Crime News: భర్తను కొట్టి.. కళ్లెదుటే ఎస్సీ మహిళపై సామూహిక అత్యాచారం

నాలుగు నెలల గర్భిణి అయిన ఎస్సీ మహిళ.. భర్త, ముగ్గురు పసిబిడ్డలతో రైల్వే ఫ్లాట్‌ఫాంపై ఆదమరిచి నిద్రిస్తున్న వేళ.. కామాంధులు రెచ్చిపోయారు.

Updated : 02 May 2022 06:02 IST

ఉపాధి కోసం వెళుతుండగా రేపల్లె రైల్వేస్టేషన్‌లో దారుణం

గర్భిణిపై ప్లాట్‌ఫాంపైనే అఘాయిత్యానికి తెగబడ్డ కామాంధులు

బాధితురాలి భర్త  సాయం కోరినా స్పందించని రైల్వే పోలీసులు

అర్ధరాత్రి వేళ నిస్సహాయ స్థితిలో పోలీస్‌ స్టేషన్‌కు పరుగు

నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

తాగిన మైకంలో ఘటనకు పాల్పడ్డారని వెల్లడించిన ఎస్పీ

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- రేపల్లె అర్బన్‌: నాలుగు నెలల గర్భిణి అయిన ఎస్సీ మహిళ.. భర్త, ముగ్గురు పసిబిడ్డలతో రైల్వే ఫ్లాట్‌ఫాంపై ఆదమరిచి నిద్రిస్తున్న వేళ.. కామాంధులు రెచ్చిపోయారు. భర్తతో కావాలని గొడవ పెట్టుకుని మరీ ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. భర్త, పిల్లలతో కలిసి ఉపాధి పనుల కోసం మరో ప్రాంతానికి వలస వెళ్తూ మార్గమధ్యలో రేపల్లె రైల్వేస్టేషన్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఆమెపై (25) భర్త కళ్లెదుటే ఈ పాశవిక చర్యకు పాల్పడ్డారు. ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడగా మరొకరు ఈ దారుణానికి సహకరించారు. తనను నిర్బంధించిన వ్యక్తి నుంచి తప్పించుకున్న భర్త అదే ప్లాట్‌ఫాంపై ఉన్న రైల్వే పోలీసు కార్యాలయం వద్దకు వెళ్లి ఎంతగా అరిచినా, అతని ఆక్రందన విని ఒక్కరంటే ఒక్కరూ స్పందించలేదు.

నిస్సహాయ స్థితిలో ఆ భర్త రైల్వేస్టేషన్‌ బయటికి వెళ్లి కనిపించినవారినల్లా సాయం కోరినా ఎవరూ ముందుకు రాలేదు. ప్లాట్‌ఫాంపై నిద్రిస్తున్న ఇద్దరు పిల్లల్ని అక్కడే వదిలేసి ఓ బిడ్డను భుజాన ఎత్తుకుని ఆ అర్ధరాత్రి వేళ భార్యను రక్షించుకోవటానికి పరుగున పోలీసు స్టేషన్‌కు చేరుకున్న అతని దయనీయ స్థితి ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. పోలీసులు వెంటనే స్పందించి అక్కడకు చేరుకునే వరకూ ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు. ఈ హృదయవిదారకమైన ఘటన బాపట్ల జిల్లా రేపల్లె పోలీస్‌ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలో, రేపల్లె రైల్వేస్టేషన్‌లో శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ దారుణం చోటుచేసుకునేదే కాదు.

జుట్టు పట్టుకుని ప్లాట్‌ఫాంపై ఈడ్చుకెళ్లి..
కృష్ణా జిల్లా నాగాయలంకలో ఉపాధి పనుల నిమిత్తం బాధితురాలు.. భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి శనివారం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి బయల్దేరారు. గుంటూరు, తెనాలి మీదుగా రేపల్లె రైల్వేస్టేషన్‌కు శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో చేరుకున్నారు.అప్పుడు నాగాయలంక వెళ్లేందుకు బస్సులు లేకపోవటంతో బాధిత కుటుంబం రైల్వేస్టేషన్‌లోనే నిద్రించింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ముగ్గురు యువకులు వారి వద్దకు వచ్చారు. బాధితురాలి భర్తను నిద్రలేపి టైం ఎంతయిందని అడిగారు. తన వద్ద వాచీ లేదని అతను సమాధానమివ్వటంతో.. ఆ ముగ్గురూ అతని గొంతు నులిమి ఊపిరాడకుండా చేశారు. అతని వద్దనున్న రూ.750 లాక్కున్నారు. బాధితురాలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిలో ఇద్దరు ఆమెను జట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. మరొకరు ఆమె భర్తను నిర్బంధించారు. బాధితురాలిని ప్లాట్‌ఫాం చివరి వరకూ ఈడ్చుకుంటూ వెళ్లి భర్త కళ్లెదుటే ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. రైల్వేస్టేషన్‌లోనే ఈ ఘోరం జరిగింది. మద్యం మత్తులో ఉన్న నిందితులు ఆమెను చిత్రహింసలు పెట్టారు.

గొంతెండిపోయేలా అరిచినా లేవని రైల్వే పోలీసులు
నిర్బంధం నుంచి తప్పించుకుని బాధితురాలి భర్త అదే ప్లాట్‌ఫామ్‌పై ఉన్న రైల్వే పోలీసు కార్యాలయానికి పరిగెత్తారు. తన భార్యను కాపాడాలని తలుపులు కొట్టి గట్టిగా అరిచారు. కానీ లోపలున్న వారెవరూ నిద్ర నుంచి లేవలేదు. కామాంధుల చెర నుంచి భార్యను కాపాడాలంటూ రైల్వేస్టేషన్‌ బయట ఉన్న తోటి ప్రయాణికులను, రిక్షా కార్మికులను సాయం కోరినా ఎవరూ ముందుకు రాలేదు. దగ్గరలోనే పోలీసు స్టేషన్‌ ఉందని వారు చెప్పటంతో పరుగుపరుగున అక్కడికి వెళ్లి పోలీసుల సాయం కోరాడు. వారు వెంటనే అతనితోపాటు వాహనంలో రైల్వేస్టేషన్‌కు చేరుకోగా.. ఇద్దరు నిందితులు అప్పటికే పారిపోయారు. మరో నిందితుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతూ కనిపించాడు. పోలీసులు అతణ్ని, తర్వాత  మిగిలిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

రైల్వే పోలీసుల దారుణ వైఫల్యం
రైల్వేస్టేషన్‌లో భద్రత కల్పించాల్సిన బాధ్యత రైల్వే పోలీసులదే. అర్ధరాత్రి వేళైనా సరే వారు గస్తీ కాయాలి. కానీ రేపల్లె రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి విధుల్లో ఉన్న సిబ్బంది కార్యాలయానికి లోపల నుంచి తలుపులు వేసుకుని హాయిగా నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ బాధితురాలి భర్త సాయం కోసం ఎంతగా అరిచినా లేచి బయటకు రాలేదు. ఒక్క రైల్వే పోలీసు.. బాధితురాలి భర్త మొర విని అక్కడికి వచ్చినా ఈ అఘాయిత్యం జరిగి ఉండేది కాదు.

ఒంగోలు రిమ్స్‌కు బాధితురాలి తరలింపు
బాధితురాలికి రేపల్లె ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో ప్రాథమిక వైద్యం అందించి ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. బాధితురాలి ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. అయితే ఆమెను గుంటూరు జీజీహెచ్‌కు కాకుండా ఒంగోలు రిమ్స్‌కు తరలించడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై దళిత సంఘాలు అభ్యంతరం తెలిపాయి. గుంటూరు జీజీహెచ్‌కే తరలించాలని వారు అంబులెన్సుకు అడ్డుపడినా పోలీసులు పక్కకు లాగేశారు.


గంటల్లోనే పట్టుకున్న పోలీసులు

ఈ ఘటనలో నిందితులను బాపట్ల జిల్లా పోలీసులు కొద్ది గంటల్లోనే పట్టుకున్నారు. ఎస్పీ వకుల్‌ జిందాల్‌ రేపల్లె పోలీస్‌ స్టేషన్‌లో  వివరాలను వెల్లడించారు. ‘తాగిన మైకంలో ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. వారిని అరెస్టు చేశాం. బాధిత కుటుంబం గుంటూరు నుంచి శనివారం రాత్రి 11.30 గంటలకు రేపల్లె రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. నాగాయలంక వెళ్లటానికి బస్సుల్లేకపోవడంతో  స్టేషన్‌లోనే నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక నేతాజీనగర్‌కు చెందిన పాలుబోయిన విజయకృష్ణ (20), పాలుదురి నిఖిల్‌ (25), గతంలో పలు దొంగతనం కేసుల్లో నిందితుడైన మరో బాలుడు ఒకటో నంబరు ప్లాట్‌ఫాం మీదకు వచ్చారు. వారిలో ఇద్దరు యువకులు బాధిత మహిళను జుట్టుపట్టి పక్కకు లాక్కెళ్లి ప్లాట్‌ఫాంపైనే అత్యాచారం చేశారు. మరొకడు భర్తను నిర్బంధించి కాపలాగా ఉన్నాడు. వారి చెర నుంచి తప్పించుకుని బాధితురాలి భర్త ఒంటి గంట సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చి విషయం చెప్పారు. వెంటనే సిబ్బంది ఘటనా ప్రదేశానికి వెళ్లారు. ఆదివారం ఉదయం 7 గంటలకల్లా నిందితుల వివరాలు తెలిశాయి. నిందితులకు నేరచరిత్ర ఉంది. దొంగతనాల కేసుల్లో ఉన్నారు. నిందితుల్లో ఒకడు బాల నేరస్థుడు. అత్యాచారానికి పాల్పడింది ఇద్దరే. నిందితులపై 376, 394, 307, 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. విచారణలో తేలే అంశాల ఆధారంగా మరికొన్ని సెక్షన్ల కింద కేసులు పెడతాం. ఈ కేసులో ఎలాంటి రాజకీయ కోణం లేదు’ అని ఎస్పీ పేర్కొన్నారు. కేసు విచారణాధికారిగా బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావును నియమించారు. మరోవైపు నిందితుల్లో ఒకరికి వైకాపాతో సంబంధాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని