Andhra News: పాఠశాల అకడమిక్‌ క్యాలండర్‌ విడుదలలో జాప్యం

పాఠశాలలు పునఃప్రారంభమై మూడువారాలు గడిచినా అకడమిక్‌ క్యాలండర్‌ రూపకల్పన ఇంతవరకు పూర్తికాలేదు.

Published : 07 Jul 2024 05:07 IST

బడుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై రాని స్పష్టత 

ఈనాడు, అమరావతి: పాఠశాలలు పునఃప్రారంభమై మూడువారాలు గడిచినా అకడమిక్‌ క్యాలండర్‌ రూపకల్పన ఇంతవరకు పూర్తికాలేదు. వైకాపా హయాంలో నియమితులైన ఉద్యోగులనే కొనసాగిస్తుండడంతో వారు దీనిపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు సైతం దీనిపై ఆసక్తి చూపడం లేదు. పాఠశాలల్లో ఏ నెలలో ఏ కార్యక్రమాలు నిర్వహించాలి? వారంలో ఏయే సబ్జెక్టులు బోధించాలి? క్రీడలు, పండగలు, సెలవులు ఇలా అన్ని అంశాలతో ఏటా అకడమిక్‌ క్యాలండర్‌ను విడుదల చేస్తారు. ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వంలో నియమితులైన అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫోన్లలోనే సమాచారం ఇస్తూ అకడమిక్‌ వ్యవహారాలు సాగిస్తున్నారు. క్యాలండర్‌ విడుదల చేస్తే పాఠశాలల్లో నిర్వహించాల్సిన కార్యకలాపాలపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు స్పష్టత వస్తుంది. దీంతోపాటు సెలవులు, పనిదినాలు తెలిస్తే వీటికి అనుగుణంగా బోధనకు ప్రణాళిక రూపకల్పన చేసుకుంటారు. సాధారణంగా బడుల పునఃప్రారంభానికి ముందే క్యాలండర్‌ విడుదల చేయాలి.

ఒక్కో అధికారికి రెండేసి బాధ్యతలు..

పాఠశాల విద్యాశాఖలో ఒక్కో ఉన్నతాధికారికి రెండేసి బాధ్యతలు అప్పగించారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా ఉన్న సురేష్‌కుమార్‌ సాధారణ పరిపాలన (పొలిటికల్‌) కార్యదర్శిగానూ ఉన్నారు. వయోజన విద్య డైరెక్టర్‌గా ఉన్న నిధి మీనాకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి, కమిషనరేట్‌ బాధ్యతలు అప్పగించారు. సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలల్లో మౌలికసదుపాయాల కల్పన విభాగం కమిషనర్‌గాను ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని