Ramoji Rao: రామోజీరావు.. ఒక విశ్వవిద్యాలయం

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఒక వ్యక్తి కాదని.. ఆయనొక విశ్వవిద్యాలయమని భాజపా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి స్మరించుకున్నారు.

Updated : 16 Jun 2024 06:40 IST

దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతుల నివాళులు

రామోజీరావుకు నివాళి అర్పించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు.
చిత్రంలో సహరి, బృహతి, విజయేశ్వరి, శైలజా కిరణ్, కిరణ్, కీర్తి సోహన

ఈనాడు, హైదరాబాద్‌: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఒక వ్యక్తి కాదని.. ఆయనొక విశ్వవిద్యాలయమని భాజపా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి స్మరించుకున్నారు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారనే నానుడికి సజీవ నిదర్శనం రామోజీరావు అని కొనియాడారు. తన భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి పురందేశ్వరి శనివారం ఫిల్మ్‌సిటీలోని రామోజీరావు నివాసానికి వెళ్లారు. ఇటీవల దివంగతులైన రామోజీరావుకు వారు నివాళులర్పించారు. ‘ఈనాడు’ ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, రామోజీరావు మనుమరాళ్లు సహరి, బృహతి, కీర్తి సోహన, ఇతర కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు కారణజన్ములని, అలాంటి వారికి మరణం ఉండదని, భావితరాలకు వారి జీవితం స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. పట్టుదల ఉంటే ఎంతటి సంక్లిష్ట పరిస్థితులనైనా అధిగమించి.. ముందడుగు వేయొచ్చని ఆయన జీవిత ప్రస్థానం నేర్పిన పాఠమని అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచిన రామోజీరావు.. జర్నలిజానికి సరికొత్త నిర్వచనం ఇచ్చారని వారు గుర్తు చేసుకున్నారు.

విజయవాడ సమీపంలోని పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, తెలంగాణ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, రావి నారాయణరెడ్డి ట్రస్టు అధ్యక్షుడు కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి.. రామోజీరావు నివాసానికి వెళ్లి.. ఆయనకు నివాళి అర్పించారు.

రామోజీరావు చిత్రపటం వద్ద అంజలి ఘటిస్తున్న తెలంగాణ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి,
రావి నారాయణరెడ్డి ట్రస్టు అధ్యక్షుడు కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని