
Cyclone Gulab: కుదిపేసింది
శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు వణికించిన గులాబ్ తుపాను
లోతట్టు కాలనీలను ముంచెత్తిన వరద
వేర్వేరు ఘటనల్లో ఆరుగురి మృతి
1.64 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం
ఈనాడు - అమరావతి, విశాఖపట్నం, విజయనగరం, ఈనాడు డిజిటల్
శ్రీకాకుళం: గులాబ్ తుపాను శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు ఆరు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. తుపాను ముప్పు తప్పిందని ఊపిరి పీల్చుకుంటుండగా ఆదివారం అర్ధరాత్రి నుంచే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ పలుచోట్ల కుంభవృష్టి కురిసింది. మొత్తం 277 మండలాల్లోనూ వానలు పడ్డాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 98 మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడ్డాయి. గంటకు 60 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో ఉత్తరాంధ్రలో వేల సంఖ్యలో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు, విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. నదుల్లో ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. రోడ్లు, వంతెనల మీదుగా నీరు పారడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతంలోని ఇళ్లతోపాటు విద్యుత్తు సబ్స్టేషన్లు, పోలీస్స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వాసుపత్రుల్లోకి వరద నీరు చేరింది. తుపాను నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. వరద ముంచెత్తడంతో విశాఖపట్నంలో వాహనాలు నీటమునిగాయి.
తుపాను ప్రభావంతో ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా గారలో అత్యధికంగా 7 సెం.మీ వర్షం కురిసింది. రాత్రి 8 గంటలకు 13.4 సెం.మీ.కి చేరింది. ఆదివారం రాత్రి 11 గంటల వరకు శ్రీకాకుళం జిల్లాలో భారీవర్షాలు కురిశాయి. తర్వాత విశాఖపై గులాబ్ ప్రతాపం చూపింది. నగరంలోని తితిదే కల్యాణ మండపం ప్రాంతంలో 33.3 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది. పెందుర్తి, గాజువాక, పరవాడ, పెదగంట్యాడ తదితర ప్రాంతాల్లో 24.5 సెం.మీ నుంచి 33.3 సెం.మీ మధ్య వర్షం కురిసింది.
భారీ వర్షాలకు విశాఖపట్నంలో వేల ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. కొన్నిచోట్ల సోమవారం సాయంత్రానికి కూడా బయటకు పోలేదు. రహదారులపై నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. సుమారు 10 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మన్యంలో గెడ్డలు పొంగిపొర్లాయి. జిల్లాలో 147 విద్యుత్తు సబ్స్టేషన్లపై తుపాను ప్రభావం చూపడంతో వందల గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. రైవాడ, కోనాం మినహా మిగతా అన్ని డ్యామ్‌ల గేట్లు ఎత్తి నీరు కిందకు విడుదల చేస్తున్నారు.
*ఈదురుగాలులకు గార, శ్రీకాకుళం సహా తీర ప్రాంత మండలాల్లో భారీ సంఖ్యలో వృక్షాలు నేలకొరిగాయి. చాలా చెట్లు విద్యుత్తు తీగలపై పడడంతో విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. సోమవారం రాత్రి వరకూ శ్రీకాకుళం నగరం, గార, వంగర, కోటబొమ్మాళి సహా పలు మండలాల్లో విద్యుత్తుసరఫరా పునరుద్ధరణ కాలేదు.
* విజయనగరం జిల్లా నెల్లిమర్ల, గజపతినగరం, పూసపాటిరేగ ప్రాంతాల్లో గరిష్ఠంగా 23.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. వందలాది వృక్షాలు నేలకూలాయి. గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. సాలూరు మండలం మామిడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పూర్తిగా నీట మునిగి మందులు, పరికరాలు అన్నీ తడిచిపోయాయి.
*పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, టి.నర్సాపురం, కామవరపుకోట, ఆచంట, పెనుమంట్ర, చింతలపూడి, పోడూరు, కొవ్వూరు, చాగల్లు, భీమడోలు, పెనుగొండ, గణపవరం తదితర ప్రాంతాల్లోనూ 12 సెం.మీ. పైగా వర్షం కురిసింది. కొండవాగులు పొంగి, పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బుట్టాయిగూడెం మండలం వీరన్నపాలెం జల్లేరు వాగుపై కల్వర్టు కొట్టుకుపోయింది. తాడిపూడి కాలువకు గండి పడటంతో చేబ్రోలు- దూబచర్ల రహదారి నీట మునిగింది.
*తూర్పుగోదావరి జిల్లా రాయవరం, తాళ్లరేవు, కాజులూరు, కడియం, రామచంద్రాపురం, అమలాపురం, పి.గన్నవరం, కాకినాడ, రాజమహేంద్రవరం, మండపేట, అంబాజీపేట ప్రాంతాల్లో 10 సెం.మీ నుంచి 16 సెం.మీ వానలు పడ్డాయి. రంపచోడవరం- గోకవరం ప్రధాన రహదారిలో జాగరంవల్లి వద్ద భారీవృక్షం నేలకూలడంతో రాకపోకలు స్తంభించాయి. మారేడుమిల్లి మండలంలో పెళ్లిరేవు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో గర్భిణిని తీసుకెళ్తున్న అంబులెన్స్ నీటిలో నిలిచిపోయింది. స్థానికులు వాగు దాటించారు.
* కృష్ణా జిల్లా రెడ్డిగూడెం, ఉంగుటూరు, జి.కొండూరు, నందిగామ, నూజివీడు ప్రాంతాల్లో 10 సెం.మీ నుంచి 14.7 సెం.మీ మేర వర్షపాతం నమోదైంది. విజయవాడలో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి.
ఆరుగురి మృత్యువాత
భారీ వర్షాల ధాటికి విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గదబపేటలో చెట్టుకూలి ఒకరు, తమటాడలో గోడ కూలి మరొకరు చనిపోయారు. గుర్ల మండలం కోట గండ్రేడులో ప్రమాదవశాత్తు చెరువులోపడి ఒకరు మృత్యువాతపడ్డారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి అప్పలనరసయ్య కాలనీలో సోమవారం ఉదయం భావన (37) అనే మహిళ మరుగుదొడ్డిలో ఉండగా మరో ఇంటి గోడ కూలి మరుగుదొడ్డిపై పడటంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. సుజాతనగర్లో వర్షంతో విద్యుదాఘాతానికి గురై నక్కా కుశ్వంత్‌కుమార్ అనే ఏడేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. ఇందిరానగర్‌లో బోర వెంకటరమణ (46) ఆదివారం రాత్రి తన టైలరింగ్ దుకాణం మూసివేసి ఇంటికి వస్తూ మురుగుకాలువలో పడి కొట్టుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయారు.
విమాన సర్వీసులు ఆలస్యం
తుపాను కారణంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించక 7.20 గంటల బెంగళూరు ఇండిగో సర్వీసు సుమారు గంటన్నరపాటు గాల్లో చక్కర్లు కొట్టింది.
* విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 750 కి.మీ. మేర ఆర్ అండ్‌బీ రహదారులు, 50 కల్వర్టులు దెబ్బతిన్నాయి.
* బొర్రా- చిమిడిపల్లి మార్గంలోని కేకేలైన్‌లో రైలు పట్టాలపైకి బురద కొట్టుకొచ్చింది. కొత్తవలసలో రైలు పట్టాలపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎల్కోట సమీపంలో కొత్తవలస-కిరండోల్ మార్గంలో ఒక లైన్ దెబ్బతింది.
* శ్రీకాకుళం జిల్లాలో నాగావళికి భారీ ఎత్తున వరద పోటెత్తింది. 75వేల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో.. శ్రీకాకుళం నగరంతోపాటు ఆమదాలవలస, ఊర్జ మండలాల్లోని 20 గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. విశాఖపట్నంలో మేఘాద్రి జలాశయంలో నీటిమట్టం పెరగడంతో.. గేట్లు తెరిచి నీటిని వదిలారు. వెంగళరాయసాగర్ ప్రాజెక్టు గేట్లు పైకి లేవకపోవడంతో.. పై నుంచి నీరు ప్రవహించింది.
* తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 1.64 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 1.57 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 6,465 ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Atmakur ByElection: ఆత్మకూరు ఉపఎన్నిక... గెలుపు దిశగా వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి
-
Politics News
Bypolls: కొనసాగుతున్న 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు
-
World News
Imran Khan: ఇమ్రాన్‌ఖాన్ ఇంట్లోనే గూఢచారి..!
-
Politics News
Maharashtra crisis: ఓవైపు విమర్శలు.. మరోవైపు బుజ్జగింపులు
-
India News
India Corona : భారీగా తగ్గిన కొత్త కేసులు..
-
Movies News
Nagababu: దయచేసి అందరూ ఇలా చేయండి: నాగబాబు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- AP Liquor: మద్యంలో విషం
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- Teesta Setalvad: పోలీసుల అదుపులో తీస్తా సీతల్వాడ్
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-06-2022)