేసిన మాజీ మంత్రి, అధికారులు
అవినీతి అంతం కొత్త ప్రభుత్వానికి సవాలు
ఈనాడు - అమరావతి

  • కొత్తగా జూనియర్‌ కళాశాల మంజూరు చేయాలంటే రూ.10లక్షలు..
  • ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చుకోవాలంటే రూ.3-రూ.4లక్షలు
  • కొత్త పాఠశాల పెట్టాలంటే రూ.5-రూ.6లక్షలు
  • ప్రైవేటు బడుల అనుమతుల పునరుద్ధరణకు రూ.3-రూ.4లక్షలు
  • ఒక డిగ్రీ కళాశాలను ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చుకోవాలంటే రూ.5-రూ.7లక్షలు.
  • పదోన్నతులు, కీలక పోస్టింగ్‌లకు రూ.5-రూ.10లక్షలు. ఇలా విద్యాశాఖలో ప్రతిదానికి ఒక ధర నిర్ణయించి వసూలు చేయడం పరిపాటిగా మారింది. వైకాపా ప్రభుత్వంలో ఇది మరింతగా పెచ్చుమీరింది. ఉద్యోగుల పదోన్నతులు, పోస్టింగ్‌లు, టీచర్ల బదిలీలు, డిప్యుటేషన్లకు డబ్బులు వసూలు చేసే సంస్కృతి కొనసాగుతోంది. చివరికి ప్రశ్నపత్రాల ముద్రణలోనూ కమీషన్లు దండుకునే పరిస్థితి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం, వారికి అందించే సామగ్రిలోనూ గత ప్రభుత్వంలో మేసేశారు. కొత్తగా విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేశ్‌ వీటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. అవినీతి లేని విద్యాశాఖగా మార్పు చేయడం కొత్త ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు. 

నోటిఫికేషన్లు ఇవ్వకుండా..

కొత్త జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఇతరత్రా విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రకటన విడుదల చేసి, దరఖాస్తులు స్వీకరించి అనుమతులు ఇవ్వాల్సి ఉండగా.. మామూళ్ల కోసం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు. రాజకీయ నేతల సిఫార్సు, డబ్బులు చెల్లించిన వారికే అనుమతులు ఇచ్చిన దుస్థితి. గత ప్రభుత్వంలో ప్రైవేటు జూనియర్‌ కళాశాలల అనుమతులు ఇచ్చేందుకు ఒక్కో దానికి రూ.10లక్షలకుపైగా వసూలు చేశారు.  

ప్రైవేటులో తనిఖీలతో..

ప్రైవేటు బడుల్లో సదుపాయాలు లేవని, ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారంటూ తనిఖీల పేరుతో కొందరు మండల విద్యాధికారులు, డిప్యూటీ డీఈఓలు, డీఈఓలు, ఆర్జేడీలు దండుకున్నారు. ఒక్కో యాజమాన్యం నుంచి ఏడాదికి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు తీసుకున్నారు. ప్రైవేటు బడులకు అనుమతులు, పునరుద్ధరణ కోసం రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరకు దండుకున్నారు. 

ఇంటర్మీడియట్‌లో ప్రాక్టికల్‌ పరీక్షలకు డ్యూటీలు వేయడం నుంచి అనుమతులు, తనిఖీల వరకు ఒక్కో ధర పెట్టి వసూలు చేశారు.  

చిక్కీల పేరుతో మేత..

మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు వారానికి మూడు రోజులు ఇచ్చే చిక్కీల సరఫరాలోనూ మేసేశారు. రూ.156కోట్ల విలువైన చిక్కీల సరఫరాకు కొత్త టెండర్లు పిలవడానికి సమయం చాలదంటూ మొదట 2022 డిసెంబరు నుంచి 2023 ఫిబ్రవరి వరకు, తర్వాత 2024 జనవరి వరకు గడువు పొడిగించారు. ఎన్నికల ముందు మరోసారి వారికే ఇచ్చేశారు. ఇందులో మాజీ మంత్రి, అధికారులకు కలిపి 7నుంచి 8శాతం వరకు మామూళ్లు ముట్టినట్లు ఆరోపణలున్నాయి.

టెండర్లలో నిబంధనల ఉల్లంఘన

పాఠశాలలకు అవసరమైన సామగ్రి కొనుగోలు టెండర్లలోనూ నిబంధనలు ఉల్లంఘించారు. ఏపీ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఈడబ్ల్యూఐడీసీ)కు డిప్యుటేషన్‌పై ఏపీకి వచ్చిన చిలకల రాజేశ్వర్‌రెడ్డి, దివాన్‌రెడ్డిలను ఐదేళ్లలో ఎండీలుగా నియమించారు. మొదటి విడతలో ఆర్వోప్లాంట్లు టైప్‌1ఏ, 1బీ రకాల టెండర్లు దక్కించుకున్న సంస్థకే 3ఏ, 3బీ సరఫరా పనులు ఇచ్చేశారు. అదనంగా అప్పగించిన ఒక్కోదాని ధర రూ.1.08లక్షలు. దీనికి ఎలాంటి అనుబంధ ఒప్పందం సైతం చేసుకోలేదు.

పాఠ్యపుస్తకాల్లో సలహాదారూ నొక్కేశారు..

ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్యపుస్తకాలతోపాటు ప్రైవేటు విద్యార్థుల కోసం మార్కెట్‌లో అమ్మే వాటినీ వదల్లేదు. సీఎంఓలోని ఓ సలహాదారు, మాజీ మంత్రి, పాఠశాల విద్యకు చెందిన అధికారి కలిసి అక్రమాలకు తెర తీశారు. మార్కెట్‌లో అమ్మే పుస్తకాలకు టెండర్లు పిలవకుండా పేజీకి 44పైసలుగా ప్రభుత్వమే ధర నిర్ణయించి, 16సంస్థలకు ఒకేసారి రెండేళ్లకు ఇచ్చేసింది. మార్కెట్‌లో పేపర్‌ ధర తగ్గినా ఎక్కువ ధరకు ఇవ్వడంపై విమర్శలు రావడంతో ఈ ఏడాది 2పైసలు తగ్గించారు.


బదిలీలు, పోస్టింగ్‌ల్లోనూ డబ్బులే..

పాఠశాల, ఉన్నత విద్యల్లో బదిలీలు, పోస్టింగ్‌లకు, అధికారులకు పదోన్నతులు ఇచ్చేందుకు.. కీలక విభాగాల్లో నియమించేందుకు మామూళ్లు వసూలు చేశారు. వైకాపాకు చెందిన ఓ మాజీ మంత్రి ఒక పోస్టింగ్‌కు రూ.30లక్షల వరకు వసూలు చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆదర్శ పాఠశాలల్లో పనిచేసే పొరుగుసేవల వారిని కాంట్రాక్టులోకి మార్చేందుకు, ఇక్కడ పనిచేసే అధ్యాపకులకు 010 పద్దు కింద జీతాలు ఇచ్చేందుకు మామూళ్లు తీసుకున్నారు. ఏడీలు, ఆర్జేడీలు, జేడీలు, డీఈఓలకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు, ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓల పోస్టింగ్‌లు, పదోన్నతుల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. 

  • ఉపాధ్యాయుల సిఫార్సు బదిలీలు, డిప్యుటేషన్లకు వివిధ స్థాయుల్లో డబ్బులు వసూలు చేశారు. ఎన్నికల ముందు మాజీ మంత్రి, ఆయన పీఏ, ఓ అధికారి కలిసి రూ.50కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పదోన్నతులు, పోస్టింగ్‌ల్లోనూ భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. స్వయంప్రతిపత్తి కళాశాలల్లో పోస్టింగ్‌లకు డబ్బులు వసూలు చేశారు. కోస్తాలో ఓ కళాశాల ప్రిన్సిపల్‌ కోసం ఓ కీలక అధికారి రూ.30 లక్షలు తీసుకున్నారు. కమిషనరేట్‌లో పోస్టింగ్‌లకు ధరలు నిర్ణయించి వసూలుచేశారు.

విద్యా కానుకలో దోచేశారు..

వైకాపా ప్రభుత్వంలో విద్యా కానుకలో భారీగా దోచేశారు. ఈ ఏడాది విద్యార్థులకు అందించే సామగ్రిని నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి టెండర్లు లేకుండా పాత గుత్తేదార్లకే రిపీట్‌ ఆర్డర్‌ ఇచ్చేశారు. నిధుల చెల్లింపునకు ఆర్థిక శాఖ అనుమతులు లేకపోయినా రూ.772కోట్ల సామగ్రి కొనుగోలుకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ పాతగుత్తేదార్లకు కాంట్రాక్టు ఇచ్చేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. గుత్తేదార్లతో బేరసారాలు సాగించే బాధ్యత సమగ్ర శిక్షా అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌కు అప్పగించారు. ఎన్నికల ముందు కమీషన్ల కోసం మాజీ మంత్రి, కొందరు అధికారులు కలిసి భారీ కుంభకోణానికి తెర తీశారు. 

మాజీ మంత్రి, కొందరు అధికారులకు, గుత్తేదార్లకు మధ్య విజయవాడకు చెందిన ఓ వ్యక్తి దళారీగా వ్యవహరించారు. ఈ దళారీ ఇన్నోవా కారును సమగ్ర శిక్షా అభియాన్‌లో ఓ అధికారికి ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. మధ్యవర్తిత్వం వహించినందుకు సామగ్రి సరఫరా కాంట్రాక్టు ఇచ్చినట్లు విమర్శలున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని