ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌

రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ)గా సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అనుమతి కోసం ప్రభుత్వం పంపింది. శ్రీనివాస్‌ ఏజీగా నియమితులవడం ఇది రెండోసారి.

Updated : 19 Jun 2024 06:47 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ)గా సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అనుమతి కోసం ప్రభుత్వం పంపింది. శ్రీనివాస్‌ ఏజీగా నియమితులవడం ఇది రెండోసారి. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో 2016 మే 28 నుంచి 2019 వరకు ఆయన ఏజీగా బాధ్యతలు నిర్వహించారు. ఈనెల 20న తిరిగి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

దమ్మాలపాటి శ్రీనివాస్‌ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కంచికచర్లలో నాగేశ్వరరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించారు. 1991లో వెలగపూడి దుర్గాంబ సిద్ధార్థ న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. అదే ఏడాది బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకుని హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. తర్వాత సీనియర్‌ న్యాయవాది ఎస్‌.ఆర్‌.అశోక్‌ వద్ద రాజ్యాంగం, సివిల్, క్రిమినల్, పన్నులకు సంబంధించిన కేసుల్లో ప్రాక్టీసు చేసి మంచి పేరు సంపాదించారు. 1996 నుంచి 2005 వరకు రైల్వే స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, 1999 నుంచి 2003 వరకు కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. 1996 నుంచి 2002 వరకు ఆదాయపు పన్ను శాఖ జూనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2000 నుంచి 2005 మధ్య కాలంలో పంచాయతీరాజ్‌ సంస్థలు, మున్సిపాలిటీలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా విధులు నిర్వర్తించారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. పలు కార్పొరేట్‌ సంస్థలకు న్యాయవాదిగా, న్యాయ సలహాదారుగా సేవలు అందించారు.

మొదట అదనపు ఏజీగా.. 

2014 జూన్‌ 30 నుంచి ఏపీ ‘అదనపు’ అడ్వొకేట్‌ జనరల్‌గా హైకోర్టు, సుప్రీంకోర్టు, హరిత ట్రైబ్యునల్‌ వద్ద పలు కీలక కేసుల్లో ఏపీ సర్కారు తరఫున వాదనలు వినిపించి విజయం సాధించారు. హైకోర్టులో పోలవరం ప్రాజెక్టు భూసేకరణ కేసులు, చిత్తూరు జిల్లా ఎర్రచందన కూలీల ఎన్‌కౌంటర్‌ కేసు, చిత్తూరు జిల్లాలో హీరో మోటోకార్ప్‌కు కేటాయించిన భూ వివాదంపై కేసులు, పట్టిసీమ ప్రాజెక్టును సవాలు చేస్తూ దాఖలైన కేసు, రాజధాని అమరావతి భూసమీకరణ పథకంపై కేసులలో వాదనలు వినిపించి అవరోధాలు తొలగిపోయేలా చేశారు. 2014 జూన్‌ నుంచి ఏజీగా ఉన్న సీనియర్‌ న్యాయవాది పి.వేణుగోపాల్‌ రాజీనామా చేయడంతో 2016 మే 28న దమ్మాలపాటిని రాష్ట్ర ప్రభుత్వం ఏజీగా నియమించింది. 

సమర్థంగా వాదనలు

చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైకాపా ప్రభుత్వం వరుసగా అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేసింది. ఈ సందర్భంలో చంద్రబాబు హక్కులను కాపాడడంలో దమ్మాలపాటి శ్రీనివాస్‌ కీలక పాత్ర పోషించారు. విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకు అలుపెరగని న్యాయ పోరాటం చేశారు. మరోవైపు కక్షసాధింపు కోసం వైకాపా ప్రభుత్వం నమోదు చేసిన కేసులలో తెదేపా నేతల పక్షాన సమర్థంగా వాదనలు వినిపించారు. పలు మీడియా సంస్థలను వేధించడం కోసం గత ప్రభుత్వం నమోదు చేసిన తప్పుడు కేసులలో వాదనలు వినిపించి వాటిని తిప్పికొట్టారు. రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధంగా రాజధానేతర ప్రాంతవాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు, 1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలలో విజయవంతంగా వాదనలు వినిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని